Monday, December 23, 2024

అగ్నిపథ్ పథకంపై పునరాలోచించాలి: జెడియు

- Advertisement -
- Advertisement -

జెడియు సూచన

న్యూఢిల్లీ: బిజెపి సారథ్యంలో ఎన్‌డిఎ ప్రభుత్వ ఏర్పాటకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించిన కొన్ని గంటల్లోనే నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్(యునైటెడ్) సాయుధ దళాలలో సైనికుల నియామకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకంపై అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ పథకాన్ని కొనసాగించడంపై పునరాలోచించాల్సిన అవసరం ఉందని జెడియు అభిప్రాయం వ్యక్తం చేసింది. జెడియు అధికార ప్రతినిధి కెసి త్యాగి గురువారం ఒక న్యూస్ చానల్‌తో మాట్లాడుతూ అగ్నిపథ్ పథకంపై మళ్లీ కొత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉందని అన్నారు.

2022 జూన్‌లో ఈ పథకాన్ని ప్రకటించిన తరువాత అసంతృప్తి వ్యక్తమవుతోందని ఆయన అన్నారు. అసంతృప్తి చెందుతున్న కుటుంబాల ఆగ్రహం ఇటీవలి లోక్‌సభ ఎన్నికలలో బయటపడినట్లు తాను భావిస్తున్నానని ఆయన చెప్పారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బుధవారం న్యూఢిల్లీలో నరేంద్ర మోడీ నిర్వహించిన సమావేశంలో పాల్గొని మోడీ నాయకత్వంలో ఎన్‌డిఎ ప్రభుత్వ ఏర్పాటుకు తన మద్దతును ప్రకటించారు. కాగా..లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో అగ్నిపథ్ పథకంఅమలు, యువత భవిష్యత్తుపై ప్రస్తావనకు వచ్చింది.

తాము అధికారంలోకి వస్తే అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేస్తామని కాంగ్రెస్ వాగ్దానం చేసింది. అగ్నిపథ్ పథకం కింద నియమితులైన సైనికులు విధి నిర్వహణలో మరనిస్తే రెగ్యులర్ సైనికుల కుటుంబాలకు అందచేసిన విధంగానే వారి కుటంబాలకు కూడా ప్రయోజనాలు అందచేయాలని బిజెపి ఎంపి జువల్ ఓరం అధ్యక్షతలోని రక్షణ రంగానికి సంబంధించిన పార్లమెంటరీ స్థాయీ కమిటీ గత ఏడాది డిసెంబర్‌లో ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం విధి నిర్వహణలో మరనించిన అగ్నివీరుల కుటుంబాలకు పెన్షన్ సౌకర్యం లభించదు. రెగ్యులర్‌గా నియమితులైన సైనికులు విధి నిర్వహణలో మరణిస్తే ఆ కుటుంబానికి జీవితకాలం పెన్షన్ లభిస్తుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News