Saturday, November 23, 2024

మంచి పరిణామం

- Advertisement -
- Advertisement -

Agreement reached between India and China

 

భారత చైనాల మధ్య మళ్లీ సామరస్య శకానికి నాంది ప్రస్తావన జరిగిందనడానికి సంకేతంగా ఒక మంచి పరిణామం చోటు చేసుకున్నది. గత కొన్ని మాసాలుగా రెండు దేశాల మధ్య ఏర్పడిన ఉద్రిక్త వాతావరణం చల్లబడడం ప్రారంభమైందనే అభిప్రాయానికి ఇది ఆస్కారం కలిగిస్తున్నది. ఇందుకు రెండు దేశాల ప్రజలూ హర్షిస్తారని చెప్పవచ్చు. తూర్పు లడఖ్‌లోని పాంగాంగ్ సరస్సు ఉత్తర దక్షిణ తీరాల నుంచి సైన్యాల ఉపసంహరణకు భారత చైనాల మధ్య అంగీకారం కుదిరిందని మన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం నాడు రాజ్యసభలో విస్పష్ట ప్రకటన చేశారు. ఈ ఒప్పందం మేరకు సైన్యాలను వెనక్కి తీసుకోడం బుధవారం నాడే ప్రారంభమైనట్టు బోధపడుతున్నది. ఈ సమాచారాన్ని ముందుగా చైనా సైన్యమే బుధవారం నాడు ప్రకటించింది. రాజ్‌నాథ్ సింగ్ సోమవారం నాడు రాజ్యసభలో దానిని ధ్రువపరిచారు. భాయీ భాయీ (సోదర సంబంధాలు) బంధం నెలకొన్నా లేకపోయినా బాహాబాహీ శత్రుత్వం కొనసాగకుండా చూసుకోడమే ఇరుగుపొరుగు దేశాలకు శ్రేయస్కరం.

ముఖ్యంగా జనాభాలో ప్రపంచంలోనే ప్రథమ, ద్వితీయ స్థానాల్లో ఉండి భుజాలు రాసుకుంటూ బతుకుతున్న చైనా ఇండియాల మధ్య సరిహద్దుల్లో ప్రశాంతత స్థిరపడడం ఈ రెండు దేశాలకే కాక అంతర్జాతీయ శాంతికి, బాగుకు కూడా అత్యంత ఆవశ్యకం. 1962 యుద్ధం తర్వాత రెండు దేశాల మధ్య వాస్తవాధీన రేఖ (ఎల్‌ఎసి) వద్ద చెప్పుకోదగిన హింసాయుత ఘటనలు సంభవించలేదు. అటువంటి సుదీర్ఘ సామరస్య అధ్యాయానికి తెర దించుతూ గత ఏడాది మే నెల నుంచి ఘర్షణల ఘట్టం మొదలైంది. ఒక దశలో అది తీవ్ర రూపం ధరించి రెండు దేశాల మధ్య దూరాన్ని మరింతగా పెంచింది. దౌత్య వాణిజ్య సంబంధాల మీద కూడా తీవ్ర ప్రభావాన్ని చూపింది. 2020 జూన్ 14 / 15 తేదీల మధ్య పాంగాంగ్ సరస్సు వద్ద తలెత్తిన భౌతిక ఘర్షణల్లో మన సైనికులు 20 మంది దుర్మరణం పాలయ్యారు. తన వైపు సంభవించిన ప్రాణ నష్టం ఎంతో ఇదమిత్థంగా చైనా ప్రకటించలేదు. అయితే ఆ ఘర్షణల్లో 45 మంది చైనా సైనికులు దుర్మరణం పాలైనట్టు రష్యా నుంచి తాజాగా వచ్చిన సమాచారం వెల్లడించింది.

చైనా సైన్యం ఎల్‌ఎసిని ఉల్లంఘించి మన భూభాగంలోకి చొచ్చుకురావడాన్ని మన సేనలు అడ్డుకున్నందునే ఆ ఘర్షణలు జరిగాయి. అప్పటి నుంచి ఇరు సైన్యాలు పూర్వపు స్థానాలకు ఉపసంహరించుకునేలా చూడడానికి రెండు దేశాల సైనిక కమాండర్ల స్థాయిలో చర్చలు జరుగుతూ వచ్చాయి. ఇప్పటి వరకు ఈ చర్చలు 9 సార్లు జరిగాయి. చైనా సైన్యం మధ్య మధ్యలో కొత్త ప్రాంతాల్లో చొరబాటుకు ప్రయత్నించగా మన సేనలు విజయవంతంగా అడ్డుకున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. గత నెల 22న కూడా ఉత్తర సిక్కిం సరిహద్దుల్లోని నాకూ లా వద్ద చైనా సేనలు ఉల్లంఘనకు ప్రయత్నించగా మన సైన్యాలు అడ్డుకున్నాయని ఆ సమయంలో స్వల్పంగా ఘర్షణలు చోటు చేసుకున్నాయని వార్తలు వెల్లడించాయి. వాస్తవానికి గత ఏడాది మే 5వ తేదీనే పాంగాంగ్ సో సరస్సు ఉత్తర తీరంలో రెండు దేశాల సేనల మధ్య మొట్టమొదటి సారి ఘర్షణ సంభవించింది. ఆ తర్వాత 10 రోజుల వ్యవధిలో వాస్తవాధీన రేఖ పొడవునా పాంగాంగ్, గల్వాన్, దేప్‌సాంగ్, సిక్కిం తదితర చోట్ల చైనా సేనలు మన భూభాగంలోకి చొచ్చుకు రాగా మన సైన్యాలు ప్రతిఘటించినట్టు సమాచారం.

జూన్ 14/15 రక్తసిక్త ఘటన తర్వాత ఆ నెల 19వ తేదీన మన ప్రధాని నరేంద్ర మోడీ అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి మన భూభాగం ఒక్క అంగుళం కూడా అన్యాక్రాంతం కాలేదని ప్రకటించారు. ఆ ప్రకటన దేశంలో తీవ్ర వివాదానికి తెర లేపింది. వాస్తవానికి గల్వాన్ లోయలో చైనా సైన్యాలు 423 మీటర్ల మేరకు మన భూభాగంలోకి చొచ్చుకు వచ్చినట్టు 2020 జూన్ 25వ తేదీన బయటపడిన ఉపగ్రహ చిత్రాలు వెల్లడించినట్టు కూడా వార్తలు వెలువడ్డాయి. రాజ్‌నాథ్ సింగ్ సోమవారం నాడు రాజ్యసభలో చేసిన ప్రకటనను బట్టి చైనా 43,000 చదరపు కి.మీ భారత భూభాగాన్ని ఆక్రమించుకొని ఉంది. ఇందులో 38,000 చదరపు కి.మీ లడఖ్ వద్ద గల భూభాగమే.

ఈ దురాక్రమణ నుంచి చైనా పూర్తిగా తప్పుకోవలసి ఉంది. అది మనం అనుసరించే సైనికేతర వ్యూహాల మీద, అంతర్జాతీయ ఒత్తిడిపైనా ఆధారపడి ఉంటుంది. ఆర్థికంగా బాగా బలం పుంజుకొని అమెరికాతో పోటీ పడుతున్న చైనా సామ్రాజ్య విస్తరణ దాహం కూడా పెంచుకుంటున్న సంగతి తెలిసిందే. భారత చైనాల మధ్య అశాంతిని స్వప్రయోజనాలకు వాడుకోవాలనుకునే దృష్టి అమెరికా వంటి దేశాలకు సహజంగానే ఉంటుంది. అటువంటి పరిస్థితి తలెత్తితే అది ప్రపంచ శాంతికే ప్రమాదకారి అవుతుంది. అందుచేత చర్చల మార్గంలో చైనాను దారికి రప్పించుకోడానికి భారత ప్రభుత్వం చేస్తున్న ప్రస్తుత కృషి ఇలాగే మరిన్ని సత్ఫలితాలను ఇవ్వగలదని ఎదురు చూద్దాం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News