Monday, December 23, 2024

మేం పంచుతే..వారు పెంచుతున్రు

- Advertisement -
- Advertisement -

దుబ్బాక : పంచుడు కెసిఆర్ వంతు అయితే ధరలు పెంచుడు కేంద్రంలో ఉన్న బిజెపి సర్కార్ వంతు అని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన నూతన మార్కెట్ కమిటి పాలక వర్గ ప్రమాణ స్వీకారణ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ ఆవులను, దేశ సైనికులను , దేవుళ్లను పూజించే సంస్కృతి తమదైతే వాటిని రాజకీయాల కోసం వాడుకునే సంస్కృతి బిజేపొళ్లది అన్నారు. కోట్ల కొద్ది కొలువులు భర్తి, జన్‌దన్ ఖాతాల్లో 15 లక్షల చోప్పున జమ చేస్తామని చెప్పిన బిజేపోళ్లు ఎందుకు భర్తి చేయడం లేదని ప్రశ్నించారు. అబద్దాలు ఎన్ని రోజులు చెప్పిన అవి నిజాలుగా మారవన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న కేంద్ర సర్కార్ డిజిల్ దరలు మాత్రం రెట్టింపు చేసి రైతులకు ఇబ్బందుల్లోకి నెట్టిందన్నారు.

బిజెపి అగ్రనేత బిఎల్ సంతోష్ ఇటీవల మాట్లాడుతూ తమ బిజేపికి తెలంగాణలో 30 సీట్లు వస్తాయన్న మాట మాట్లాడారని ఆ పార్టీ వారికే వారి అభ్యర్ధులు గెలుస్తారన్న నమ్మకం లేదన్నారు.ఆ పార్టీలో చేరికల కమిటీ వేసి ఇతర పార్టీల నాయకులకు బెదిరింపులకు గురి చేస్తూ చిల్చూతున్నారని మండిపడ్డారు. ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టి ప్రభుత్వరంగ సంస్థలను అమ్మడం తప్ప బిజెపి చేసింది ఏమి లేదని ఆరోపించారు. ఇక ముందు ప్రజలు బిజేపోళ్ల మాటలు నమ్మెపరిస్ధితి లేరని స్పష్టం చేశారు. దుబ్బాక ప్రజలపై సిఎం కెసిఆర్‌కు ఎంతో ప్రేమ ఉందన్నారు. ఈ ప్రాంతంలోని విద్యాలయంలో చదువుకున్న బిడ్డ కాబట్టే దుబ్బాక అభివృద్ది కోసం కృషి చేస్తున్నారన్నారు. దుబ్బాకలో బిజెపి ఎంఎల్ఎ ఉన్న నియోజక వర్గంలో మాత్రం ఒక్కటోక్కటిగా అభివృద్ది పనులు పూర్తి చేస్తున్నామన్నారు. ఇప్పటికే దుబ్బాక నియోజక వర్గంలో అనేక అబివృద్ది కార్యక్రమాలు చేసి ప్రజలకు సేవలు అందిస్తున్నామన్నారు.

అతి త్వరలోనే దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసీస్ సేవలు ప్రారంభించుకోబోతున్నామన్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గాలను సమానంగా చూసి అభివృద్ది పరుస్తున్న ఘనత సిఎం కెసిఆర్‌ కే దక్కుతుందన్నారు. బిజేపి పాలిత ప్రాంతాలలో తెలంగాణ తరహా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారా అని ప్రశ్నించారు. దుబ్బాక బస్ స్టేషన్‌ను సకల హంగులతో 4 కోట్ల వ్యయంతో నిర్మించి మూడు సూపర్ లెగ్జరీ బస్సు సర్వీసులను ప్రారంభించుకున్నామన్నారు. ఈ ప్రాంతం నుండి తిరుపతి వరకు బస్సు సర్వీసును నడుపుతున్నామన్నారు. రాబోయే ఎన్నికల్లో దుబ్బాకలో బిఆర్‌ఎస్ గెలుస్తుందన్నారు. ప్రజలు సైతం మంచి చేసేవారికి మనుసులో పెట్టుకొని పట్టం కట్టాలన్నారు.

మిషన్ 90 కాదు.. దమ్ముంటే 9 సీట్లు గెలిపించి చూపించాలి బిజెపొళ్లకు సవాల్ విసిరిన మంత్రి నిరంజన్ రెడ్డి
బిజెపొళ్లు మిషన్ 90 అంటూ రాబోయే ఎన్నికల్లో తమదే అధికారం అంటూ గొప్పలు చెప్పుకోవడం కాదని దమ్ముంటే 9 సీట్లు గెలిపించి చూపించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సవాల్ విసిరారు. బిజెపి పాలిత ప్రాంతాలలో ఏ ఒక్క ప్రాజెక్టు అయిన కట్టి రైతాంగానికి సాగు నీటిని అందిస్తున్నారా అని ప్రశ్నించారు. అదే సిఎం కెసిఆర్ రైతుల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి సాగు నీరు అందిస్తుంటే బిజేపోళ్లు చూసి ఓర్వలేక పోతున్నారన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ పరిశ్రమలు తీసుకువచ్చి లక్షలాది మందికి ఉపాధి కల్పించే దిశగా కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10వ సారి రైతు బందు కింద పంట పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నామన్నారు. ఇప్పటికే 65,559 కోట్ల సహాయాన్ని రైతు బందు కింద ఇవ్వడం జరిగిందన్నారు. కరోనా కష్ట కాలంలో సైతం రైతుబంధును ఇచ్చి రైతులకు అండగా నిలిచిన ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కుతుందన్నారు. వ్యవసాయ వృద్ది రేటులో తెలంగాణ మొదటి స్ధానంలో ఉందన్నారు.

సిద్దిపేట, దుబ్బాక నియోజక వర్గాల బారాన్ని మంత్రి హరీశ్‌రావు మోపుతూ అభివృద్దిని వేగవంతం చేస్తున్నారన్నారు. ఒకప్పుడు బుక్కెడు నీటి కోసం అలమటించిన సిద్దిపేట జిల్లా నేడు సిఎం కెసిఆర్ పాలనలో సస్యశ్యామలంగా మారిందన్నారు. ఎటు చూసిన గోదావరి జలాలతో పచ్చని పోలాలు దర్శనమిస్తున్నాయన్నారు. సిద్దిపేట రంగనాయక సాగర్‌ను చూస్తుంటే ఎక్కడో సముద్రాన్ని చూసినట్లు ఉందన్నారు. అంతకు ముందు నూతన కమిటీ పాలక వర్గాన్ని మంత్రులు శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎంఎల్ సిలు ఫారుఖ్ హుస్సెన్, బండ ప్రకాశ్, యాదవరెడ్డి, ఆర్టీసీ కార్పోరేషన్ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, గిడ్డంగుల కార్పోరేషన్ చైర్మన్ సాయి చంద్, జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజా శర్మ, ప్రజాప్రతినిధులు, నాయకులు బక్కి వెంకటయ్య, రవీందర్, గన్నెవనిత, చింతల జ్యోతి కృష్ణ, కొత్తపుష్పలత కిషన్ రెడ్డి, రొట్టె రాజమౌళి, చిందం రాజ్‌కుమార్, భూంపల్లి మనోహర్ రావు, వెంకట నర్సింహ్మారెడ్డి, మోహన్ రెడ్డి తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News