ఆయుధాలే కాదు ఆహార ధాన్యాలకు కూడా విదేశాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితులను నేడు దేశం ఎదుర్కొంటున్నది. అధికార మార్పిడి జరిగిన దగ్గర నుండి పాలక ప్రభుత్వాలన్నీ వ్యవసాయ రంగం లో స్వతంత్ర విధానాలు అమలు జరిపి దేశ ప్రజల ఆహార అవసరాలను తీర్చే విధంగా కాకుండా సామ్రాజ్యవాదుల ప్రయోజనాలకు అనుకూలమైన వ్యవసాయ విధానాలు అమలు జరపడం వల్లే పప్పు, నూనె గింజల్లో స్వయం సమృద్ధి లేకపోవడానికి కారణమైంది.1970 దాకా పెద్ద ఎత్తున బియ్యాన్ని దిగుమతి చేసుకుంటే నేడు పప్పులు, నూనెలు అదే తరహాలో దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.పప్పులు, నూనెల కొరత, దిగుమతుల వల్ల వాటి ధరలు నిరంతరం పెరుగుతూ సామాన్య కుటుంబాలను ఆర్థిక సంక్షోభంలోకి నెడుతున్నాయి. దేశంలోని ప్రతి కుటుంబం తప్పనిసరిగా కందిపప్పు ను ఆహారంలో వినియోగిస్తాయి. పేదలకు, సామాన్యులకు లభించే పోషకాహారం కందిపప్పే. ఇప్పుడు ఆ కందిపప్పు కూడా వారికి అందుబాటులో లేనివిధంగా ధర పెరుగుతూ సంపన్న వర్గాలకే పరిమితమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. నాలుగైదు సంవత్సరాల క్రితం 60 లేక 70 రూపాయలకు లభించిన కందిపప్పు నిరంతరం పెరుగుతూ నేడు కిలో రూ. 180కి చేరింది.
2023 ఫిబ్రవరి సీజన్‌లో 90 నుండి 100 రూపాయల ధర వున్న కందిపప్పు జూన్‌లో రూ. 135 పెరిగి నేడు 185 రూపాయలకు ధర ఎగబాకింది. మారుమూల ప్రాంతాల్లో రూ. 200 దాకా కిలో ధర పలుకుతున్నది. కందిపప్పుతో పాటు పెసరపప్పు కిలో ధర రూ. 100 నుండి రూ. 120, మినపప్పు రూ. 80 నుండి 120, మేలు రకం రూ. 160 దాకా కిలో ధర పలుకుతున్నది. సెనగపప్పు కూడా రూ. 70 నుండి రూ. 100 చేరింది.ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు దేశంలో కంది సాగు 40.20 లక్షల ఎకరాలుగా ఉంటే, అందులో 11% కంటే ఎక్కువగా సాగు విస్తీర్ణత తగ్గింది. ఆంధ్రప్రదేశ్‌లో 12 లక్షల, తెలంగాణలో 6 లక్షల ఎకరాల్లో మాత్రమే కంది సాగుతున్నది. ఇది గత విస్తీర్ణత కన్నా తక్కువ. తెలుగు రాష్ట్రాలే కాకుండా మహారాష్ట్ర, కర్నాటక తదితర రాష్ట్రాల్లో కూడా కంది పంట సాగు చేస్తున్నారు. కంది సాగు విస్తీర్ణత తగ్గటానికి ఆ పంటపై రైతాంగానికి న్యాయమైన ధర లభించకపోవడమే. 2018లో దేశంలో మొత్తం కందిపప్పు ఉత్పత్తి 43 లక్షల టన్నులు ఉండగా, 2023లో 34 లక్షల టన్నులకు పడిపోయింది.
2022- 23 పంట సీజన్‌లో కందిపప్పు ఉత్పత్తి లక్ష్యం 45.50 లక్షల టన్నులుగా ఉండగా, ఉత్పత్తి మాత్రం 34.30 లక్షలగా ఉంది. ఫలితంగా భారత వార్షిక పప్పుధాన్యాల వినియోగంలో 15% దిగుమతి చేసుకుంటుండగా, 2020- 21లో 24.66 లక్షల టన్నుల పప్పులను దిగుమతి చేసుకుంటే, 2021 -22లో 26.99 లక్షల టన్నుల పప్పులను దిగుమతి చేసుకున్నాం. కందిపప్పుకనీస దిగుమతి ధరను రూ. 351 పెంచమని సెంట్రల్ అరెకానట్ అండ్ కోకో మార్కెటింగ్ అండ్ ప్రాసెసింగ్ ఆపరేటివ్ లిమిటెడ్ కోరగా, అందుకు ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వానికి ఆ సంస్థ ప్రెసిడెంట్ ఎ. కిషోర్ కుమార్ కోడ్గి కృతజ్ఞతలు తెలిపారు. ఇదే కాకుండా కందిపప్పు, మినప పప్పు దిగుమతులపై 2025 వరకు ఎటువంటి ఆంక్షలు ఉండవని ప్రభుత్వం పేర్కొన్నది. ఫలితంగా దేశీయ మార్కెట్లో కంది పప్పు ధర పెరుగుతూ ఉంది. దేశ అవసరాల కన్నా ఎక్కువ ధాన్యాన్ని పండించి బియ్యం ఎగమతి చేసే స్థాయికి ఎదిగామని చెప్పే దేశ పాలకులు అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందం ప్రకారం విదేశాల నుంచి బియ్యం దిగుమతి చేసుకోవడాన్ని ఎందుకు మభ్యపెడుతున్నారు.
దేశంలో బియ్యం ధరలు ఎందుకు పెరుగుతున్నాయో కూడా చెప్పడం లేదు. దేశ అవసరాలను మించి ధాన్యం ఉత్పత్తి జరిగి బియ్యం ఎగుమతి స్థాయికి చేరినప్పుడు బియ్యం ధరలు తగ్గాలి గాని పెరగకూడదు గదా! ధరలు ఎందుకు పెరుగుతున్నాయి. కోట్లాది మంది ప్రజలు ఆకలితో ఎందుకు అలమటిస్తున్నారు. 2022లో గోధుమ ఎగుమతులను, 2023లో బియ్యం ఎగుమతులపై నిషేధం ఎందుకు విధించారు అన్న ప్రశ్నలకు మోడీ ప్రభుత్వం నుంచి సమాధానం రావడం లేదు. 2018లో కిలో 40 రూపాయలు ఉన్న మేలు రకం బియ్యం ఇప్పుడు రూ. 58 ఎందుకు చేరింది? ప్రైవేట్ మార్కెట్లో 75 కేజీల మేలు రకం ధాన్యం బస్తాకు 2 వేల ధర ప్రస్తుతం లభిస్తున్నది. బస్తాకి 45 కేజీల పాలిస్ బియ్యం లభిస్తున్నది. కేజీ 45 రూపాలు పడుతుంది. వ్యాపారులకు మూడు రూపాయలు కలిపినా 48 రూపాయలకు మించదు. మార్కెట్లో మాత్రం వినియోగదారులు 58 రూపాయలు చెల్లిస్తున్నారు. అంటే కేజీపై అదనంగా వినియోగదారుల నుండి 10 రూపాయల వ్యాపారులు పొందుతున్నారు. దీని ప్రకారం బస్తా ధాన్యంపై వ్యాపారులు 450 రూపాయలు ప్రజల నుంచి కాజేస్తున్నారు.
ఈ దోపిడీని పాలకులు ఎందుకు అరికట్టలేకపోతున్నారు. మద్దతు ధర ప్రకార మైతే మేలు రకం బియ్యం కేజీ 35 రూపాయలకే ప్రజలకు అందించవచ్చు. ఆ పని ప్రభుత్వాలు ఎందుకు చేయటం లేదు? వంట నూనెల ఉత్పత్తిలో భారత దేశం చాలా వెనకబడి ఉంది. అవసరమైన వినియోగంలో 56% పైగా నూనె లు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాము. పామాయిల్ దిగుమతిలో 50% పైగా ఇండోనేషియా, మలేసియాల నుండి వస్తున్నది. 2022లో 80 వేల కోట్ల విలువైన కోటి మెట్రిక్ టన్నులను ముడి పామాయిల్‌ను భారత దేశం దిగుమతి చేసుకుంది. దేశంలో 3 లక్షల టన్నుల పామాయిల్ ఉత్పత్తి మాత్రమే జరుగుతున్నది. ఉక్రెయిన్, రష్యా, బ్రెజల్ దేశాల నుంచి సన్‌ప్లవర్ ఆయిల్, యుఎస్ నుండి సోయాబిన్ దిగుమతి చేసుకుంటున్నాము. పామాయిల్ దిగుమతులు పెరగటానికి ప్రధాన కారణం ఎగుమతి దేశాలైన ఇండోనేషియా, మలేసియాలు అక్కడి పరిశ్రమలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం కల్పిస్తున్నాయి. ఇతర దేశాల కన్నా తక్కువ రేటుకి ఎగుమతి చేస్తున్నాయి. ఇవి కాక ప్రపంచంలోనే ప్రముఖ కూరగాయల కొనుగోలు దారుగా భారత్ ఉంది.
నూనెలకు ఎక్కువగా దిగుమతులపై ఆధారపడడం వలన అంతర్జాతీయ మార్కెట్లో వీటి ధరలు ఆధారపడి ఉన్నాయి. మార్కెట్ ధరలను తమ ప్రయోజనాలకు అనుకూలంగా బడా అంతర్జాతీయ వ్యాపార సంస్థలు ధరలను నిర్ణయిస్తున్నాయి. వాటి ప్రయోజనాల కోసమే అప్పుడప్పుడు ధరలు తగ్గించినట్లు ప్రచారం చేస్తున్నాయి. అందులో భాగమే భారత్‌లో నేడు నూనె ధరల తగ్గింపు ప్రచారం. మదర్ డైరీ, ఇవోమ సంస్థ, వెడిబుల్ ఆయిల్ జెమినీ మొదలైన సంస్థలు లీటరు పైన రూ. 15 నుంచి 30 తగ్గించినట్లు ప్రచారం చేస్తున్నాయి. 2021లో సన్‌ప్లవర్ ఆయిల్ లీటర్ 190 నుంచి 200, పామాయిల్ 160 నుంచి 170 వరకు ధర పెరిగింది. 2023 మే లో కూడా సన్‌ఫ్లవర్ ఆయిల్ 180 రూపాయల ధర ఉంది. ప్రస్తుతం దాని ధర తగ్గిన మాట వాస్తవమే. వంటగ్యాస్ ధర రూ. 700 పెంచి రెండు వందలు తగ్గించినట్లు ప్రచారం చేసినట్లుగానే, వంట నూనెల ధరలు బాగా పెంచి 20 రూపాయలు తగ్గిందని చెబితే అది వంచన మాత్రమే. కొద్ది రోజుల్లోనే అంతర్జాతీయ మార్కెట్ల్లో ధరలు పెరిగాయనే పేరుతో దేశంలో వంటనూనె ధరలు తిరిగి పెరుగుతాయనడంలో సందేహానికే ఆస్కారం లేదు.
అపరాలు, బియ్యం, నూనెల ధరలు పెరగడానికి పాలక ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు, పంటల సమతుల్యత లోపించటమే మౌలిక కారణం అన్నది అర్ధం కావాలి. 1970 దాకా గ్రామీణ రైతు కుటుంబాలు నూనెలు, పప్పుల, బియ్యం విషయంలో స్వయం సమృద్ధి కలిగి ఉన్నారు. ధాన్యంతో పాటు కంది, మినుము, పెసర, నువ్వులు, ఆవాల పంటలు పండించేవారు. ధాన్యంతో పాటు, కందులు, మినుములు సంవత్సరానికి సరిపోను ఇంట్లో నిల్వ చేసుకునేవారు. బయట మార్కెట్లో చాలా తక్కువ మంది మాత్రమే కొనుగోలు చేసేవారు. రాయలసీమ, ఇతర గరువు నేలల ప్రాంతాల్లో వేరుశనగ పండించే వారు. నూతన ఆర్ధిక విధానాల ప్రవేశంతో పంటల సమతుల్యత స్థానే ఎగుమతికి అవసరమై వాణిజ్య పంటల ప్రవేశంతో చిరుధాన్యాల పంటలు కనుమరుగైనాయి. ఫలితంగా వాటిని దిగుమతి చేసుకోవడంతో ధరలు పెరుగుతున్నాయి. నూనె గింజల సేద్యం విస్తీర్ణత, ఉత్పత్తి పెరగకపోవటం వలన దేశంలో వంట నూనెల కొరత ఏర్పడి దిగుమతులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
దీని ఫలితమే నూనె ధరల పెరిగి, దేశంలో అన్నిరకాల సాధారణ బియ్యం ఎగుమతులపై నిషేధం విధించి, మేలు రకాల బియ్యం ఎగుమతికి అనుమతించడమే దేశంలో దాని ధర పెరుగుదలకు కారణమైంది. దేశ ప్రయోజనాలకు అనుకూలమైన సొంత వ్యవసాయ విధానాలు అమలు జరిపి, ఆహార పంటల్లో సమతుల్యత పాటించి, మేలు రకమైన విత్తనాలతో కందులు, మినుములు, వేరుశనగ, సన్‌ఫ్లవర్ ఆయిల్, నువ్వుల పంటల విస్తీర్ణత పెంచి, వాటి దిగుబడులు పెరిగేలా చేసి స్వయం సమృద్ధిని సాధించినప్పుడే పప్పుల, నూనెల ధరలు తగ్గుతాయి. అందుకోసం పాలక ప్రభుత్వాలపై ప్రజలు ఉద్యమించాలి.