Monday, December 23, 2024

కాలక్షేపంగా మారిన వ్యవసాయ పరిశోధనలు

- Advertisement -
- Advertisement -

కొత్తవంగడాలు లేకే వెనకబడి పోయాం
ఈఏడాది 500టన్నుల మామిడి ఎగుమతి లక్షం
ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామిరెడ్డి

Agricultural researched
మనతెలంగాణ/హైదరాబాద్:  మన వ్యవసాయ ఉద్యాన విశ్వవిద్యాలయాలు ..రీసెర్చ్ సెంటర్లు బలహీనంగా ఉన్నాయి..అందుకే ఉత్పత్తి ఉత్పాదకతలో ఎంతో వెనుకబడిపోయాం..మన రీసెర్చ్ సెంటర్లు కాలక్షేపానికి పరిశోధనలుగా మారాయి.. వీటి వల్ల రైతులకు ఒరిగిందేమి లేదు.. అని తెలంగాణ రాష్ట్ర ఉద్యానశాఖ డైరెక్టర్ ఎల్ వెంకట్రామిరెడ్డి అసంతృప్తిని వెలిబుచ్చారు. మంగళవారం నాడు మారియట్‌లో అపెడా, రాష్ట్ర ఉద్యాన శాఖలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన మామిడి పంటపై కొనుగోలు దారుఅమ్మకందారుల సమావేశంలో వెంకట్రామిరెడ్డి ముఖ్యఅతిధిగా పాల్గొన్ని ప్రసంగించారు. ఉద్యానరంగంలో పరిశోధనల తీరును ఎండగట్టారు. మన విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు కాలక్షేపంగా మారాయన్నారు. వీటివల్ల రైతులకు ఏవిధంగాను ఉపయోగం జరగటం లేదన్నారు.

పరిశోధనలన్నీ ప్రైవేటు కంపెనీల నుంచే ఉన్నాయన్నారు. ఇజ్రాయేల్ ,ఆస్ట్రేలియా తదితర దేశాల్లో ఉద్యాన రంగంలో మంచి పరిశోధనలు జరుగుతున్నాయని, మంచి దిగుబడులు ఇచ్చే కొత్తరకాలను ఆదేశాల్లో గుర్తించి ఇక్కడికి ఆ వంగడాలను తెప్పించాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న మూడునాలుగేళ్లలో తెలంగాణ రాష్ట్ర ఉద్యాన రంగం సరళీ పూర్తిగా మారనుందన్నారు. రాష్ట్రంలో 3 లక్షల ఎకరాల్లో మామిడి తోటలు సాగులో ఉండగా అందులో 2లక్షల ఎకరాల్లో బంగినపల్లి రంగం మామిడి ఉందన్నారు. ఏటా 6లక్షల మెట్రిక్ టన్నుల పంట దిగుబడి వస్తుందన్నారు. వ్యసాయరంగంలో ఎకరరానికి రూ.1.50లక్షల ఆదాయం రాకపోతే అటువంటి పంటల సాగు దండగే అన్నారు.

పొలం అమ్మి బ్యాంకుల్లో డిపాజిట్ చేసి తద్వారా వచ్చే వడ్డీతో బతకటం ఎంతోమేలు అని రైతులకు సూచించారు.ఉద్యాన పంటల సాగుద్వారా పెట్టుబడికి 4రెట్లు ఆదాయం లభిస్తుందని , అదే ఇతర పంటల వల్ల రూపాయి పెట్టుబడికి రూ.1.25 మాత్రమే ఆదాయం వస్తుందన్నారు. కొత్తిమీర సాగు చేసిన వారుకూడా ఎకరానికి రూ.4లక్షల ఆదాయం పొందగలుగుతున్నట్టు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యాన పంటల సాగు పట్ల ప్రత్యేక శ్రద్దతీసుకుందన్నారు. కోహెడాలో ప్రపంచంలోనే అతిపెద్ద పండ్ల మార్కెట్‌ను నిర్మిస్తోందన్నారు. ఇది రెండుమూడేళ్లలోపే అందుబాటులోకి రానుందన్నారు. రాష్ట్రనుండి గత ఏడాది 140టన్నుల మామిడి విదేశాలకు ఎగుమతి జరిగిందని, ఈ ఏడాది 500టన్నుల మామిడి ఎగుమతి లక్షంగా పెట్టుకున్నట్టు తెలిపారు.

రాష్ట్రంలో మామిడి పంట 10లక్షల మెట్రిక్ టన్నల దిగుబడి రావాల్సివుండగా ,3లక్షల టన్నులకు మించి దిగుబడి వచ్చే అవకాశం లేదన్నారు. అకాల వర్షాలు , వాతావరణ మార్పుల కారణంగా మామిడి పంట దిగుబడి భారీగా తగ్గినట్టు వెంకట్రామిరెడ్డి తెలిపారు.అపెడా ఎజిఎం నాగ్‌పాల్ మాట్లాడుతూ రాష్ట్రంలో మామిడి ఎగుమతులను ప్రోత్సహించేందుకు మౌలిక వసతుల కల్పన ఆవశ్యకత ఎంతో అవసరం ఉందన్నారు. ఫుడ్‌ప్రాసెసింగ్ సొసైటీ డైరెక్టర్ అఖిల్ గవార్ మాట్లాడుతూ మామిడి పంటకోత నుండే రైతులు ఎగుమతిదారుల మద్య సత్సంబంధాలు పెంపోందించుకోవాల్నారు. ఆయా దేశాలకు పండ్ల ఎగుమతి కోసం ఆయా దేశాలకు అవసరమైన నాణ్యతతో పంటను పండించాలన్నారు.

ప్లాంట్ క్వారంటైన్ అధికారి జి.రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ విదేశాలకు మామిడి ఎగుమతులకు అవసరమైన నాణ్యత, పాటించాల్సిన ప్రమాణాలను రైతులు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. దక్షిణమధ్య రైల్వే అధికారి విద్యాధర్ మాట్లాడుతూ కిసాన్ రైళ్ల ద్వారా ఉద్యాన ఉత్పత్తుల రవాణా కోసం 50శాతం రాయితీని ఉపయోగించుకోవాలన్నారు. ఈ పధకాన్ని మే 31వరకూ పొడిగించినట్టు తెలిపారు. మాడిమి ఎగుమతి దారు జివికే నాయుడు మాట్లాడుతూ విదేశాలకు ఏడాది పొడవునా ఎగుమతికి అవసరమైన పండ్ల రకాలను ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కీత్ , కెన్ట్ , టొమాట్కిన్స్ మామిడి రకాలను తెలంగాణలో పండించాలన్నారు. మరో ఎగుమతి దారు ఎండి రఫీ మాట్లాడుతూ రాష్ట్రంలో మామిడి ఎగుమతికి ఇరాడియేషన్ సదుపాయాలు కల్పించాలన్నారు. ఈ సమావేశంలో మార్కెటింగ్ శాఖ ఏడి రవికుమార్ , ఉద్యానశాఖ సలహాదారు శ్రీనివాసరావు, ఉపసంచాలకులు బి.బాబు,లతా, జలంధర్ తదితరులతోపాటు వివిధ జిల్లాల మామిడి రైతులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News