Friday, November 22, 2024

రైతుకు దన్నుగా వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలు పనిచేయాలి

- Advertisement -
- Advertisement -

పంటలకు లాభసాటి ధరకల్పించటమే ప్రభుత్వ లక్ష్యం
విశ్వవిద్యాలయాల సమీక్షకు సిద్ధం చేయండి
అధికారులతో జరిపిన సమీక్షలో మంత్రి తుమ్మల

మనతెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్ర రైతాంగానికి దన్నుగా ఉండేలా వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. వ్యవసాయశాఖ కార్యదర్శి కార్యాలయంలో మంగళవారం రెండు శాఖల ఉన్నతాధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో వ్యవసాయ,ఉద్యాన, మార్కెటింగ్ శాఖల పనితీరు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ..వ్యయవసాయ రంగంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టిసారిస్తున్నారన్నారు. సాగురంగంలో అనేక సంస్కరణలు చేపట్టేలా ప్రభుత్వం సంకల్పంతో ఉందన్నారు.

ఈ సందర్భంగా వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల పూర్తి సమాచారంతో ప్రత్యేక నివేదిక సిద్ధం చేయాలని ఆయాశాఖల ఉన్నతాధికారులకు సూచించారు. వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాల ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. ఉద్యానశాఖ కు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భూముల వివరాలు సమర్పించాలన్నారు. వ్యవసాయ పరిధిలోని అన్ని కార్పొరేషన్ల ఉన్నతాధికారులతో సచివాలయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి పూర్తిస్థాయిలో అన్ని అంశాలపై చర్చిద్దామన్నారు. వ్యవసాయ రంగ అభివృద్ధి పనుల కోసం స్థానికంగా ఇరిగేషన్, ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్ శాఖల సేవలు వినియోగించుకోవాలని..ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే తన దృష్టికి తీసుకురావాలన్నారు.

రాష్ట్రంలోని మొత్తం 197 మార్కెట్ యార్డుల స్థితిగతులు, వాటి పనితీరు, ప్రస్తుత పరిస్థితులపై సమగ్ర వివరాలు అందించాలని మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. వ్యవసాయ మార్కెటింగ్ శాఖల్లో సాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై వీడియో రూపంలో సమగ్ర నివేదిక అందించాలని సూచించారు. ఇప్పటికే మంజూరైన పనులకు సంబంధించిన పనులు మొదలు కాని వాటి సమగ్ర వివరాలు జతచేయాలని ఆదేశించారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో మార్కెటింగ్ సమస్యలు, క్రయవిక్రయాలు, ధరలు తదితర అంశాలపై పూర్తి వివరాలు సమర్పించాలన్నారు. ఆరుగాలం కష్టపడి రైతు పండించిన పంటల ఉత్పత్తులను అమ్ముకునే మార్కెట్ యార్డులు వారికి దన్నుగా ఉండేలా తీర్దిదిద్దాలన్నారు. మార్కెట్ యార్డుల్లో సమస్యల్ని ఎప్పటికప్పుడు మార్కెటింగ్ అధికారులు పర్యవేక్షించాలని..ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు.

వర్షాలు, ఇతర ఇబ్బందులతో ఎక్కాడా రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. రాష్ట్రంలోని అన్ని మార్కెట్ యార్డుల్ని ఆధునిక హంగులతో తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకోసం ఇతర రాష్ట్రాల్లో గొప్పగా పనితీరు కనబరుస్తున్న మార్కెట్లను మోడల్ గా తీసుకుని..ఇక్కడ ఒకటి రెండు మార్కెట్ యార్డుల్ని తీర్చిదిద్దేలా చర్యలు తీసుకోవాలన్నారు. మార్కెటింగ్ శాఖలో ఎవరైనా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహిరిస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని మంత్రి తుమ్మల హెచ్చరించారు. అలాంటి వారి వివరాలు ఎప్పటికపు్పుడు అందించేలా ఉన్నతాధికారులు బాధ్యత తీసుకోవాలన్నారు. రాష్ట్రంలోని అన్ని మార్కెట్ యార్డుల కార్యదర్శులతో త్వరలోనే టెలీ కాన్ఫరెన్స్ నిర్వహిస్తాన్నారు. రైతుల పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు వచ్చేలా మార్కెట్లు బాధ్యతతో పనిచేసేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. రైతులు నష్టాలు మూటగట్టుకోకుండా, యార్డుల్లో పంట ఉత్పత్తులకు నష్టం వాటిల్లకుండా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల సరఫరాలో ప్రైవేటు కంపెనీల దందాను పూర్తిగా అరికట్టాలన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ రాష్ట్రంలో ఎక్కడా ఎరువుల కొరత లేకుండా చూడాలన్నారు. రాష్ట్ర రైతాంగానికి వ్యవసాయ శాఖ సేవలు మరింత మెరుగుపరచాలన్నారు. అన్నదాత సాగుకు దన్నుగా ఉండేలా వ్యవసాయ సాఖ పనితీరు మరింత మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరావు అధికారులను హెచ్చరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News