మనతెలంగాణ/ కామారెడ్డి ప్రతినిధి : వ్యవసాయ గణన సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ వ్యవసాయ విస్తీరణ అధికారులు, వ్యవసాయ అధికారులకు సూచించారు. మంగళవారం కామారెడ్డి కలెక్టరేట్ లోని సమావేశపు మందిరంలో జిల్లా ప్రణాళిక శాఖ ఆద్వర్యంలో వ్యవసాయ గణన 2021-22 పై ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ నెల 28 వరకు వ్యవసాయ గణన పూర్తి చేయాలని సూచించారు. మొదటిసారిగా సాంకేతికతను వినియోగించి ఖచ్చితమైన సమాచారం సేకరించేందుకు జిల్లా ప్రణాళిక వ్యవసాయ సంయుక్త ఆద్వర్యంలో సర్వే చేపట్టామన్నారు. ఎఇఒలు క్లస్టర్ పరిధిలోని గ్రామాలకు వెళ్లి క్షేత్రస్థాయిలో ఖచ్చితమైన వివరాలు సేకరించాలని సూచించారు. ధరణి పోర్టల్ ఆదారంగా రైతుల సమగ్ర సమాచారం సేకరించాలని తెలిపారు. రైతుల జీవన స్థితిగతులు, సాగు పంటల స్వరూప స్వభావాన్ని వ్యవసాయ గణన ద్వారా తెలుసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. అగ్రి సెన్సెస్ పేరిట ప్రత్యేకంగా మోబైల్ యాప్ ను రూపొందించారని, దానిని ఎఇఒలు డౌన్‌లోడ్ చేసుకుని గణన పూర్తి చేయాలన్నారు.
మొదటి దశలో ధరణి పోర్టల్ ఆధారంగా రైతు పేరు, సామాజిక స్థితి, భూ విస్తీర్ణ వివరాలు, వ్యక్తిగత సాగు ఉమ్మడి సాగు, పురుషులు, మహిళా రైతులు ఇలా అన్ని వివరాలు యాప్‌లో నమోదు చేయాలని తెలిపారు. రెండవ దశలో ప్రణాళిక శాఖ నిర్దేశించిన టిఆర్ఎఎస్ (టైమ్ లీ రిపోర్టెడ్ అగ్రి స్టాటిస్టిక్స్) గ్రామాల్లో 20 శాతం రైతుల స్థితిగతులను నమోదు చేస్తారని తెలిపారు. మూడవ దశలో పంటల సాగుకు చేస్తున్న వ్యయం, వినియోగిస్తున్న యంత్ర పరికరాల వివరాలు నమోదు చేయాలన్నారు. ఈ సామాచారం ఆధారంగా అన్నదాతలకు సంక్షేమ పథకాలతో పాటు ఇతర కార్యక్రమాలు అములు చేసుకునేందుకు గణన దోహదపడుతుందని అన్నారు. రైతుల ఆదాయ వ్యయాలను పరిగణలోకి తీసుకుని వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించే వీలుంటుందని పేర్కొన్నారు. మూడు ధపాల్లో చేయవలసిన అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు ఏఈఓ లకు వివరించారు.శిక్షణ కార్యక్రమంలో రాష్ట్ర గణాంక శాఖ సహాయ సంచాలకులు శ్రీవల్లి, డిప్యూటి స్టాస్టికల్ అధికారులు పూరి రాజు, సుధ, జిల్లా ముఖ్య ప్రణాళాఖాదికారి రాజారామ్, జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మీ, సహాయ వ్యవసాయ సంచాలకులు, వ్యవసాయ అధికారులు, ఏఈఓలు, మండల గణాంకాధికారులు పాల్గొన్నారు.
Also Read: వంతెన కట్టకపోతే ఎన్నికల బహిష్కరణ