హైదరాబాద్ : దేశంలో సహకార రంగం బలోపేతం, రైతుల అభ్యున్నతిపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించడం ద్వారా విశేషంగా కృషి చేస్తోందని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. హైదరాబాద్ నాంపల్లి ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీలో అఖిల భారత సహకార సంఘం ఆధ్వర్యంలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల సహకార సదస్సుకు గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో టెస్కాబ్ ఛైర్మన్ టిఎస్ మార్క్‌ఫెడ్, గంగారెడ్డి, జాతీయ సహకార సంఘం చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ సుధీర్ మహాజన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెద్ ప్రకాష్ సేథియా, ఇతర ఉన్నతాధికారులు, వివిధ రాష్ట్రాల సహకార ఉద్యమకారులు, నిపుణులు పాల్గొన్నారు. పలు దేశాల్లో ప్రత్యేకించి దక్షిణ భారతదేశంలో సహకార రంగంలో సవాళ్లు, విజయాలు నమోదు చేసుకుంటున్న సహకార సంఘాల విజయగాధలను గవర్నర్ తమిళిసై గుర్తుచేసుకున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానపరమైన నిర్ణయాలు, విధులు, భవిష్యత్తులో సహకార రంగ బలోపేతం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. గ్రామీణ భారతంలో వ్యవసాయ రంగం అభివృద్ధి దృష్ట్యా క్షేత్రస్థాయిలో సహకార సంఘాల ద్వారా రైతులను నిష్ణాతులుగా తీర్చిదిద్దాలని ప్రధాని మోడీ లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. ఈ క్రమంలోనే అన్నదాతల అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు. వీటి ద్వారా వ్యవసాయంలో రాబడులు మరింత పెంచేందుకు, సహకార సంఘాలు మంచి తోడ్పాటు ఇవ్వాలని ప్రధాని ఆదేశమన్నారు. ఈ నేపథ్యంలో నేపథ్యంలో అఖిల భారత సహకార సంఘం వ్యవసాయం పట్ల నిరంతరం ప్రత్యేక చొరవ చూపుతుందన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలలో సహకార సంఘాలు జోరుగా ముందుకు సాగుతున్నాయన్నారు. ఈ సంఘాల ద్వారా రైతులు తమ మూలధనాన్ని పెంచుకోవచ్చని తెలిపారు. ప్రభుత్వ రంగం మాదిరిగా పని చేసే ఈ సహకార సంఘం ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలకు సహాయం అందిస్తాయన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల ఈ సంఘాలు రైతులను సంఘటితం చేస్తూ రాబడులు పెరిగేలా సహకరిస్తున్నాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న, సన్నకారు రైతులు సంఘటితంగా ముందుకు సాగితే ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చన్నారు. ఈ విషయంలో తమిళనాడు సహకార వ్యవస్థ చాలా బలంగా ఉందని వెల్లడించారు. సాగుదారులను వికేంద్రీకరణం చెయ్యడం ద్వారా ఉత్తమ శిక్షణ, వైవిధ్యమైన పద్ధతులు, ఆవిష్కరణలు చేయవచ్చని తెలిపారు. వీటి వల్ల రైతులు పెద్ద ఎత్తున ఆర్థికంగా మంచి లాభాలు పొందుతున్నారన్నారు. ప్రజాస్వామ్య భారతంలో గ్రామ పంచాయతీలు మూలస్థంభాలు అని అవి బలంగా పనిచేస్తే వ్యవసాయంతోపాటు అన్ని రంగాల్లో స్వయం సంవృద్ధి సాధించవచ్చని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పేర్కొన్నారు.