Monday, December 23, 2024

స్వల్పకాలిక వంగడాలే సాగు చేయాలి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో వానాకాలపు పంటల సాగుకోసం రైతులు ప్రత్యేకించి వరిలో స్వల్పకాలిక వంగడాలను ఎంపిక చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. శనివారం వ్యవసాయశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ వరిలో కూనారం సన్నాలు , కూనారం 1638, బతుకమ్మ, వరంగల్ 962, ఆర్ ఎన్ ఆర్ 21278, ఆర్ ఎన్ ఆర్ 29325, జగిత్యాల 1798, తెలంగాణ సోనా , ఎం టి యూ 1010 , జగిత్యాల 24423, ఐ ఆర్ 64, హెచ్ ఎం టి సోనా వంటి స్వల్ప కాలిక వంగడాలను మాత్రమే సాగు చేయాలని సూచించారు.ఈ నెలలో రాబోయే మూడు రోజులు, జులై 2వ వారం నుండి ,

ఆగస్టు చివరి వరకు సాధారణ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడించినట్టు తెలిపారు. వర్షాలు ఆలస్యం అయినందున క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులు పర్యటించి రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆదేశించారు. తగినంత తేమ ఉన్నప్పుడే విత్తనాలు నాటుకునేలా రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యంగా తేలికైన నేలలలో వేసే పత్తి 50 నుండి 60 ఎంఎం, బరువు నేలలలో 60 నుండి 75 ఎంఎం వర్షపాతం నమోదవుతేనే విత్తుకోవాలని సూచించారు. రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
యాసంగిలో అకాలవర్షాల నుండి వరి పంట నష్టపోకుండా రైతులు పంటకాలాన్ని ముందుకు జరుపుకునేలా అవగాహన కల్పించాలన్నారు.వరి పంటకాలం ముందుకు జరుపుకునేలా రైతులను చైతన్యం చేస్తూ వ్యవసాయ శాఖ రూపొందించిన వీడియో సమావేశంలో విడుదల చేశారు.క్షేత్రస్థాయిలో ప్రతి ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రంలో ఎరువులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. మార్క్ ఫెడ్ లో తగినంత బఫర్ స్టాక్ ఉంచుకోవాలన్నారు. ఎరువుల సరఫరా, వినియోగంపై అన్ని జిల్లాలలో ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని హెచ్చరించారు. రైతువేదికలలో నిరంతరాయంగా రైతులకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.విత్తనాల విషయంలో కృత్రిమ కొరత సృష్టిస్తే కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వానాకాలం ఆరుతడి పంటలు వేసుకునే రైతులు బోదెల పద్దతిలో పంటలు సాగు చేసుకోవాలని సూచించారు.

రాష్ట్రంలో ఈ ఏడాది 2 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ నూతనంగా సాగుచేయాలన్నారు. ఇప్పటికే 60 వేల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగుకు రైతులు ముందుకు వచ్చినట్టు మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు.హైదరాబాద్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూతన సచివాలయంలో వాతావరణ పరిస్థితులు, వానాకాలం పంటల సాగు, విత్తనాల లభ్యత, ఎరువుల సరఫరా, ఆయిల్ పామ్ సాగుపై నిర్వహించిన సమీక్షలో రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ప్రత్యేక కమీషనర్ హన్మంతు కొండిబ, హైదరాబాద్ వాతావరణ శాఖ డైరెక్టర్ డాక్టర్ నాగరత్న, సాగునీటి శాఖ ఎస్ ఈ శ్రీనివాస్, విత్తన సంస్థ ఎండీ కేశవులు, అడిషనల్ డైరెక్టర్ విజయ్ కుమార్ ,ఉద్యాన శాఖ జేడీ సరోజిని తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News