మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గురు, శుక్రవారాలలో(జులై 14,15) తేదీలలో జరగాల్సిన అగ్రికల్చర్ ఎంసెట్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వార్షాల కారణంగా అగ్రికల్చర్ ఎంసెట్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆర్.లింబాద్రి వెల్లడించారు. వాయిదా పడిన పరీక్షల తేదీలను త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు. అయితే ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని తెలిపారు. షెడ్యూల్ ప్రకారమే ఈనెల 18 నుంచి 20 వరకు ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గత వారం రోజులుగా వర్షాలు కురుస్తున్నందున ఎంసెట్ నిర్వహణపై సందేహాలు వ్యక్తమయ్యాయి. గురువారం నుంచి ఎంసెట్ మొదలవుతుందా..? లేదా..? అన్న దానిపై సందిగ్ధం నెలకొంది. ఈనెల 14, 15 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించిన నేపథ్యంలో ఉన్నత విద్యామండలి అధికారులు పరిస్థితిని సమీక్షించారు. ప్రభుత్వంతో సంప్రదించి అగ్రికల్చర్ పరీక్ష వాయిదా వేసి.. ఇంజినీరింగ్ పరీక్షను యథాతథంగా జరపాలని నిర్ణయించారు.