రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహం
సహజ సాగు, సిరి ధాన్యాలపై దృష్టి కేంద్రీకరింపు
లక్నో కార్యక్రమంలో ప్రధాని మోడీ ప్రకటన
లక్నో : వ్యవసాయాన్ని కొత్త పథంలో తీసుకువెళ్లడంలో రైతులకు తన ప్రభుత్వం సాయం చేస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం వెల్లడించారు. సహజ సాగు, సిరి ధాన్యాల ఉత్పత్తిపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించిందని మోడీ తెలియజేశారు. ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో ఒక కార్యక్రమంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా డైనింగ్ టేబుళ్లపై భారతీయ ఆహార ఉత్పత్తులు ఉండాలన్న ఉమ్మడి లక్ష సాధనకు కృషి చేయడం ముఖ్యమని ఉద్ఘాటించారు. పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)కి చట్టబద్ధమైన గ్యారంటీ వంట వివిధ డిమాండ్లపై ఒక వర్గం రైతులు నిరసనోద్యమం సాగిస్తున్న తరుణంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘మన దేశ వ్యవసాయాన్ని కొత్త పంథాలో తీసుకువెళ్లేలా రైతులకు మేము సాయం చేస్తున్నాం.
వారిని అందులో ప్రోత్సహిస్తున్నాం’ అని ప్రధాని తెలిపారు. సహజ సాగు పద్ధతులపైన, సిరి ధాన్యాల ఉత్పత్తిపైన దృష్టి కేంద్రీకరించాలని ఆయన పిలుపు ఇచ్చారు. ‘సిరి ధాన్యాలు వంటి సూపర్ ఆహారధాన్యాలపై పెట్టుబడికి ఇది సరైన సమయం’ అని ప్రధాని అన్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని గంగా నది తీరం పొడుగునా భారీ ఎత్తున సహజ సాగు పద్ధతులు అనుసరిస్తుండడాన్ని ప్రధాని మోడీ ప్రస్తావించారు. అది రైతులకు ప్రయోజనకరమే కాకుండ పవిత్ర నదుల పరిశుద్ధత పరిరక్షణకు దోహదం చేస్తున్నదని ఆయన అన్నారు.
తమ తమ యత్నాలలో ‘ప్రభావ రహితం, లోప రహితం’ మంత్రానికి ప్రాధాన్యం ఇవ్వవలసిందిగా ఫుడ్ ప్రాసెసింగ్ పారిశ్రామికవేత్తలకు ప్రధాని విజ్ఞప్తి చేశారు. సిద్ధార్థ్ నగర్ కాలానమక్ బియ్యం, చందౌలి నల్ల బియ్యం వంటి ఉత్పత్తుల విజయ గాథలను ప్రధాని మోడ ప్రధానంగా ప్రస్తావించారు. ఆ ఉత్పత్తులను ప్రస్తుతం గణనీయమైన పరిమాణంలో ఎగుమతి చేస్తున్నారు. భారతీయ ఆహార ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు సంఘటిత కృషి అవసరమని మోడీ సూచించారు. రైతులతో భాగస్వామ్యం నెలకొల్పుకోవలసిందిగా పారిశ్రామికవేత్తలను ప్రధాని ప్రోత్సహిస్తూ, వ్యవసాయ ఉత్పాదక సంస్థలు, సహకార సంస్థల ద్వారా చిన్న రైతులను సాధికారులను చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి గురించి వివరించారు. ‘రైతులకు, వ్యవసాయానికి ప్రయోజనమే కాకుండా మీ వ్యాపారానికీ మేలు’ అని మోడీ పెట్టుబడిదారులతో అన్నారు.
మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్‌కు భారత రత్న అవార్డు ప్రకటన గురించి మోడీ ప్రస్తావించారు. ‘కొన్ని రోజుల క్రితం మా ప్రభుత్వం రైతుల శ్రేయోభిలాషి చౌదరి చరణ్ సింగ్‌కు భారత రత్న ప్రకటించే అవకాశం పొందింది’ అని ప్రధాని తెలిపారు. ఉత్తర ప్రదేశ్ భూమి పుత్రుడు చరణ్ సింగ్‌కు అవార్డు దేశంలోని కోట్లాది మంది కూలీలు, రైతులను గౌరవించమే అవుతుంది’ అని మోడీ అన్నారు. యుపి గ్లోబల్ ఇన్వెస్టర్స్ శిఖరాగ్ర సదస్సు సమయంలో అందిన పెట్టుబడి ప్రతిపాదనలకు సంబంధించి సోమవారం లక్నోలో నాలుగవ శంకుస్థాపన కార్యక్రమంలో ఉత్తర ప్రదేశ్ వ్యాప్తంగా రూ. 10 లక్షల కోట్లకు మించి విలువ చేసే 14 వేల ప్రాజెక్టులకు మోడీ నాంది పలికారు. తయారీ, పునరుత్పాదక ఇంధన శక్తి, ఫుడ్ ప్రాసెసింగ్, గృహవసతి, స్థిరాస్తి, ఆతిథ్య, వినోద, విద్య వంటి రంగాలకు సంబంధించినవి ఆ ప్రాజెక్టులు. యుపి గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రభృతులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.