న్యూఢిల్లీ : వ్యవసాయం, గ్రామీణ అభివృద్ధి కోసం బడ్జెట్‌లో చేసిన ప్రతిపాదనలను శీఘ్రగతిన అమలు జరపాలని ప్రధాని నరేంద్ర మోడీ శనివారం పిలుపు ఇచ్చారు. కొత్త బడ్జెట్‌పై చర్చించే బడులు ‘కార్యాచరణ’పై దృష్టి కేంద్రీకరించాలని సంబంధిత వ్యక్తులు, సంస్థలకు మోడీ విజ్ఞప్తి చేశారు. ‘వ్యవసాయం, గ్రామీణ సంపద’పై బడ్జెట్ అనంతర వెబినార్‌లో ప్రధాని ప్రసంగిస్తూ, తన మూడవ విడతలో నిరంతర విధానపరమైన దృక్పథంతో ‘వికసిత్ భారత్’ కోసం ప్రభుత్వ కొత్త లక్షం విస్తరణను బడ్జెట్ ప్రతిబింబిస్తోందని నొక్కిచెప్పారు. ‘ఈ ఏడాది బడ్జెట్‌ను శీఘ్రగతిని అమలు పరచడం ప్రధానం.
బడ్జెట్ రూపొందింది, మా మొత్తం దృష్టి కార్యాచరణపైనే’ అని మోడీ తెలిపారు. బడ్జెట్ అమలులో ‘ప్రతిబంధకాలను, లోటుపాట్లను’ సంబంధిత వ్యక్తులు, సంస్థలు గుర్తించాలని ఆయన సూచించారు. బడ్జెట్‌కు ముందు సంబంధిత వ్యక్తులు, సంస్థల నుంచి సమీకరించిన వివరాలు, సూచనలు దాని రూపకల్పనలో తోడ్పడ్డాయని మోడీ తెలిపారు. ‘ఇప్పుడు ఈ బడ్జెట్‌ను మరింత సమర్థంగా అమలు చేయవలసిన అగత్యం ఉంది. మెరుగైన ఫలితం కోసం సంబంధిత వ్యక్తులు, సంస్థల పాత్ర కూడా మరింత కీలకం’ అని ఆయన పేర్కొన్నారు.
వ్యవసాయాన్ని వృద్ధికి తొలి ఇంజన్‌గా పరిగణిస్తున్నారని, వ్యవసాయ వృద్ధి, గ్రామీణ సౌభాగ్యం సాధించాలనే జంట లక్షాలతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన తెలిపారు. ప్రభుత్వం ‘వికసిత్ భారత్’ లక్షం సాధించేందుకు నిబద్ధమై ఉందని, ఏ రైతూ వెనుకబడి ఉండకుండా , ప్రతి రైతూ పురోగమించేలా చూసేందుకు కృషి చేస్తున్నామని మోడీ చెప్పారు. ‘మనం దేశ వ్యవసాయ సామర్థాన్ని పూర్తిగా వినియోగించుకుని మరిన్ని లక్షాలు సాధించవలసిన అవసరం ఉంది’ అని ప్రధాని ఉద్బోధించారు. వ్యవసాయ రంగంలో సాధించిన రికార్డు విజయాల గురించి ప్రధాని ప్రధానంగా ప్రస్తావించారు.
ఆహారధాన్యాల ఉత్పత్తి ఒక దశాబ్దం క్రితనాటి 265 మిలియన్ టన్నుల నుంచి ప్రస్తుతం 330 మిలియన్ టన్నులకు పెరిగిందని, అదేవిధంగా ఉద్యాన పంటల ఉత్పత్తి 350 మిలియన్ టన్నులు దాటిందని ఆయన తెలియజేశారు. మోడీ ప్రత్యేకంగా పిఎం ధన్ ధాన్య కృషి యోజన గురించి ప్రస్తావించారు. అది తనకు ‘ఎంతో ముఖ్యమైన పథకం’ అని ఆయన అభివర్ణించారు. ఆ పథకం తక్కువ పంట ఉత్పత్తులు ఉన్న 100 జిల్లాలపై దృష్టి కేంద్రీకరిస్తుందని ఆయన తెలిపారు. ఐసిఎఆర్ కృషిని కూడా ప్రధాని ప్రస్తావించారు.
2014, 2024 మధ్య 2900 పైచిలుకు కొత్త ఆహారధాన్యాలు, పప్పుధాన్యాలు, చెరకు, తదితర పంటల వంగడాలను ఆధునిక సాధనాలను ఉపయోగించి అభివృద్ధి చేసినట్లు మోడీ తెలియజేశారు. ఆ కొత్త వంగడాలు రైతులకు సరసమైన ధరలకు అందుబాటులో ఉండేలా చూడవలసి ఉంటుందని మోడీ చెప్పారు. ఆరు సంవత్సరాల క్రితం ప్రారంభించినప్పటి నుంచి పిఎంకిసాన్ పథకం కింద 11 కోట్ల మంది రైతులకు సుమారు రూ. 3.75 లక్షల కోట్లను నేరుగా బదలీ చేసినట్లు ప్రధాని వెల్లడించారు. రూ. 6000 వార్షిక ఆర్థిక సహాయం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్ఠం చేస్తున్నదని మోడీ తెలిపారు.