Saturday, December 21, 2024

ప్రకృతి విపత్తులను అధిగమిస్తేనే ‘వ్యవసాయం’ బతికేది

- Advertisement -
- Advertisement -

పంటల సాగును ప్రభావితం చేస్తున్నరుతుపనాలు
వాతావరణ మార్పులపై లోతైన పరిశోధనలు
నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్‌పై కేంద్రం మీనమేషాలు!
ఈ పార్లమెంట్ సమావేశాల్లోనైనా ఆమోద ముద్ర వేస్తారా!

హైదారాబాద్ : కరువులు వరదలతో వ్యవసాయరంగం ప్రగతి పరిస్థితి మూడు అడుగులు ముందుకు అరు అడుగులు వెనక్కు అన్నచందంగా మారింది. అకాల వర్షాలు, అధిక వర్షాలు , అధిక ఉష్ణొగ్రతలు ,దుర్బిక్షాలు తదితర ప్రకృతి విపత్తులను అధిగమిస్తేనే వ్యవసాయరంగం బతికి బట్టకడుతుందని రైతులు ,రైతుసంఘాలు దశాబ్దాల తరబడి ఘోసిస్తున్నాయి.వాతావరణ మార్పులపైన లోతైన అధ్యయానాలతో సాగు రుంగాన్ని బాగు పరిచే దిశగా నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏర్పాటు పట్ల కేంద్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. పంటల ఉత్పత్తులు దెబ్బతిని , ఉత్పాదక సన్నగిల్లి ఒక వైపు నిత్యావసర సరుకుల ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. దేశ ప్రజలకు ఆహార భద్రత కల్పించాల్సిన ప్రాధమిక బాధ్యతల పట్ల కేంద్రం మొద్దునిద్ర నటిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి.

దేశంలో నెల రోజులుగా టమాటా ధరలు ఆకాశాన్నింటి ఎప్పుడూ లేనంత రేట్లు పలుకుతున్నాయి. దీంతో వాతావరణ మార్పుల ప్రభావంపై మీడియాలో, బయటా చర్చ మొదలైంది. భారతదేశంలో ఫిబ్రవరి, మార్చి మాసాల్లో వచ్చిన వడగాల్పులు, ఏప్రిల్ నాటి అకాల వర్షాల వల్లే టమాటా సహా అన్ని కూరగాయలు, ఆకుకూరల ధరలు మండిపోతున్నాయని వ్యవసాయరంగ నిపుణులు చెబుతున్నారు. టమాటాల విషయానికి వస్తే పంట విస్తారంగా పండిన కాలంలో కిలో ఐదు రూపాయలు కూడా పలకని రోజులున్నాయి. టన్నుల కొద్దీ టమాటాలను రైతులు రోడ్లపైన పోసేసి తమ ఊళ్లకు పోవడం లేదా పొలాల్లోనే కోయకుండా వదిలేయడం ప్రజలకు తెలుసు. ఈ చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకుని రైతన్నలు ఎప్పటిలా కాకుండా ఈ సీజన్లో బాగా తక్కువ విస్తీర్ణంలో టమాటా వేయడంతో దాని ధరలు కిలోకు రూ.200 దాటిపోయాయని కొందరు విశ్లేషిస్తున్నారు.

ప్రజలు రోజూ తమ ఆహారంలో భాగంగా చేసుకున్న టమాటాల ధరలు ఇలా అడ్డగోలుగా పెరగడం వల్ల ఈ పంట విస్తృతంగా సాగుచేసే రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోని రైతులు కొందరు స్వల్పకాలంలో కోట్లాది రూపాయలు సంపాదించడం, మొత్తంగా రైతులు రికార్డుస్థాయిలో మంచి లాభాలు ఆర్జించడం నిజమే. మహారాష్ట్రలోని పుణె జిల్లా జున్నార్ తాలూకా పచఘర్ గ్రామానికి చెందిన 36 ఏళ్ల రైతు ఈశ్వర్ గయకర్, ఆయన భార్య సోనాలీ తమ 12 ఎకరాల్లో టమాటాలు పండించి, ఇప్పటికే ఈ సీజన్లో దాదాపు మూడు కోట్ల రూపాయలు సంపాదించారని మీడియాలో వార్తలు వచ్చాయి. ఇలాంటి అనూహ్య భారీ లాభాలు ఎల్లకాలం రావని గయకర్ వంటి టమాటా రైతులకు తెలుసు. కూరగాలకు కనీస ధర రాని రోజుల్లో వాటిని మండీలకు తీసుకొచ్చాక రోడ్లపై పారబోయడం, తీవ్ర కొరత ఏర్పడినప్పుడు నిత్యం వాడుకునే కూరగాయల ధరలు ఆకాశాన్ని దాటిపోవడం వంటి విపరిణామాలు ఎందుకొస్తున్నాయనే ప్రశ్నకు ఎక్కువ మంది శాస్త్రవేత్తలు, వ్యవసాయ నిపుణులు-వాతావరణ మార్పులే కారణమని జవాబిస్తున్నారు.
వాతావరణ మార్పుల అధ్యయనానికి జాతీయ పరిశోధనా ఫౌండేషన్:
గత కొన్నేళ్లుగా వస్తున్న వాతావరణ మార్పులను ఇక నుంచి లోతుగా అధ్యయనం చేస్తూ వ్యవసాయరంగానికి ఎప్పటికప్పుడు సూచలు చేయడానికి నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఎన్.ఆర్.ఎఫ్) ఏర్పాటు చేయాలని చాలాకాలం కిందటే భారత ప్రభుత్వం నిర్ణయించింది. రుతుపవనాల రాకడ సహా సాగురంగాన్ని ప్రభావితం చేసే అన్ని అంశాలపై రైతులకు ఈ సంస్థ మార్గదర్శకంగా ఉంటుంది. ఇది ప్రపంచస్థాయి ప్రమాణాలకు దీటుగా వ్యవసాయ రంగానికి సంబంధించి పరిశోధనలు, అధ్యయనాలు చేయించడానికి నిధులు సమకూర్చుతుంది. రైతులకు దిక్సూచిగా పనిచేస్తుంది. ఈ ఎన్.ఆర్.ఎఫ్ బిల్లును పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెడతారని భావిస్తున్నారు. రూ.50,000 కోట్లతో స్థాపించే ఎన్.ఆర్.ఎఫ్ భారత వ్యవసాయరంగం వాతావరణ మార్పులను తట్టుకుని ముందుకు సాగడానికి తోడ్పడుతుందని ఆశిస్తున్నారు.

సాగురంగాన్ని అతలాకుతలం చేసే శక్తి ఉన్న వాతావరణానికి సంబంధించి అత్యంత సున్నితమైన, కీలకాంశాలపై పరిశోధనలను ఎన్.ఆర్.ఎఫ్ జరిపిస్తే-ప్రకృతి వైపరీత్యాల నుంచి వ్యవసాయాన్ని చాలా వరకు విముక్తిచేయడానికి వీలుంటుంది. వాతావరణాన్ని దెబ్బదీసే గ్రీన్ హౌస్ వాయువులను అదుపు చేయడానికి రసాయన ఎరువుల వాడకం మితిమీరకుండా చూడడం, ప్రత్యామ్నాయ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించడంతోపాటు 2024-2025 వరకూ దేశంలో ఎరువుల సబ్సిడీ రూ.3.69 లక్షలకు దాటిపోకుండా కేంద్ర ప్రభుత్వం ఇటీవల గరిష్ఠ పరిమితి విధించింది. ఈ సబ్సిడీలు తగ్గించినందు వల్ల మిగిలే నిధులను వాతావణ మార్పులపై పరిశోధనకు వినియోగిస్తారు. ప్రస్తుతం వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల వరి, గోధుమ, మొక్కజొన్న దిగుబడులు 7-8శాతం పండ్లు, కూరగాయల ఉత్పత్తి 15-20 శాతం వరకూ తగ్గే ప్రమాదం ఉందని వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయ రంగ జాతీయ నవకల్పనల సంస్థ (ఎన్.ఐ.సీ.ఆర్.ఎ-నిక్రా) అంచనావేసింది. ఈ నేపథ్యంలో ఎన్.ఆర్.ఎఫ్ ఏర్పాటు ఆలోచనను త్వరగా కార్యరూపంలో పెట్టడం తక్షణావసరం జాతీయ స్థాయిలో రైతులు ,రైతు సంఘాలు నుంచి డిమాండ్లు అధికమవుతున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News