హైదరాబాద్: అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి.మరో వైపు నైరుతి రుతుపవనాల్లోనూ కదలిక వచ్చింది. నేల పదునెక్కతుండటంతో వానాకాలపు వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. ఇప్పటికే వేసవి దుక్కులు దున్ని పెట్టుకుని పొలాలను సిద్దంగా చేసి ఉంచుకున్న రైతులు వర్షాధార, ఆరుతడి పైర్ల సాగులో నిమగ్న మయ్యారు. జొన్న, మొక్కజొన్న, కంది , పెసర, మినుము, వేరుశనగ, సోయాబీన్ ఆముదం, తదతర పంటలకు సంబంధించిన విత్తనాలు వేస్తున్నారు. మరో పదిరోజుల పాటు పత్తి విత్తనాలకు కూడా అదను ఉండటంతో వర్షాధారంగా పత్తి విత్తనాలు వేసే పనులు కూడా వేగం పుంజుకున్నాయి.వారం రోజులుగా పంటల సాగు విస్తీర్ణం పుంజుకుంటూ వస్తోంది. గత వారం రోజుల కిందట వ్యవసాయ శాఖ విడుదల చేసిన నివేదికలతో పోలిస్తే వారం రోజుల వ్యవధిలోనే పంటల సాగు విస్తీర్ణం రెట్టింపు కంటే అధికంగా పెరిగింది.
జూన్ 28నాటికి రాష్ట్రంలో అన్ని రకాల పంటలు కలిపి 14.85లక్షల ఎకరాల విస్తీర్ణంలో విత్తనాలు వేశారు . ఈ ఖరీఫ్‌లో సాధారణ సాగు విస్తీర్ణం 1,24,28,723 ఎకరాలుగా వ్యవసాయ శాఖ ప్రాధమిక అంచనా వేసింది. అయితే గత బుధవారం నాటికి సాధారణ సాగు విస్తీర్ణంలో 11.95శాతం విస్తీర్ణంలో విత్తనాలు పడ్డాయి. ఈ వారం రోజుల వ్యవధిలో చోటు చేసుకున్న మార్పులు వ్యవసాయ రంగానికి అనుకూలంగా మారుతు వచ్చాయి. రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు పడుతుండటంతో పంటల సాగు ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుంచి కాస్త తెరిపిన పడుతూ వస్తోంది.
రాష్ట్రంలో ఇప్పటి వరకూ అన్ని రకాల పంటలకు సంబంధించి 28.99శాతం విస్తీర్ణంలో విత్తనాలు వేశారు. ఖరీఫ్‌లో ఈ సమయానికి 44.83లక్షల ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగులోకి రావాల్సివుండగా ఇప్పటి వరకూ 36.02లక్షల ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగులోకి వచ్చాయి. గత ఏడాది ఈ సమయానికి నైరుతి రుతుపవనాల ప్రభావం తో రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు పడ్డాయి. నేల పదునెక్కడంతో జోరుగా పత్తి విత్తనాలు వేశారు. సుమారు 30లక్షల ఎకరాల్లో పత్తి విత్తనాలు వేసుకున్నారు.గత ఏడాది అన్ని రకాల పంటలు కలిపి ఈ సమయానికి 38.01లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగులోకి వచ్చాయి.
ఈ సారి రుతుపవనాల రాకలో సుమారు రెండు వారాలు జాప్యం చోటు చేసుకోవటంతో ఆ ప్రభావం ఖరీఫ్ పంటల సాగుపై పడింది. దీంతో సహజంగానే పంటల సాగు విస్తీర్ణం జూన్ చివరి వరకూ కొంత మందకోడిగానే సాగింది. జులై తొలివారం నుంచి వాతావరణం అనుకూలించటంతో సాగు పనులు పుంజుకున్నాయి. ఇప్పటివరకూ రాష్ట్రంలో జరగిన సాగు విస్తీర్ణంలో పత్తి సాగు పనులు శరవేగంగా జరుగుతూ వస్తున్నాయి. వారం రోజుల కిందటి వరకూ 12.25లక్షల ఎకరాల్లోనే పత్తి విత్తనం పడగా ,ఈ వారం రోజుల్లోనే 12.61లక్షల ఎకరాల్లో పత్తి విత్తనం పడింది.దీంతో ఇప్పటివరకూ పత్తి విస్తీర్ణం 24.86లక్షల ఎకరాలకు చేరుకుంది. పత్తి సాగు సాధారణ విస్తీర్ణంలో ఇది 49.15శాతం నమోదు చేసింది. ఈ ఏడాది పత్తి సాగు విస్తీర్ణం 50.59లక్షల ఎకరాలుగా వ్యవసాయ శాఖ ప్రాధమిక లక్ష్యాలు నిర్దేశించుకుంది. పత్తి విస్తీర్ణపు లక్ష్యాల్లో ఇప్పటికే 50శాతానికి చేరువయింది. సాధారణ పరిస్తితుల్లో అయితే ఈ సమయానికి 31.28లక్షల ఎకరాల విస్తీర్ణంలో పత్తి విత్తనం పడాల్సివుంది. గత ఏడాది ఈ సమయానికి 29.95లక్షల ఎకరాల్లో పత్తి విత్తనాలు వేశారు. పత్తి విత్తనాలు వేసుకునేందుకు ఈ నెల 15 వరకూ గడువు ఉన్నట్టు శాస్త్రవేత్తులు చెబుతున్నారు. ఈ పది రోజుల వ్యవధిలో పత్తి సాగు విస్తీర్ణం సాధారణ స్థాయికి చేరుకునే అవకాశాలు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు.
బోర్లకింద జోరుగా వరినార్లు!
ఖరీఫ్‌లో భారీగా వర్షాలు కురిసి ప్రాజెక్టులకు వరద నీరు చేరేసరికి ఇంకా రెండు మూడు వారాలు సమయం పట్టే అవకాశం ఉంది. ఆయకట్టుకు సాగు నీటి విడుదలలో మరింత జాప్యం జరిగే అవకాశం ఉన్న నేపధ్యంలో వరిపంట సాగులో జాప్యం లేకుండా ఉండేందుకు రైతులు బోరు బావుల ఆధారంగా వరినార్లు పోసుకుంటున్నారు. అందులోనూ స్పల్పకాలిక రకాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది ఖరీఫ్‌లో 49.86లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరిసాగు చేయించాలని ప్రభుత్వం ప్రాధమిక లక్ష్యాలు నిర్దేశించుకుంది. అయితే ఈ సమయానికి 2.06లక్షల ఎకరాల్లో వరిసాగులోకి రావాల్సివుంది. రాష్ట్రంలో ఇప్పటివరకూ 1,39,829 ఎకరాల్లో వరిసాగు జరిగింది. సాధారణ విస్తీర్ణంలో ఇది 2.80శాతం నమోదు చేసింది.
23.53శాతం చేరిన కంది విస్తీర్ణం
రాష్ట్రంలో అన్ని పంటల కంటే కంది సాగు విస్తీర్ణం జోరుమీద సాగుతోంది. ఇప్పటికే 181087 ఎకరాల్లో కంది విత్తనం పడింది. సాధారణ కంది సాగు విస్తీర్ణంలో ఇది 23.53శాతంగా ఉంది. మిగిలిన పంటల్లో పెసర 14587 ఎకరాలు, మినుము 4779 ఎకరాలు సాగులోకి వచ్చాయి. వేరుశనగ 863 ఎకరాలు, ఆముదం 364 ఎకరాల్లో సాగు జరిగింది. జొన్న 7914 , మొక్కజొన్న 87179 ఎకరాల్లో విత్తనాలు వడ్డాయి. 549 ఎకారాల్లో చెరకు సాగు చేశారు. ఈ నెలాఖరు నాటికి ఖరీఫ్ పంటల సాగు లక్ష్యాలకు చేరవయ్యే అవకాశాలు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు.