వాషింగ్టన్ : కృత్రిమ మేధ (ఎఐ)కు సంబంధించి అమెరికాలో బైడెన్ అధికార యంత్రాంగం కొన్ని నిర్థిష్ట భద్రతా చర్యలను చేపట్టింది. ఎఐ కంపెనీలు తాము రూపొందించే లేదా వినియోగించుకునే ఎఐ సాధనాల భద్రతా తనిఖీలు పరీక్షల ఫలితాలను తప్పనిసరిగా అధికార యంత్రాంగానికి తెలియచేయాల్సి ఉంటుంది. సంబంధిత కంపెనీ తాము రూపొందించే వ్యవస్థల పనితీరును తమకు తగు రీతిలో తెలియచేయాల్సి ఉంటుందని వైట్‌హౌస్ ఎఐ కౌన్సిల్ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ విస్తరిస్తోంది. దీని వల్ల తలెత్తే పరిణామాలు, చెడు జరుగుతోందా? మేలు సమకూరుతోందా? అనేది తేల్చుకోవడానికి ఎఐ కౌన్సిల్ ఏర్పాటు అయింది. శీఘ్రగతిన విస్తరిస్తోన్న ఈ వినూత్న సాంకేతికత పర్యవేక్షణ కోసం ప్రెసిడెంట్ బైడెన్ మూడు నెలల క్రితం కార్యనిర్వాహక ఉత్తర్వులు వెలువరించారు.
వీటిని పటిష్టంగా అమలు చేసేందుకు ఎఐ సంబంధిత మండలి సమావేశం అయింది. కంపెనీలకు తగు మార్గదర్శకాల విషయంలో కసరత్తు చేపట్టింది. ముందుగా ఎటువంటి సాధనం అయినా వాటి భద్రతా తనీఖీల నివేదికలను తమకు తప్పనిసరిగా అందించాల్సి ఉంటుందని తెలిపారు. ఎఐకు సంబంధించి వైట్‌హౌస్‌లో ప్రత్యేక సలహాదారుగా బెన్‌బుచనన్ నియమితులు అయ్యారు. ఏ సాంకేతిక వ్యవస్థ పనితీరు , బాగోగులు విశ్లేషించుకోవడం బాధ్యతాయుతం అవుతుంది. ఎఐ పరికరాలు ప్రజల వాడకానికి వెళ్లే ముందు వాటి తీరుతెన్నులు, భద్రతల గురించి తెలుసుకోవడం తప్పనిసరి అని , ఆంక్షలకు నియంత్రణకు కట్టుబడే ఎఐ కంపెనీలు పనిచేయాల్సి ఉంటుందనేదే ప్రెసిడెంట్ బైడెన్ ఆలోచన అని ప్రత్యేక సలహాదారు తెలిపారు.