చెన్నై : తమిళనాడు రాజకీయాలలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బిజెపితో అన్నాడిఎంకె తెగతెంపులు చేసుకుంది. బిజెపితో కూటమికి అధికారికంగా ముగింపు పలుకుతున్నట్లు తెలిపింది. ఎన్‌డిఎ నుంచి వైదొలుగుతున్నట్లు పేర్కొంటూ సోమవారం ఏకగ్రీవ తీర్మానం కూడా ఆమోదించారు. వచ్చే ఏడాది దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరిగే నేపథ్యంలోనే ఎన్‌డిఎ నుంచి మరో రాజకీయ పార్టీ వైదొలగడం కీలక పరిణామం అయింది. తాము బిజెపితో తెగతెంపులు చేసుకుంటున్న విషయాన్ని తీర్మానం ఆమోదం తరువాత పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి కెపి మునుస్వామి విలేకరులకు తెలిపారు. అంతకు ముందు పార్టీ ఎంపిలు, ఎమ్మెల్యేలు, , కార్యవర్గ సభ్యులు , జిల్లా విభాగాల అధినేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ ప్రధాన కార్యదర్శి పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పడి కె పళనిస్వామి అధ్యక్షత వహించారు. ఇందులో బిజెపితో ఇక విడిపోతున్న విషయంపై చర్చించారు. తరువాత అందరి సమ్మతితో నిర్ణయం తీసుకుని, ఈ మేరకుతీర్మానం వెలువరించారు.
దీనితో కొంత కాలంగా ఇరు పార్టీల మధ్య కొనసాగుతున్న దాగుడుమూతల ఆటకు తెరపడింది. పార్టీ తీసుకున్న నిర్ణయం గురించి తెలియగానే కార్యకర్తలు పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద సంబరాలు చేపట్టారు. పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు. మిఠాయిలు పంచుకున్నారు. బిజెపితో ఇంతకాలం సాగడం వల్ల బిజెపికి లాభం చేకూరుతుంది తప్పితే పార్టీ ప్రాధమిక ఆలోచనా విధానం అయిన ద్రవిడ సెంటిమెంట్లకు పార్టీ దూరం అవుతున్నదనే భావన ప్రజలలో నెలకొంటోందని నిర్థారించుకునే ఎన్నికలకు ముందు అన్నాడిఎంకె వర్గాలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడైంది. బిజెపి రాష్ట్ర నాయకత్వం తీరు బాగా లేదని, తమ పార్టీ నేత , ప్రధాన కార్యదర్శి పళనిస్వామి (ఇపిఎస్), పార్టీ కేడర్‌పై విమర్శలకు దిగుతూ నానా రచ్చ చేస్తున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా తాము బిజెపి నుంచి ఎన్‌డిఎ నుంచి తొలిగిపోతున్నట్లు, త్వరలోనే తమ పార్టీ తరఫున కొత్త రాజకీయ కూటమి ఏర్పాటు కానున్నట్లు , దీని ద్వారానే పార్లమెంటరీ ఎన్నికలలో తలపడనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి, అన్నాడిఎంకె కలిసి పోటీకి దిగాయి. ఈ ఎన్నికలలో డిఎంకె భారీ ఆధిక్యతతో గెలిచింది. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కె అన్నామళై ఇటీవల ద్రవిడ దిగ్గజ నేత సిఎన్ అన్నాదురైపై అమర్యాదకర వ్యాఖ్యలు చేయడం వివాదాన్ని ముదిరేలా చేసింది. ఇప్పుడు వెలువరించిన తీర్మానంలో బిజెపి రాష్ట్ర నాయకుల తీరుతెన్నులను పరోక్షంగా ఖండించారు. ఎన్నిసార్లు చెప్పినా తీరు మార్చుకోకుండా బిజెపి నేతలు తరచూ అన్నాదురైపై, తమ దివంగత నాయకురాలు జయలలితపై విమర్శలకు దిగడం ఎంతకాలం సహిస్తారని తెలిపారు.