నేటి నుంచి అహ్మదాబాద్‌లో ఎఐసిసి భేటీ కీలక
నిర్ణయాలు తీసుకునే అవకాశం కిందిస్థాయి నుంచి
పార్టీ పునర్‌వ్యవస్థీకరణకు యోచన డిసిసిలకు
మరింత పెద్దపీట రెండురోజుల పాటు మేధోమథనం
నేడు అహ్మదాబాద్‌కు సిఎం ఎఐసిసి సమావేశంలో
పాల్గొనున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
అహ్మదాబాద్: జాతీయ స్థాయిలో పార్టీ ఎదుర్కొంటున్న సవాళ్లు, కీ లక అంశాలపై భారీ చర్చలకు అఖిల భారత కాంగ్రెస్ సంసిద్ధమైంది. సంస్థాగతంగా పార్టీ పునరుద్ధరణ, పార్టీ ఎన్నికల భవిష్యత్ లపై ఒక రోడ్ మ్యాప్ రూపొందించేందుకు కాంగ్రెస్ నాయకులు ఏప్రిల్ 8,9 తేదీలలో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. పార్టీని అట్టడుగు స్థా యి నుంచీ పునరుద్ధరించే లక్ష్యంతో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు మ రిన్ని అధికారాలు కల్పించడంతో పాటు, పార్టీలో జవాబుదారీ తనం ఉండేలా చూడడంపై దృష్టి పెట్టనున్నారు. 137 ఏళ్ల పార్టీ సంస్థాగతంగా పునరుజ్జీవనానికి సంబంధించి అనేక కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు కార్యాచరణ ప్రణాళికలనూ ప్రకటిస్తారని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
ఈ ఏడాది, వచ్చే ఏడాది జరగనున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఖరారు చేస్తుంది. అహ్మదాబాద్ ఏఐసీసీ సమావేశాల ఇతి వృత్తం -న్యాయ్ పథ్, సంకల్ప్, సమర్పణ్, సంఘర్ష్. ఏప్రిల్ 8న పునర్వ్యవస్థీకరించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం సర్దార్ వల్లభాయ్ పటేల్ స్మారక మందిరంలో జరుగుతుంది.ఏప్రిల్ 9న ఏఐసీసీ మహా సభ జరుగుతుంది. దాదాపు 1,725 మంది ఏఐసీసీ సభ్యులు, కో ఆప్టెడ్ సభ్యులు, ఎంపీలు, వివిధ రాష్ట్రాలలోని మంత్రులు, సీనియర్ నాయకులు హాజరవుతారు. సబర్మతీ నది సమీపంలో సబర్మతి ఆశ్రమం, కోచ్రబ్ ఆశ్రమం ప్రాంతంలో బారీ ప్రాంగణంలో ఈ సమావేశం జరుగుతుంది.
ఈ సమావేశంలో పలు ముఖ్యమైన తీర్మానాలను చేసే అవకాశం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ ఏఐసీసీసమావేశాల్లో చర్చించే అంశాలు, చేయాల్సిన తీర్మానాలను సిద్ధం చేసేందుకు ముసాయిదా కమిటీని ఏర్పాటు చేసింది. అహ్మదా బాద్ ఏఐసీసీ సమావేశాలకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ సంవత్సరం కాంగ్రెస్ అధ్యక్షపదవిని మహాత్మాగాంధీ చేపట్టిన 100వ వార్షికోత్సవం. మరో దిగ్గజ నాయకుడు సర్దార్ పటేల్ 150వ జయంతి సంవత్సరం. ఉభయులూ గుజరాత్ లో జన్మించిన మహాను భావులే. దేశ చరిత్రను మార్చిన వారే. ఏప్రిల్ 8,9 తేదీల్లో అహ్మదాబాద్ లో జరుగనున్న ఏఐసీసీ సమావేశం గుజరాత్ లో జరుగుతున్న ఆరవ మహాసభ. స్వాతంత్రం వచ్చిన తర్వాత రాష్ట్రంలో నిర్వహిస్తున్న రెండో ఏఐసీసీ. 1885 కాంగ్రెస్ వ్యవస్థాపన జరిగింది. ఏఐసీసీ సమావేశాలకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ ప్రెసిడెంట్ లు సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో పాటు అగ్రశ్రేణి నాయకులంతా హాజరవుతారని పార్టీ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ తెలిపారు.కాంగ్రెస్ అగ్రనాయకత్వం జిల్లాఅధ్యక్షులతో మూడు బ్యాచ్ లుగా సమావేశాలు నిర్వహించి, సమస్యలను కూలంకషంగా చర్చించింది.
ఇకముందు డిసిసి లకు మరిన్ని అధికారాలు ఇవ్వడంతో పాటు, ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఎంపికలో జిల్లా యూనిట్లకు మరింత ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వివరించారు. కాంగ్రెస్ పార్టీలో డిసిసిల పాత్ర ఎంతో కీలకమైనదని పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ ను బలోపేతం చేసి, పటిష్టమైన భారతదేశాన్ని నిర్మించడంలో కీలకంగా కృషిచేయాలని వారిని కోరారు. ఈ ఏడాది చివర్లో బీహార్ లో ఎన్నికలు ఉన్నాయి. వచ్చే ఏడాది కేరళ, అసోం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పార్టీ తీసుకునే కీలక నిర్ణయాలకు ప్రాధాన్యం పెరిగింది.