Saturday, December 21, 2024

సిడబ్ల్యుసిలో తెలంగాణకు మొండి‘చేయి’

- Advertisement -
- Advertisement -

సీనియర్‌ల ఆశలపై అధిష్టానం నీళ్లు
ఇప్పటికే ఢిల్లీకి బారులు తీరిన తెలంగాణ కాంగ్రెస్ నాయకులు
రానున్న ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకొని తమకు
న్యాయం చేయాలని డిమాండ్
టిపిసిసిలో సీనియర్, జూనియర్‌ల మధ్య తారాస్థాయికి చేరిన గొడవలు
అందుకే సీడబ్ల్యూసీలో దక్కని చోటు
మనతెలంగాణ/హైదరాబాద్: ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లిఖార్జున ఖర్గే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని (సీడబ్ల్యూసీ) ఏర్పాటు చేశారు. ఇందులో తెలంగాణకు అధిష్టానం మొండిచేయి చూపిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సీనియర్ నాయకులకు ఢిల్లీ అధిష్టానం అవకాశం కల్పిస్తుందని పిసిసి భావించినా ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టక పోవడంతో నాయకులంతా ఊసూరుమంటున్నారు. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని పిసిసి నిర్ణయించినట్టుగా తెలిసింది. అధిష్టానం ఈ జాబితాను విడుదల చేయగానే సీనియర్ నాయకులంతా సమావేశమై ఈ విషయమై చర్చించినట్టుగా తెలిసింది. కచ్చితంగా మరికొందరు సీనియర్, జూనియర్ నాయకులకు ఇందులో అవకాశం ఇస్తే ఈ ఎన్నికల్లో పార్టీకి మరింత మేలు జరుగుతుందని నాయకులు అధిష్టానానికి తమ గళాన్ని వినిపించడానికి ఢిల్లీకి క్యూ కట్టారు.

శాశ్వత ఆహ్వానితులుగా సుబ్బిరామిరెడ్డి, కొప్పులరాజు

సీడబ్ల్యూసీలో ఆంధ్రప్రదేశ్ మాజీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డికి చోటు కల్పించారు. ఆయనతో పాటు ప్రత్యేక ఆహ్వానితులుగా ఎపికి చెందిన పల్లంరాజు, తెలంగాణకు చెందిన వంశీచందర్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. శాశ్వత ఆహ్వానితులుగా సుబ్బిరామిరెడ్డి, కొప్పులరాజు, దామోదర రాజనర్సింహాలను నియమించారు. అయితే, ఎన్నికలు సమీపిస్తోన్న వేళ తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ పెట్టి రాష్ట్ర నేతలకు అవకాశం కల్పించకుండా హైకమాండ్ మొండిచెయ్యి చూపడంపై నాయకులు చర్చించుకుంటున్నారు.

తెలంగాణ కాంగ్రెస్‌లో లొల్లి…అధిష్టానానికి తలనొప్పులు

మరోవైపు గాంధీ కుటుంబంలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ఈ వర్కింగ్ కమిటీలో ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్‌లో గ్రూప్ రాజకీయాలు ఎక్కువగా నడుస్తాయని విమర్శలు వినిపిస్తున్నాయి. సీనియర్, జూనియర్ అంటూ బహిరంగానే వివాదాలు టీ కాంగ్రెస్‌లో గొడవలు జరుగుతున్నాయి. ఈ వ్యవహారం కాంగ్రెస్ అధిష్టానానికి సైతం తలనొప్పిగా మారింది. అందులో భాగంగానే సీడబ్ల్యూసీలో పలువురు నాయకులకు చోటు ఇవ్వలేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్నికల సమయంలో కొంతమంది నేతలకు అవకాశం కల్పిస్తే వేరే వర్గం నేతలతో మళ్లీ గొడవలు మొదలవుతాయన్న ఉద్దేశంతోనే టి కాంగ్రెస్ నేతల్లో ఇద్దరికే అవకాశం ఇచ్చినట్లుగా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ములుగు ఎమ్మెల్యే సీతక్క, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఏఐసిసి సంపత్ ఇతర నేతలు సీడబ్ల్యూసీలో తమకు చోటు లభిస్తుందన్న ఆశాభావంతో ఉన్నారు. వీరి ఆశలపై నీళ్లు చల్లుతూ అధిష్టానం వారికి చోటు కల్పించకపోవడంతో తమ మొరను ఢిల్లీలో వినిపించడానికి సిద్ధమవుతున్నారు.

మల్లికార్జున ఖర్గేతో తెలంగాణ నేతల భేటీ

ఆదివారం ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ బృందంలో భట్టి విక్రమార్క, సీతక్క, మల్లు రవి, సంపత్ తదితర కాంగ్రెస్ నేతలు ఉన్నారు. ఈ నెల 26న చేవెళ్లలో జరగనున్న బహిరంగ సభతో పాటు, కొత్తగా పార్టీలో చేరికల అంశంపై కూడా చర్చించారు. ఈ నెల 29వ తేదీన వరంగల్‌లో మైనారిటీ డిక్లరేషన్, ఆ తర్వాత మహిళా డిక్లరేషన్ కూడా విడుదల చేసే విషయమై వారు ఆయనతో చర్చించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News