Friday, December 20, 2024

మీదే రాబందుల పార్టీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ఎఐసిసి అంటేనే అఖిల భారత కరప్షన్ కమిటీగా రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ ట్విట్టర్ ద్వారా నిప్పులు చెరిగారు. ‘మాది బిజెపి బంధువుల పార్టీ కాదు, మీదే భారత రాబందుల పార్టీ’ అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అవినీతికి, అసమర్థతకు ఒకే ఒక్క కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ అని దుయ్యబట్టారు. ‘స్కాములే తాచుపాములై, మీ యూపీఏను దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ను దిగమింగిన చరిత్రను ప్రజలు మరిచిపోలేద’ని అన్నారు. .‘మా పార్టీ బిజెపికి బి టీమ్ కాదని, కాంగ్రెస్ పార్టీకి సి టీమ్ అంతకన్నా కాదు. బిజెపి, -కాంగ్రెస్ రెండింటీనీ ఒంటిచేత్తో ఢీకొట్టే ఢీ టీమ్ బిఆర్‌ఎస్’ అని వెల్లడించారు. ‘బిఆర్‌ఎస్‌ను నేరుగా ఢీకొనే దమ్ములేక, బిజెపి భుజంపై తుపాకీ పెట్టి మమ్మల్ని కాల్చే కుట్ర చేస్తారా ? ఈ మిస్ ఫైరింగ్‌లో ముమ్మాటికీ కుప్పకూలేది కాంగ్రెస్సే, లక్ష కోట్లు వ్యయం కాని కాళేశ్వరం ప్రాజెక్టులో లక్షకోట్ల అవినీతా?, అర్థంలేని ఆరోపణలు చేసి, ప్రజాక్షేత్రంలో ఎన్నిసార్లు నవ్వులపాలవుతారు. తెలంగాణ ప్రజలు కోరుతోంది నిర్మాణాత్మక ప్రతిపక్షం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం కూడా తెలియని ప్రతిపక్షం కాదు. భూములు, భూరికార్డుల చుట్టూ అల్లుకున్న సవాలక్ష చిక్కుముళ్లను విప్పిన ధరణిని ఎత్తివేసి మళ్లీ దళారుల రాజ్యం తెస్తామన్న రాహుల్ గాంధీని తెలంగాణ సమాజం ఎప్పటికీ క్షమించద’న్నారు.

కర్ణాటకలో అన్నభాగ్య హామీని గంగలో కలిపి, ఇక్కడ 4 వేల పెన్షన్ అంటే నమ్మేదెవరు ? అని ప్రశ్నించారు. ఎన్నికల్లో హామీఇచ్చిన రేషన్ ఇవ్వలేనోళ్లు ఇక్కడికొచ్చి డిక్లరేషన్ అంటే విశ్వసించేదెవరు ? అని సూటిగా ప్రశ్నించారు. కర్ణాటకలో బిజెపిని ఓడించింది అక్కడి ప్రజలు తప్ప ముమ్మాటికీ కాంగ్రెస్ కానే కాదన్నారు. మరో ప్రత్యామ్నాయం లేకే ఆ ఫలితం తప్ప అది కాంగ్రెస్ ఘనత కాదు, సమర్థత అంతకన్నా కాదని ఎద్దేవా చేశారు.

సమ్మక్క జాతరను తలపించేలా పండుగలా సాగుతున్న పోడుభూముల పంపిణీ రాహుల్ గాంధీకి కనబడటం లేదా..?? అని ప్రశ్నిస్తూ కంటి వెలుగు కింద పరీక్షలు చేయించుకోండని సెటైర్ వేశారు. 4.6 లక్షల ఎకరాలు పంచి అడవిబిడ్డల జీవితాల్లో ఆనందాన్ని నింపిన మనసున్న ముఖ్యమంత్రి కేసిఆర్ అని కొనియాడారు. నీళ్లు నిధులు నియామకాలు అనే ఉద్యమ నినాదాలనే కాదు, జల్ జంగల్ జమీన్ అనే మన్యంవీరుడు కుమ్రంభీం కలలను కూడా సంపూర్ణంగా సాకారం చేసిన దార్శనిక సిఎం కెసిఆర్ అని ప్రస్తుతించారు. ‘మీ పాలనలో మంచం పట్టిన మన్యం వార్తలు మా పాలనలో మన్యానికి మంచిరోజులు తెలంగాణలో నిరంతరం పేదల పక్షాన నిలిచిన పార్టీ మాది. బ్రోకర్లు, కబ్జాకోరుల పక్షాన ఎప్పుడూ నిలబడే పార్టీ… మీది’ అని విమర్శించారు. కారు స్టీరింగ్ కెసిఆర్ చేతిలో పదిలం కానీ కాంగ్రెస్ పైనే రాహుల్‌కు కంట్రోల్ తప్పింద’ని దుయ్యబట్టారు.

‘బంగాళాఖాతంలో ఆల్రెడీ నిండా మునిగిన పార్టీ కాంగ్రెస్, ప్రజల గుండెల నిండా అభిమానం పొందిన పార్టీ బిఆర్‌ఎస్ అని అన్నారు. ‘మా తొమ్మిదేళ్ల పాలన.. వెలుగుల ప్రస్థానం. గత కాంగ్రెస్ పదేళ్ల పాలన చీకటి అధ్యాయం, కుమ్ములాటల కాంగ్రెస్‌ను నమ్మితే మళ్లీ కల్లోలం.. ఇది చైతన్యానికి ప్రతీకైన తెలంగాణ సమాజానికి తెలిసిన నిలువెత్తు నిజం.’ అని అన్నారు. ‘బిఆర్‌ఎస్ విస్తరిస్తే అంత వణుకెందుకు ? జాతీయ రాజకీయాలు.. మీ జాగీరా.. ?? వజ్రోత్సవాలు జరుపుకుంటున్న వేళ దేశానికి దొరికిన వజ్రాయుధం బిఆర్‌ఎస్ అని.. జై తెలంగాణ.. జై భారత్’ అని ట్విట్టర్‌లో మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News