న్యూఢిల్లీ: బిటెక్ కోర్సుల్ని 11 ప్రాంతీయ భాషల్లో బోధించడానికి అఖిలభారత సాంకేతిక విద్యామండలి (ఎఐసిటిఇ) అనుమతి ఇచ్చిందని కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్రప్రధాన్ తెలిపారు. హిందీ,మరాఠీ, తమిళం, తెలుగు, కన్నడ, గుజరాతీ, మలయాళం, బెంగాలీ, అస్సామీస్, పంజాబీ, ఒడియా భాషల్లో ఇంజినీరింగ్ కోర్సుల నిర్వహణకు ఎఐసిటిఇ అనుమతి ఇచ్చినట్టు ధర్మేంద్రప్రధాన్ ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల ప్రాంతీయ వైవిధ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నూతన విద్యా విధానం(ఎన్‌ఇపి) రూపొందిందని ధర్మేంద్రప్రధాన్ ట్విట్ చేశారు. ప్రధాన స్రవంతి విద్యను ప్రాంతీయ భాషల్లో అందించాలన్నదే ప్రధాని మోడీ సంకల్పమని ఆయన పేర్కొన్నారు. ఎఐసిటిఇ తీసుకున్న నిర్ణయాన్ని ఉప రాష్ట్రపతి స్వాగతించినందుకు ధర్మేంద్రప్రధాన్ కృతజ్ఞతలు తెలిపారు.
14 కాలేజీల్లో ఈ ఏడాది నుంచే
అభినందించిన ఉపరాష్ట్రపతి
8 రాష్ట్రాల్లోని 14 ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రాంతీయ భాషల్లో కోర్సుల నిర్వహణకు నిర్ణయించడం పట్ల ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సంతోషం వ్యక్తం చేశారు. ఎంపిక చేసిన ఇంజినీరింగ్ కోర్సుల్లో నూతన విద్యా సంవత్సరం నుంచే ప్రాంతీయ భాషల్లో బోధన చేయనున్నారు. నూతన విద్యా విధానంలో భాగంగా బిటెక్ కోర్సుల్ని 11 ప్రాంతీయ భాషల్లో నిర్వహించడానికి ఎఐసిటిఇ అనుమతి ఇవ్వడాన్ని నాయుడు అభినందించారు. ప్రాంతీయ భాషల్లో బోధనకు మరిన్ని ఇంజినీరింగ్, సాంకేతిక విద్యా సంస్థలు ముందుకు రావాలని నాయుడు కోరారు.