Monday, January 20, 2025

సన్‌రైజర్స్ కెప్టెన్‌గా మార్‌క్రామ్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రానున్న ఐపిఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ కెప్టెన్‌గా సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్ ఐడెన్ మార్‌క్రామ్ ఎంపికయ్యాడు. ఈ సీజన్‌లో మార్‌క్రామ్‌ను సారథిగా నియమించాలని సన్‌రైజర్స్ యాజమాన్యం నిర్ణయించింది. ఈ విషయాన్ని సన్‌రైజర్స్ అధికారులు గురువారం అధికారికంగా ప్రకటించారు. సౌతాఫ్రికాకు చెందిన మార్‌క్రామ్ కిందటి సీజన్‌లో సన్‌రైజర్స్‌కు ఎంపికయ్యాడు. మెగా వేలంలో అతన్ని భారీ మొత్తాన్ని వెచ్చించి సన్‌రైజర్స్ సొంతం చేసుకుంది. కాగా ఈ సీజన్‌లో కేన్ విలియమ్సన్ దూరం కావడంతో కొత్త కెప్టెన్‌గా మార్‌క్రామ్‌ను నియమించారు.

టి20 క్రికెట్‌లో మార్‌క్రామ్‌కు మంచి రికార్డు ఉంది. ఇటీవల జరిగిన సౌతాఫ్రికా టి20 ఫ్రాంచైజీ క్రికెట్ టోర్నీలో పాల్గొన్న సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్ టీమ్‌కు కూడా మార్‌క్రామ్ సారథిగా వ్యవరించాడు. అతని సారథ్యంలో సన్‌రైజర్స్ ట్రోఫీని సొంతం చేసుకుంది. దీంతో రానున్న ఐపిఎల్ సీజన్‌లో కూడా మార్‌క్రామ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయాలని యాజమాన్యం నిర్ణయించింది. భారత్‌కు చెందిన మయాంక్ అగర్వాల్ కూడా కెప్టెన్సీ రేసులో ఉన్నా అతన్ని కాదని మార్‌క్రామ్‌కే ఈ పదవి వరించింది. కిందటి సీజన్‌లో సన్‌రైజర్స్ అత్యంత పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరిచింది. ఈ నేపథ్యంలో ఈసారి అప్పటి కెప్టెన్ విలియమ్సన్‌ను సన్‌రైజర్స్ వదులుకొంది. తాజాగా కెప్టెన్‌గా మార్‌క్రామ్‌ను ఎంపిక చేసింది.

కాగా, ఇతర జట్లతో పోల్చితే సన్‌రైజర్స్ ఎప్పుడూ కూడా విదేశీ ఆటగాళ్లకే కెప్టెన్‌గా నియమించడం అనవాయితీగా వస్తోంది. గతంలో డేవిడ్ వార్నర్ కూడా సుదీర్ఘ కాలం పాటు సన్‌రైజర్స్‌కు సారథిగా వ్యవహరించాడు. ఆ తర్వాత కొంతకాలం పాటు భువనేశ్వర్ కుమార్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. కానీ అతన్ని తప్పించి న్యూజిలాండ్‌కు చెందిన విలియమ్సన్‌ను సన్‌రైజర్స్ కెప్టెన్‌గా యాజమాన్యం నియమించింది. తాజాగా జట్టు సారథ్య బాధ్యతలను సౌతాఫ్రికా క్రికెటర్ మార్‌క్రామ్‌కు అప్పగించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News