పాట్నా: కరోనా టీకా తీసుకోవడానికి పెద్ద వాళ్లే భయపడుతూ ఉంటే భారత్ బయోటెక్ సంస్థ పిల్లలపై కోవాగ్జిన్ టీకా ప్రభావానికి సంబంధించి నిర్వహిస్తున్న క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొనడానికి పాట్నాలోని అఖిల భారత వైద్య శాస్త్రాల పరిశోధనా సంస్థ(ఎయిమ్స్)లోని వైద్యులు తమ పిల్లలతో ముందుకు రావడం గమనార్హం. కరోనా వైరస్ థర్డ్ వేవ్ పిల్లలపై ప్రభావం చూపించవచ్చన్న అంచనాలతో ఈ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. తొలి దశను 6-12 ఏళ్ల గ్రూపు పిల్లలపై నిర్వహిస్తున్నారు. గత సోమవారం ఈ ట్రయల్స్ ప్రారంభమైనాయని, ఏడుగురు పిల్లలకు తొలి డోసు ఇచ్చినట్లు పాట్నా ఎయిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ సింగ్ చెప్పారు.
ఆస్పత్రిలో పని చేసే వైద్య దంపతులు వీణా సింగ్, సంతోష్‌ల ఇద్దరు పిల్లలు కూడా టీకా తీసుకున్నారు. పెద్ద కుమారుడు సంతోష్‌కు తొలి టీకా ఇవ్వగా ఏడేళ్ల తమ్ముడు సమ్యక్ తర్వాత టీకా తీసుకున్నాడు. కోవాక్జిన్ తొలి దశ ట్రయల్స్‌లో భాగంగా ఇప్పటివరకు 12- 18 ఏళ్ల మధ్య ఉన్న 20 మంది పిల్లలకు టీకా తొలి డోసు ఇచ్చినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. దేశవ్యాప్తంగా కరోనా టీకా ఇవ్వడానికి భారత ప్రభుత్వం అనుమతించిన రెండు టీకాల్లో కోవాగ్జిన్ ఒకటి. హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ ఐసిఎంఆర్‌తో కలిసి ఈ వ్యాక్సిన్‌ను దేశీయంగా అభివృద్ధి చేసింది.