Thursday, January 23, 2025

కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా ఐలేని జయరాం రెడ్డి !

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:  కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా ఐలేని జయరాంరెడ్డి పేరును అధిష్టానం ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. సిద్దిపేట అర్బన్ మండలం మందపల్లి గ్రామానికి చెందిన ఫార్మా కంపెనీల అధినేత జయరాంరెడ్డికి అవకాశం కల్పించాలని నిర్ణయించినట్టుగా సమాచారం. అయితే ఈ సీటును మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, బిసి నాయకుడు నీలం మధు ముదిరాజ్ ఇద్దరిలో ఒకరికి అవకాశం కల్పించే అవకాశముందని వార్తలొచ్చినా సర్వేలు మాత్రం జయరాంరెడ్డికే అనుకూలంగా వచ్చినట్టు తెలుస్తోంది. సిఎం రేవంత్‌రెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లా నేతలతో పలు దఫాలు చర్చలు జరిపిన తరువాత జయరాంరెడ్డి అభ్యర్థిత్వాన్ని గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలిసింది. అధికారికంగా ఏఐసిసి ఆయన పేరు ప్రకటించాల్సి ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మెదక్ పార్లమెంట్ పరిధిలో సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్‌చెరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క మెదక్‌లో మాత్రమే కాంగ్రెస్ విజయం సాధించగా మిగతా ఆరు స్థానాలను బిఆర్‌ఎస్ కైవసం చేసుకుంది.
ముగ్గురు అన్నదమ్ములు పారిశ్రామికవేత్తలే..
మందపల్లి గ్రామానికి చెందిన జయరాంరెడ్డి, ఇంద్రసేనా రెడ్డి, వెంకట్రాం రెడ్డిలు ముగ్గురు అన్నదమ్ములు. విజయ్ ఎక్స్‌ప్లోజివ్స్(గ్రానైట్ పేల్చే మందుగుండు) వంటి కంపెనీతో పాటు తులసీ ఆసుపత్రి, ఫార్మా కంపెనీలు ఉన్నాయి. ఫార్మా కంపెనీల అధినేతగా జయరాం రెడ్డి ప్రత్యేకంగా గుర్తింపు పొందారు. ఉమ్మడి మెదక్ జిల్లాతో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉందని ఆయన ఎంపిక బాగుంటుందని జిల్లా నేతలు అధిష్టానానికి సూచనలు చేసినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News