హైదరాబాద్: రాజస్థాన్, కర్నాటకలో ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎఐఎంఐఎం పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసీ గురువారం ప్రకటించారు. ఈ ఏడాది చివరిలో జరగవలసి ఉన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తమ పార్టీ బలం పుంజుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దారుస్సలాంలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఐఐఎంఐఎం 65 వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం సిద్ధంగా ఉండాలని ఆయన పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
తెలంగాణలో విద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి బిజెపి ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. బిజెపిని తెలంగాణ ప్రజలు తిరస్కరిస్తారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేస్తూ రాష్ట్రంలో శాంతి సామరస్యాలు కొనసాగాలని ఆకాంక్షించారు. హర్యానాలో గోసంరక్షకుల దాడిలో దారుణ హత్యకు గురైన రాజస్థాన్‌కు చెందిన జునాయిద్, నసీర్ కుటుంబాలకు ఆర్థిక సహాయం అందచేస్తామని ఆయన ప్రకటించారు. తెలంగాణలో పోలీసు కస్టడీలో మరణించిన ఖదీర్ ఖాన్ అనే యువకుడి కుటుంబానికి కూడా ఆదుకుంటామని ఆయన తెలిపారు.