హైదారాబాద్: ఆల్ ఇండియా మజ్లీస్‌ఎఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఎఐఎంఐఎం) నాయకుడు మీర్జా రహ్మత్ బేగ్ హైదరాబాద్ ఎంఎల్‌సిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన మాజీ ఎంఎల్‌సి సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ స్థానాన్ని భర్తీ చేయనున్నారు. జాఫ్రీ పదవి కాలం మే 1తో ముగియనున్నది. భారత రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్) బేగ్‌కు మద్దతు ఇవ్వడమే కాదు, పోటీగా ఎవరినీ నిలబెట్టలేదు. బిజెపి, కాంగ్రెస్ పార్టీలు కూడా ఎవరినీ నిలబెట్టలేదు. బరిలో ఒకరే పోటీపడగా అతడి అభ్యర్థిత్వాన్ని సాంకేతికత కారణాలతో తిరస్కరించారు. అదే రోజున(సోమవారం) బేగ్ ఎన్నికను ప్రకటించారు. రహ్మత్ బేగ్ 2018లో రాజేంద్రనగర్ నుంచి అసెంబ్లీకి పోటీచేశారు. కానీ బిఆర్‌ఎస్, టిడిపి అభ్యర్థుల తర్వాత మూడో స్థానంలో నిలిచారు.
గెలిచాక బేగ్ తమ పార్టీ నేత అసదుద్దీన్ ఓవైసీకి ట్వీట్ చేశారు. ‘అహ్మదులిల్లాహ్ నేను తెలంగాణ శాసన మండలికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాను. నామీద కృప కురిపించిన అల్లాహ్‌కు కృతజ్ఞతలు. బారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ సాబ్‌కు నేను రుణపడి ఉంటాను. నా మీద నమ్మకం ఉంచినందుకు ఆయనకు కృతజ్ఞతలు. నేను తెలంగాణ ప్రజలకు నాకు చేతనైనంత సేవ చేస్తాను’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.