న్యూఢిల్లీ : చైనా యుద్ధ విమానాలను సరిహద్దు లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఏసీ)కి దగ్గరగా గుర్తించిన వెంటనే తాము చాలా వేగంగా ఫైటర్ విమానాలతోపాటు అన్ని వ్యవస్థలను అత్యంత అప్రమత్తం చేస్తామని భారత వాయుసేన (ఐఏఎఫ్) చీఫ్ , ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి తెలిపారు. జూన్ చివరి వారంలో చైనా యుద్ధ విమానం ఎల్‌ఏసీ ప్రాంతంలో కొన్ని నిమిషాల పాటు తిరిగింది. దీంతో భారత రాడార్‌లు గుర్తించి అలెర్ట్ చేశాయి. వెంటనే భారత ఫైటర్ జెట్స్ రంగం లోకి దిగడంతో చైనా యుద్ద విమానం తోక ముడిచింది.
ఇదిలా ఉండగా, తూర్పు లడఖ్ సరిహద్దులో నెలకొన్న ఘర్షణ వాతావరణాన్ని నివారించేందుకు భారత్, చైనా మధ్య 16 వ విడత ఉన్నత స్థాయి సైనిక చర్చలు ఆదివారం ప్రారంభమయ్యా. ఈ నేపథ్యంలో ఐఏఎఫ్ చీఫ్ వీఆర్ చౌదరి , ఏఎన్‌ఐ వార్తా సంస్థతో మాట్లాడారు. సరిహద్దులో చైనా ఘర్షణ వైఖరిని ప్రస్తావించారు. ఎల్‌ఏసీ గగన తలంలో ఐఏఎఫ్ నిఘా ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. చైనీస్ ఎయిర్ క్రాఫ్ట్ ఏల్‌ఏసీకి కొంచెం దగ్గరగా వస్తున్నట్టుగా గుర్తించినప్పుడల్లా తగన చర్యలు చేపడతాం. ఫైటర్ విమానాలను రంగం లోకి దించడంతోపాటు అన్ని వ్యవస్థలను హై అలర్ట్‌లో ఉంచుతాం. ఇలా చైనా విమానాలను అడ్డుకుంటాం అని తెలిపారు. అయితే చైనా ప్రతిసారీ ఇలాంటి కవ్వింపులకు ఎందుకు దిగుతుందో అన్నదానికి సరైన కారణం కనిపించడం లేదన్నారు.