ఎయిర్ చీఫ్ మార్షల్ చౌదరి హెచ్చరిక
న్యూఢిల్లీ: భవిష్యత్తులో యుద్ధాలు కేవలం ఆయుధాలతోనే కాక భిన్నరూపాలలో ఉంటాయని భారత వైమానిక దళాధికారి వివేక్ రామ్ చౌదరి తెలిపారు. భవిష్యత్ యుద్ధాలలో ఆయుధాలుగా ఆర్థిక ఆంక్షలు, సమాచార ఆటంకాలు, కంప్యూటర్ వైరస్ నుంచి హైపర్‌సోనిక్ క్షిపణుల వరకు ఉపయోగించే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అఖిల భారత మేనేజ్‌మెంట్ అసోసియేషన్(ఎఐఎంఎ) మంగళవారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ యుద్ధ క్షేత్రాన్ని రూపొందించడానికి సైబర్–ఇన్ఫర్మేషన్ ఆధునిక సాధనాలుగా మారాయని ఎయిర్ చీఫ్ మార్షల్ చౌదరి అన్నారు. మనిషికి మనిషికి మధ్య సంబంధాలు పటిష్టం కావడంతో మన వ్యవస్థల మధ్య జరిగే సైబర్ దాడులు మన కమాండ్ కంట్రోల్ వ్యవస్థలను దెబ్బతీయగలదని ఆయన అన్నారు. తదుపరి యుద్ధంలో శత్రువు ఒక దేశం కాని ఒక సంస్థ కాని కాదని చెప్పడమే తన ఉద్దేశమని ఆయన అన్నారు. భవిష్యత్తులో భారత్‌పై అన్ని రకాల దాడులు జరగవచ్చని, అవి ఆర్థికపరమైన ఆంక్షల నుంచి, దౌత్యపరంగా ఏకాకిని చేయడం, సమాచార అడ్డంకుల ద్వారా సైనికపరంగా దెబ్బతీయడం వంటివని ఆయన చెప్పారు. సరిహద్దుల వద్ద మొదటి బుల్లెట్ పేలకముందే ఇవన్నీ జరిగిపోతాయని ఆయన అన్నారు.