న్యూఢిల్లీ: సాయుధ దళాల్లో చేరిక కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త పథకం ‘అగ్నిపథ్’పై ఆందోళనలు ఓ వైపు కొనసాగుతూనే ఉండగా మరో వైపు భారత వైమానిక దళం( ఐఎఎఫ్) శుక్రవారం ఈ పథకం కింద రిజిస్ట్రేషన్ విండోను తెరవడం ద్వారా నియామక ప్రక్రియకు శ్రీకారం చుట్టింది.‘అగ్నివీరులకోసం దరఖాస్తు చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ విండో ఈ రోజు ఉదయం 10 గంటలనుంచి పని చేస్తోంది’ అని వాయుసేన ఒక ట్వీట్‌లో తెలిపింది. ఈ నెల 14న అగ్నిపథ్ పథకాన్ని ప్రకటించిన కేంద్రప్రభుత్వం 17.5 ఏళ్లనుంచి 21ఏళ్ల లోపు యువకులను నాలుగేళ్ల కాలానికి ఈ పథకం కింద సైన్యంలో చేర్చుకుంటామని, ఆ తర్వాత వారిలో 25 శాతం మందిని రెగ్యులర్ సర్వీస్‌లోకి తీసుకోవడం జరుగుతుందని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఆర్మీ ఉద్యోగార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. అయితే ప్రభుత్వం, ఆర్మీ మాత్రం ఈ పథకాన్ని గట్టిగా సమర్థించడమే కాకుండా, దీనివల్ల యువతకు ఎంతో మేలు జరుగుతుందని, ఆర్మీలో సైనికుల సగటు వయసు రాబోయే రోజుల్లో 36 ఏళ్లనుంచి 26 ఏళ్లకు తగ్గుతుందని వాదిస్తున్నాయి.
Air Force begins Recruitment for Agniveers