Wednesday, January 22, 2025

మహిళా ఉద్యోగి గదిలోకి చొరబడిన ఆగంతకుని దాడి

- Advertisement -
- Advertisement -

ఎయిర్ ఇండియా మహిళా క్యాబిన్ ఉద్యోగి ఒకరిపై లండన్ హోటల్‌లో ఒక ఆగంతకుడు దౌర్జన్యం చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయమై విచారం వ్యక్తం చేసిన ఎయిర్ ఇండియా స్థానిక పోలీసులతో దీని గురించి మాట్లాడుతున్నామని తెలియజేసింది. మహిళా క్యాబిన్ ఉద్యోగి బస చేస్తున్న హోటల్ గదిలోకి ఒక నిర్వాసిత వ్యక్తి చొరబడి, ఆమెపై దౌర్జన్యం చేసినట్లు అభిజ్ఞ వర్గాలు వెల్లడించాయి. ఆమె కేకలు వేయడంతో సమీపంలో బస చేస్తున్న ఇతరులు వచ్చి ఆమెను కాపాడినట్లు, అతనిని పట్టుకున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. అయితే, ఒక వర్గం కథనం ప్రకారం, క్యాబిన్ ఉద్యోగిపై లైంగిక దౌర్జన్యం కాగా, మరొక వర్గం సమాచారం ప్రకారం అది శారీరక దాడి మాత్రమే. ఆ ఘటన లండన్ హీత్రో విమానాశ్రయం సమీపంలోని ఒక స్టార్ హోటల్‌లో జరిగింది.

క్యాబిన్ ఉద్యోగి భారత్‌కు తిరిగి వచ్చినట్లు, ఆమెకు కౌన్సెలింగ్ జరుగుతున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. ‘ఒక ప్రఖ్యాత అంతర్జాతీయ చైన్ నడుపుతున్న ఒక హోటల్‌లో చట్టవిరుద్ధంగా జరిగిన చొరబాటు ఘటన మమ్మల్ని ఆవేదనకు గురి చేసింది. ఆ ఘటన మా సిబ్బందిలో ఒకరిని బాధించింది’ అని ఎయిర్ ఇండియా అధికార ప్రతినిధి ఒకరు ఒక ప్రకటనలో తెలిపారు. ఆ ఉద్యోగినికి, వారి విస్తృత బృందానికి వృత్తిపరమైన కౌన్సెలింగ్ సహా అన్ని విధాల మద్దతు అందజేస్తున్నామని ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలియజేసింది. కాగా, ఈ ఘటన వెలుగు చూసిన తరువాత సంస్థ ఉద్యోగులు భద్రత విషయాల గురించి సంస్థ అంతర్గత సమాచార వేదికలో ఫిర్యాదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News