క్యాబిన్ సిబ్బంది కొరత కారణంగా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ శుక్రవారం సుమారు 75 విమాన సర్వీసులు రద్దు చేసిందని అధికారి ఒకరు వెల్లడించారు. అయితే, క్యాబిన్ సిబ్బందిలో ఒక వర్గం తమ సమ్మెను విరమించిన తరువాత ఆదివారం నాటికి మామూలుగా విమాన సర్వీసుల నిర్వహణ సాధ్యం కావచ్చునని ఆయన సూచించారు. సిబ్బంది సమ్మె కారణంగా విమాన సర్వీసుల నిర్వహణకు గణనీయంగా అంతరాయం వాటిల్లింది.
విమాన సర్వీసుల రద్దు, ప్రయాణికులకు పరిహారం వల్ల సంస్థకు వాటిల్లిన రెవెన్యూ నష్టాలు సుమారు రూ. 30 కోట్ల మేరకు ఉందవచ్చని భావిస్తున్నట్లు ఆ అధికారి తెలిపారు. కాగా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ అధికార ప్రతినిధి వ్యాఖ్య ఏమీ చేయలేదు. క్యాబిన్ సిబ్బందిలో ఒక వర్గం వారు గురువారం సాయంత్రం తమ సమ్మె విరమించారు. సమ్మెలో ఉన్న సిబ్బందిలో 25 మందికి జారీ చేసిన ఉద్వాసన పత్రాలను సంస్థ ఉపసంహరించుకుంది. క్యాబిన్ సిబ్బంది మంగళవారం రాత్రి సమ్మె ప్రారంభించారు.