Monday, December 23, 2024

ఎయిరిండియాకు రూ 30 లక్షల జరిమానా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : విమానంలో మూత్రవిసర్జన ఘటనకు సంబంధించి ఎయిరిండియాకు రూ 30 లక్షల జరిమానా పడింది. ప్రభుత్వ ఆధీనంలోని విమానయాన నియంత్రణ అధీకృత సంస్థ (డిజిసిఎ) ఈ జరిమానాను విధించింది. సంబంధిత విమానం పైలెట్ లైసెన్సును మూడు నెలల పాటు సస్పెండ్ చేసింది. గత ఏడాది నవంబర్ 26న న్యూయార్క్ నుంచి న్యూఢిల్లీకి వస్తున్న విమానంలో ఈ అరుదైన జుగుప్సాకర ఘటన జరిగింది. ఇది పలు మలుపులకు దారితీసింది. ఇటువంటి ఘటనలకు ఎయిరిండియాదే బాధ్యతగా భావిస్తూ జరిమానా నిర్ణయం తీసుకున్నారు. ఇదే విధంగా ఎయిరిండియాకు చెందిన విమాన సేవల డైరెక్టర్‌కు రూ 3 లక్షల ఫైన్ వేస్తున్నట్లు కూడా డిజిసిఎ తెలిపింది. తమకు సంబంధిత విషయం గురించి పూర్తి స్థాయిలో అధికారికంగా ఈ నెల 4వ తేదీన తెలిసిందని, అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఇప్పుడు దాదాపు రెండు నెలల తరువాత ఈ చర్య తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు.

నిర్ణీత నిబంధనల ఉల్లంఘనలకు తగు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఓ ప్రయాణికుడి అరాచక చర్యకు విమానయాన సంస్థకు జరిమానా విధించడం డిజిసిఎ చరిత్రలో ఇదే తొలిసారి. న్యూయార్క్ నుంచి వస్తున్న విమానంలోని బిజినెస్ క్లాసులోని ప్రయాణికుడు శంకర్ మిశ్రా బాగా తాగిన మత్తులో తోటి ప్రయాణికురాలిపై మూత్రవిసర్జనకు దిగినట్లు ఆరోపణలు వచ్చాయి. తమకు డిజిసిఎ జరిమానా విధించడంపై ఎయిరిండియా అధికార ప్రతినిధి ఒక్కరు స్పందించారు. సంబంధిత విషయంపై తమకు సమాచారం అందిందని, ఈ జరిమానా ఆదేశాలను తాము పరిశీలిస్తున్నామని తెలిపారు. నిర్వహణలో వైఫల్యాలు ఉన్న విషయాన్ని తాము అంగీకరిస్తున్నట్లు , పలు విషయాలను పరిశీలించి ఎప్పటికప్పుడు నివారణ చర్యలు తీసుకుంటున్నామని, తమ సిబ్బంది పనితీరును వారి అవగావహన, అప్రమత్తతను పెంచేందుకు కృషి చేస్తున్నామని , నిబంధనలను పట్టించుకోకుండా వ్యవహరించే ప్రయాణికుల పట్ల వ్యవహరించే విధివిధానాలకు అనుగుణంగా తమ పనితీరు ఉంటుందని తెలిపారు.

మరో వైపు గురువారం ఎయిరిండియా అరాచక ప్రయాణికుడు శంకర్ మిశ్రాపై నాలుగు నెలల విమాన నిషేధం ప్రకటించింది. ప్రస్తుతం మిశ్రా ఈ ఘటనకు సంబంధించి జైలులో కస్టడీలో ఉన్నాడు. ఆయన ఉద్యోగం కూడా పోయింది. ప్రయాణికురాలే మూత్రం విసర్జించిందని, తనపై తప్పుడు ఫిర్యాదులకు దిగుతోందని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News