Sunday, December 22, 2024

వీల్‌ఛైర్ లేక వృద్దుడి మృతి ఘటన… రూ.30 లక్షల జరిమానా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : వీల్‌ఛైర్ సదుపాయం కల్పించకపోవడంతో ఓ వృద్దుడు నడుచుకుంటూ వెళ్లి కుప్పకూలిన సంఘటన ముంబై విమానాశ్రయంలో ఇటీవల చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సంఘటనను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తీవ్రంగా పరిగణించి ఎయిర్ ఇండియాపై చర్యలు తీసుకుంది. విమాన సేవల్లో అలసత్వం వహించినందుకు రూ.30 లక్షల జరిమానా విధించింది. అమెరికా నుంచి ఎయిరిండియా విమానంలో భారత్‌కు వచ్చిన వృద్ధ దంపతులు ముంబై లోని ఛత్రపతి శివాజీ మహరాజ్ విమానాశ్రయంలో ఫిబ్రవరి 12న దిగారు. సిబ్బంది వీల్‌ఛైర్ సదుపాయం కల్పించక పోవడంతో ఆ వృద్ధుడు (80) విమాపం నుంచి టెర్మినల్ వరకు నడుచుకుంటూ వెళ్లాడు. ఇమిగ్రేషన్ విభాగం వద్దకు చేరుకున్న ఆయన ఒక్కసారిగా కుప్ప కూలాడు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఈ సంఘటనపై వివరణ ఇవ్వాలని ఎయిరిండియాకు డీజీసిఎ షోకాజ్ నోటీస్‌లు జారీ చేసింది.

దీనిపై ఎయిరిండియా వివరణ ఇచ్చింది. ప్రయాణికుడి భార్యకు వీల్‌ఛైర్ సమకూర్చామని, వీల్‌ఛైర్లకు భారీ డిమాండ్ ఉన్నందున మరొకటి సమకూర్చేవరకు కొద్దిసేపు వేచి ఉండాలని విజ్ఞప్తి చేసినట్టు తెలిపింది. అయితే బాధితుడు తన భార్యతో కలిసి టెర్మినల్ వరకు నడుచుకుంటూ వచ్చాడని, ఇమిగ్రేషన్ తనిఖీ కోసం వేచి చూస్తుండగా, తీవ్ర అనారోగ్యానికి గురైనట్టు వివరించింది. అయితే ఎయిర్ ఇండియా స్పందనను పరిశీలించిన డీజీసీఎ , వీల్‌ఛైర్ సమకూర్చడంలో విమానయాన సంస్థ అలసత్వం వహించిందని తేల్చింది. దీంతో రూ.30 లక్షల జరిమానా విధించింది. ఈ సందర్భంగా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా తగిన సంఖ్యలో వీల్‌ఛైర్లను అందుబాటులో ఉంచుకోవాలని అన్ని విమానయాన సంస్థలకు డీజీసీఎ అడ్వైజరీ జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News