న్యూఢిల్లీ:విమానం గాల్లో ఉండగా తులుపులు తెరవడానికి ప్రయత్నించడం, అడ్డు వచ్చిన ఇద్దరు ఎయిర్ హోస్టెస్‌లపై దాడి చేయడం వంటి దురుసు చర్యలకు ఒక ప్రయాణికుడు పాల్పడడంతో న్యూఢిల్లీ నుంచి లండన్ బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానం మధ్యలోనే వెనక్కు మరలి న్యూఢిల్లీ తిరిగొచ్చింది. ఈ సంఘటన సోమవారం(ఏప్రిల్ 10) చోటుచేసుకుంది.
ఎయిర్ ఇండియా ఎఐ 111 విమానం సోమవారం ఉదయం షెడ్యూల్ ప్రకారం న్యూఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌లోని హీత్రో విమానాశ్రయానికి బయల్దేరింది. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే జస్కీరత్ అనే ప్రయాణికుడు విమానంలో గొడవ మొదలుపెట్టాడు. డోర్ తెరవడానికి ప్రయత్నించాడు. అతడిని వారించే ప్రయత్నం చేసిన ఇద్దరు ఎయిర్‌హోస్టెస్‌లపై చేయి చేసుకున్నాడు.
దీంతో విమానంలోని సిబ్బంది అతడిని సీటులోనే బలవంతంగా కూర్చోపెట్టారు. పరికరాల సాయంతో అతడు సీటులోనుంచి లేవకుండా కట్టేశారు.అయినప్పటికీ అతడి ఆగడాలు ఆగలేదు. విమాన సిబ్బందిపై దూషణలకు దిగాడు. పరిస్థితిని అదుపుచేయలేని పరిస్థితిలో విమానం బయల్దేరిన మూడు గంటల తర్వాత తిరిగి బయల్దేరిన చోటకే విమానం చేరుకుంది.
విమానంలోనుంచి జస్కీరత్‌ను దింపేసిన సిబ్బంది అతడిని న్యూఢిల్లీ విమానాశ్రయ భద్రతా సిబ్బందికి అప్పగించారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని తాము విమానాన్ని తిరిగి న్యూఢిల్లీలో ల్యాండ్ చేసినట్లు ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు. గాయపడిన తమ విమాన సబిబ్బందికి తగిన సహాయక చర్యలు చేపట్టడం జరిగిందని ప్రతినిధి తెలిపారు. కొద్ది గంటల తర్వాత విమానం తిరిగి లండన్ బయల్దేరి వెళ్లినట్లు ఆయన చెప్పారు.
ప్రయాణికుడి వీరంగం..బయల్దేరిన చోటికే తిరిగొచ్చిన విమానం
- Advertisement -
- Advertisement -
- Advertisement -