న్యూఢిల్లీ : విమానం కాక్‌పిట్ లోకి స్నేహితురాలిని తీసుకువెళ్లిన సంఘటనకు సంబంధించి ఇద్దరు ఎయిర్ ఇండియా పైలట్లపై వేటు పడింది. ఢిల్లీ నుంచి లేహ్‌కు వెళ్లిన ఎయిరిండియా ఏఐ445 విమానంలో గతవారం ఈ సంఘటన జరిగింది. ఈ విమాన ప్రయాణికుల్లో ఒకరు పైలట్, కోపైలట్‌కు స్నేహితురాలు. దీంతో విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటకే నిబంధనలకు విరుద్ధంగా ఆమెను కాక్‌పిట్ లోకి ఆహ్వానించారు. అచితూ ఆమె ఎంతసేపు అక్కడ కూర్చుందో తెలియదు కానీ, క్యాబిన్ సిబ్బంది నుంచి ఫిర్యాదు రావడంతో పైలట్, కో పైలట్ పై ఎయిర్ ఇండియా యాజమాన్యం చర్యలు తీసుకుంది.
పైలట్, కో పైలట్‌లను విధుల నుంచి పక్కన పెట్టింది. దీనిపై దర్యాప్తు చేసేందుకు కమిటీని నియమించినట్టు ఎయిర్‌లైన్ అధికారిక వర్గాల సమాచారం. దీనిపై డిజిసిఎ స్పందించింది. నిబంధనల ప్రకారం ఈ ఘటనపై చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించింది. ప్రయాణికుల అనుచిత ప్రవర్తనలతో తరచుగా వార్తల్లో కెక్కే ఎయిరిండియా, తాజాగా ఈ వివాదంలో చిక్కుకోవడం చర్చనీయాంశం అవుతోంది. కాక్‌పిట్ లోకి ఈ విధంగా ప్రయాణికులను ఆహ్వానించడం ఎయిరిండియా గత ఆరు నెలల్లో ఇది రెండోసారి కావడం గమనార్హం.
ఈ ఏడాది ఫిబ్రవరి లోనూ ఓ ఎయిరిండియా విమానంలో ఇదే విధమైన సంఘటన సంభవించింది దుబాయి నుంచి ఢిల్లీ వచ్చిన విమానంలో పైలట్ తన స్నేహితురాలిని కాక్‌పిట్ లోకి ఆహ్వానించడమే గా, దాదాపు మూడు గంటల పాటు అక్కడే కూర్చోబెట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా ఆమెకు సకల మర్యాదలు చేయాలని, భోజనం ఏర్పాటు చేయాలని విమాన సిబ్బందిని ఆదేశించాడు. ఈ ఘటనపై సిబ్బంది ఫిర్యాదు చేయడంతో డీజీసీఏ తీవ్రంగా పరిగణించింది. ఆ పైలట్‌పై సస్పెన్షన్ విధించింది. తక్షణం చర్యలు తీసుకోలేకపోవడాన్ని తప్పుగా పరిగణించి ఎయిరిండియాకు రూ. 30 లక్షల వరకు జరిమానా విధించింది.