న్యూఢిల్లీ: విమానయాన చరిత్రలో అతిపెద్ద కొనుగోలు ఒప్పందం జరిగింది. ప్రముఖ విమాన తయారీ సంస్థ ఎయిర్‌బస్ నుంచి పెద్ద సంఖ్యలో విమానాల కొనుగోలుకు టాటాలకు చెందిన ఎయిరిండియా ఆర్డర్ పెట్టింది.40 వైడ్‌బాడీ విమానాలతో పాటుగా మొత్తం 250 విమానాలను ఎయిర్‌బస్‌నుంచి కొనుగోలు చేయనున్నట్లు టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ చెప్పారు. ఈ మేరకు మంగళవారం ఎయిర్‌బస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు చంద్రశేఖరన్ చెప్పారు. విమానాల కొనుగోలుకు సంబంధించి వర్చువల్‌గా నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మెక్రాన్, రతన్ టాటా, చంద్రశేఖరన్, కేంద్రమంత్రులు పీయూష్ గోయల్, జ్యోతిరాదిత్య సింధియా, ఎయిర్‌బస్ ప్రతినిధులు పాల్గొన్నారు.
250 విమానాల్లో 40 వైడ్‌బాడీ కలిగిన విమానాలను, మిగిలిన 210 నారో బాడీ విమానాలను కొనుగోలు చేస్తున్నట్లు చంద్రశేఖరన్ చెప్పారు. వైడ్‌బాడీ విమానాలను 16 గంటలకు పైగా ప్రయాణాలకు వినియోగించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ రంగానికి చెందిన ఎయిరిండియాను కొనుగోలు చేసిన టాటా సన్స్ మొత్తం 470 విమానాలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తాజాగా ఎయిర్‌బస్ నుంచి 250 విమానాలకు తాజాగా ఆర్డర్ పెట్టింది. మిగిలిన విమానాలను బోయింగ్‌నుంచి కొనుగోలు చేసే అవకాశం ఉంది.
కాగా 17 ఏళ్ల తర్వాత ఎయిరిండియా చేపట్టిన తొలి ఆర్డర్ కాగా ఎయిరిండియాను చేజిక్కించుకున్న టాటాగ్రూపు చేపట్టిన తొలి ఆర్డర్ కూడా ఇదే కావడం గమనార్హం. 17 ఏళ్ల క్రితం ఎయిరిండియా బోయింగ్‌నుంచి 68, ఎయిర్‌బస్‌నుంచి 43 విమానాలను కొనుగోలు చేసింది.
మన బంధం మరింత బలోపేతం: ప్రధాని మోడీ
ఎయిరిండియా ఎయిర్‌బస్ మధ్య కుదిరిన ఒప్పందంపై ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించారు. ఈ ఒప్పందం కారణంగా భారత్, ఫ్రాన్స్‌మధ్య వ్యూహాత్మక బంధం మరింత బలోపేతం అవుతుందన్నారు. పౌర విమానయాన రంగంలోమరింత వృద్ధి చెందాలన్న భారత్ ఆకాంక్షలను చేరుకోవడంలోనూ ఈ ఒప్పందం దోహదపడుతుందన్నారు. రాబోయే 15 ఏళ్లలో భారత్‌కు దాదాపు 2000 విమానాలు అవసరం ఉంటుందన్నారు. భారత్‌ఫ్రాన్స్ స్నేహపూర్వక బంధానికి ఈ ఒప్పందం మరో మైలురాయి అని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ అన్నారు.