Wednesday, November 6, 2024

మరిన్ని నగరాలకు ఎయిర్ ఇండియా విమాన సర్వీస్‌లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : అమెరికా లోని లాస్‌ఏంజెల్స్, బోస్టన్ నగరాలతోపాటు మరికొన్ని నగరాలకు తమ విమానసర్వీస్‌లను విస్తరింపచేయడానికి ఎయిర్ ఇండియా యోచిస్తోంది. ప్రస్తుతం అమెరికా లోని వాషింగ్టన్ డిసి, న్యూయార్క్, న్యూజెర్సీ, చికాగో, శాన్‌ఫ్రాన్సిస్కో నగరాలకు ఎయిర్ ఇండియా నాన్‌స్టాప్ సర్వీస్‌లు నడుస్తున్నాయి. అయితే కొత్త గమ్యస్థానాలుగా లాస్‌ఏంజెల్స్, బోస్టన్ వంటి నగరాలు మరికొన్నిటికి భారత్ నుంచి సుదూర నాన్‌స్టాప్ సర్వీసులను నడపడానికి సమీక్షిస్తున్నారు.

ఈమేరకు కొత్తగా సర్వీస్‌లు విస్తరించేముందు అనేక అంశాలను పరిగణన లోకి తీసుకోవాల్సి ఉంటుందని ఎయిర్ ఇండియా వర్గాలు పేర్కొన్నాయి. ఆయా రూట్లలో ప్రయాణికులు ఎంతమంది ప్రయాణిస్తారో, ఎంతమంది పైలట్లు కేబిన్ లోను, క్షేత్రస్థాయి లోను అవసరమవుతారో, ఎంతమందికి శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందో ప్రస్తుతం ఉన్న సిబ్బంది, పైలట్లు ఎందరో ఇవన్నీ పరిశీలించవలసి ఉంటుందని ఆయా వర్గాలు పేర్కొన్నాయి. భారతీయ సంతతికి చెందిన వారు భారీ సంఖ్యలో అమెరికాలో నివాసం ఉంటున్నారు. చాలా మంది అక్కడ పనిచేస్తున్నారు.

అలాగే అమెరికా యూనివర్శిటీల్లో చాలా మంది భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు. భారతీయులకు అమెరికా టూరిజం కేంద్రంగా కూడా ఆకర్షిస్తోంది. గత ఏడాది జనవరిలో టాటాగ్రూప్ అధీనం లోకి ఎయిర్ ఇండియా వచ్చింది. అప్పటినుంచి సంస్థను పునరుద్ధరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎయిర్‌బస్, బోయింగ్ నుంచి వివిధ రకాలైన 470 విమానాల కొనుగోలు చేస్తామని ఈమేరకు 80 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందం కుదిరిందని, ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎయిర్‌ఇండియా ప్రకటించింది. అయితే ఎయిర్‌బస్, బోయింగ్ నుంచి సరఫరా కానున్న 470 విమానాల సర్వీస్ కోసం 6500 మంది కన్నా ఎక్కువగా పైలట్లు అవసరమవుతారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News