‘రెక్క’ విప్పిన మహిళల రివొల్యుషన్
16వేల కి.మీ దూరం విమానాన్ని నడపనున్న పైలట్లు
న్యూఢిల్లీ : ఆకాశంలో సగభాగంగా ఘనత వహించిన మహిళలు తలచుకుంటే ఏదైనా చేయగలరు. ఎయిర్ ఇండియా మహిళా సిబ్బంది దాదాపు 17 గంటల పాటు 16 వేల కిలోమీటర్లు ప్రయాణించి రికార్డు సృష్టించనున్నారు. ఇది అత్యంత సాహసోపేత ప్రయాణం. శాన్‌ఫ్రానిస్కో నుంచి ఎక్కడా ఆగకుండా ఉత్తర ద్రువం మీదుగా అట్లాంటిక్‌ను దాటుకుంటూ బోయింగ్ 777 200 ఎటిఆర్ విమానంలో బెంగళూరు చేరుకోనున్నారు. ఈ 16 వేల కిమీ దూరం పూర్తిగా మహిళా సిబ్బంది తోనే కొనసాగుతుంది. సౌర వికిరణాలు, అల్లకల్లోలం వంటి అనేక అంశాలపై ఆధారపడిన ఈ ప్రయాణం ఎంతో సవాలుతో కూడుకున్నది. శాన్‌ఫ్రాన్సిస్కో, బెంగళూరు నగరాలు రెండూ ప్రపంచానికి రెండు చివర్లలో ఉంటాయి. వీటి మధ్య దూరం 13,993 కిమీ. ఆర్కిటిక్ మీదుగా ప్రయాణించడం వల్ల ఈ రెండు నగరాల మధ్య దూరం తగ్గుతుంది.
తాము ఉత్తరాన 82 డిగ్రీల వరకు వెళ్తామని, సాంకేతికంగా ద్రువం మీదుగా కాకుండా దాని పక్కనే ఉంటామని, ఆపై దక్షిణాన చాలావరకు రష్యా మీదుగా, ఇంకా కిందుగా బెంగళూరుకు వస్తామని విమానంలో ఉన్న నలుగురు మహిళా పైలట్లలో ఒకరు, కెప్టెన్ పాపగారి తన్మై వెల్లడించారు. ఫ్లైట్ సేఫ్టీ ఎయిర్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, కెప్టెన్ నివేదా భాసిస్, కూడా ఈ విమానంలో ప్రయాణిస్తున్నారు. అమెరికా కాలమానం ప్రకారం ఈ విమానం శనివారం రాత్రి 8.30 గంటలకు శాన్‌ఫ్రాన్సిస్కోలో బయలుదేరి సోమవారం తెల్లవారు జామున (భారత కాలమానం ప్రకారం)3.45 గంటలకు బెంగళూరు లోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగుతుంది. కెప్టెన్ జోయా అగర్వాల్, కెప్టెన్ పాపగారి తన్మయి, కెప్టెన్ ఆకాంక్ష సోనావర్, కెప్టెన్ శివానీ మనహ్యాన్ విమానాన్ని ఆపరేట్ చేస్తారని పౌర విమానయాన మంత్రి హరదీప్ సింగ్ పురి వెల్లడించారు. 238 సీట్ల సామర్థం కలిగిన ఈ బోయింగ్ విమానంలో 8 ఫస్ట్ క్లాస్, 35 బిజినెస్ క్లాస్, 195 ఎకనామిక్ క్లాస్ సీట్లు ఉన్నాయి. వీటితోపాటు నలుగురు కాక్‌పిట్ సిబ్బంది, 12 మంది క్యాబిన్ సిబ్బంది ఉంటారని ఎయిర్ ఇండియా వివరించింది.
Air India Women Pilots to Operate Flight