Monday, January 20, 2025

వాయు నాణ్యతలో మనదేశం అధోగతి

- Advertisement -
- Advertisement -

భారత్‌లో వాయు నాణ్యత ప్రమాదకరంగా తయారైంది. హరిత వాయు ఉద్గారాలు వేగంగా పెరుగుతున్నాయి. ఫలితంగా పర్యావరణ నిర్వహణలో 180 దేశాల జాబితాలో అట్టడుగున భారత్ ఉన్నట్టు అమెరికాకు చెందిన అధ్యయన సంస్థలు వెల్లడించాయి. యాలే సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ లా అండ్ పాలసీ , సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ఎర్త్‌సైన్స్ ఇన్‌ఫర్మేషన్ నెట్‌వర్క్ కొలంబియా యూనివర్శిటీ వెలువరించిన పర్యావరణ నిర్వహణ సూచికలో డెన్మార్క్ టాప్‌లో ఉండగా, తరువాతి స్థానాల్లో బ్రిటన్, ఫిన్‌లాండ్ ఉన్నాయి. గత కొన్నేళ్లుగా హరిత వాయు ఉద్గారాలను నిరోధించడం వల్లనే ఈ దేశాలు ఎక్కువ స్కోరు సాధించ గలిగాయి.

11 అంశాల వారీగా 40 పనితీరు సూచికలను ఉపయోగించి వాతావరణ మార్పు, పర్యావరణ ఆరోగ్యం, పర్యావరణ వ్యవస్థ జీవశక్తిలపై 180 దేశాల ర్యాంకులను నిర్దేశించారు. పర్యావరణ విధానపర లక్షాలకు ఆయా దేశాలు ఎంతవరకు చేరువలో ఉన్నాయో ఈ సూచిక తెలియజేస్తుంది. తక్కువ స్కోరులో ఉన్న దేశాల్లో భారత్ (18.9 ), మయన్మార్ ( 19.4),వియత్నాం ( 20.1) ,బంగ్లాదేశ్ ( 23.1 ), పాకిస్థాన్ (24.6 ) ర్యాంకుల్లో ఉన్నాయి. ఈ విధంగా దేశాలు తక్కువ స్కోరులో ఉండడానికి అవి ఆర్థిక సుస్థిరతకే ప్రాధాన్యం ఇచ్చాయి తప్ప పర్యావరణ నిర్వహణపై శ్రద్ధ చూపించడం లేదని తెలుస్తోంది. అంతేకాక ప్రజాందోళనలతో అస్థిరత్వం, ఇతర సంక్షోభాలు కూడా కారణంగా కనిపిస్తున్నాయని అధ్యయన సంస్థలు వెల్లడించాయి.

పర్యావరణ నిర్వహణ సూచికలో 28.4 స్కోరు సాధించిన చైనా 161 స్థానంలో నిలిచింది. కర్బన ఉద్గారాలను నియంత్రిస్తామని చైనా , భారత్ దేశాలు ఇటీవల ప్రపంచ పర్యావరణ సదస్సుల్లో హామీలు గుప్పించినప్పటికీ దానికి భిన్నంగా 2050 నాటికి ఈ రెండు దేశాలు రెండో భారీ ఉద్గారాల దేశాలుగా నిలుస్తాయని పరిశోధకులు ఆక్షేపిస్తున్నారు. సహచర దేశాల కన్నా వెనుకబడిన అమెరికా, పశ్చిమ ప్రపంచ దేశాల్లోని 22 సంపన్న దేశాల్లో 20 వ స్థానం లోనూ మొత్తం దేశాలన్నిటిలో 43 వ స్థానంలో నిలిచింది.

ట్రంప్ పాలనా కాలంలో పర్యావరణ అంచనాలను వెనక్కి తీసుకోవడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని అమెరికాను ఉద్దేశించి నివేదిక పేర్కొంది. డెన్మార్క్, బ్రిటన్ వంటి కొన్ని దేశాలు మాత్రమే 2050 నాటికి హరిత వాయువుల తటస్థీకరణ స్థాయికి చేరుకోగలుగుతాయని అంచనా వేసింది. ఇతర దేశాలు చాలావరకు తప్పుడు మార్గంలో వెళ్తున్నాయని, అందువల్లనే చైనా, భారత్ , రష్యా దేశాల్లో హరిత వాయు ఉద్గారాల వెల్లువ పెరిగిపోతోందని నివేదిక హెచ్చరించింది. ఈ జాబితాలో రష్యా 112 వ స్థానంలో ఉంది. ప్రస్తుత పరిణామాలు ఇలాగే కొనసాగితే 2050 నాటికి ప్రపంచం మొత్తం మీద వెలువడే హరితవాయు ఉద్గారాల్లో సగానికి సగం అంటే 50 శాతం వరకు చైనా, భారత్ , అమెరికా, రష్యా దేశాల నుంచే వెలువడే ప్రమాదం ఉందని నివేదిక హెచ్చరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News