Wednesday, January 22, 2025

ఢిల్లీలో ఎ.క్యు.ఐ.!

- Advertisement -
- Advertisement -

ఈ మధ్యన ఢిల్లీలో గాలి నాణ్యత సూచిక(ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎ.క్యు.ఐ) అధికంగా ఉందని, దీని కారణంగా ప్రజలు బయటకు రావడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారని చూస్తున్నాం. అసలు ఎ.క్యు.ఐ అంటే ఏమిటి? దీనిని ఎలా కొలుస్తారు? కారణాలు, పరిష్కారాలు గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎ.క్యు.ఐ అనేది గాలి నాణ్యత సూచిక. ఇది ఒక ప్రాంతం లో ప్రస్తుతం గాలి ఎంత కలుషితమై ఉందనే దానిని సూచిక విలువ తెలియజేస్తుంది. గాలి కాలుష్యం మన ఆరోగ్యంపై ఎంత మేర ప్రభావం చూపుతాయో ఈ సూచికల విలువుల బట్టి తెలుసుకోవచ్చు.గాలిలో ఉన్న ఎనిమిది ప్రధాన కాలుష్య కారకాల ఉద్గారాలను కొలవడం ద్వారా గాలి నాణ్యత సూచికను పొందవచ్చు. అవి పర్టిక్యులేట్ పదార్థం పి.యం 2.5, పి.యం 10 (పి.యం 2.5 అనేది 2.5 మైక్రాన్ల కంటే తక్కువ వ్యాసం కలిగిన, పి.యం 10 అనేది 10 మైక్రాన్ల కంటే తక్కువ వ్యాసం కలిగిన కణాల సాంద్రతను సూచిస్తుంది), ఓజోన్, కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, లెడ్, అమ్మోనియా ఉద్గారాలు.

వీటి రీడింగ్‌లు ప్రతి గంటకు గుర్తించబడతాయి.ప్రతి దేశం వాయు నాణ్యతా ప్రమాణాల ఆధారంగా వాయు నాణ్యత సూచికలనుకలిగి ఉంటుంది. పర్టిక్యులేట్ మేటర్ ( పి.యం) అనేది గణనీయమైన కాలుష్య కారకం. గాలిలో పి.యం 2.5, పి.యం 10లను కొలవడం ద్వారా గాలి నాణ్యతను తెలుసుకోవచ్చు. ఇది క్యూబిక్ మీటరుకు మైక్రోగ్రాములలో కణాలను కొలుస్తుంది. ఇది గాలిలో ఉండే ఘన కణాలు, ద్రవ బిందువుల మిశ్రమం.ధూళి, పొగ, మసి వంటి కొన్ని కణాలు మన కళ్ళకు కనిపిస్తాయి. మరికొన్ని ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా మాత్రమే కనిపిస్తాయి. పవర్ ప్లాంట్లు, పరిశ్రమలు, ఆటోమొబైల్స్ మొదలైన వాటి ద్వారా విడుదలయ్యే కాలుష్య కారకాలు గాలిలో సంక్లిష్ట రసాయన ప్రతిచర్యలను ఏర్పరుస్తాయి, తద్వారా రేణువులు ఉత్పత్తి అవుతాయి.వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు 1981లో వాయు (కాలుష్య నివారణ, నియంత్రణ)చట్టం ఆమోదించబడింది. నిబంధనలను సరిగా అమలు చేయకపోవడం వల్ల కాలుష్యాన్ని తగ్గించడంలో ఈ చట్టం విఫలమైంది. స్వచ్ఛ భారత్ మిషన్ కింద భారత దేశ వాయు నాణ్యత సూచికను కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ పొల్యూషన్ కంట్రో ల్ బోర్డు వైద్య నిపుణులు, ఎయిర్ క్వాలిటీ నిపుణులు, విద్యావేత్తలు, అడ్వకేసీ గ్రూపులు, ప్రత్యేక నిపుణులతో బృందాన్ని ఏర్పాటు చేసింది.

దీనికి ఐ.ఐ.టి కాన్పూర్ సాంకేతిక అధ్యయనాన్ని అందించింది. 2014 సం.లో ఐ.ఐ.టి కాన్పూర్, నిపుణుల బృందం భారత దేశానికి ఎ.క్యూ.ఐ పథకాన్ని సిఫార్సు చేసింది. 2015 సం.లో భారత ప్రభుత్వం ఐ.ఐ.టి కాన్పూర్‌తో కలిసి నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌ను ప్రారంభించింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డులు దేశంలోని 240 నగరాలను కవర్ చేస్తూ నేషనల్ ఎయిర్ మానిటరింగ్ ప్రోగ్రామ్(జాతీయ వాయు నాణ్యత పర్యవేక్షణ కార్యక్రమం)ని నిర్వహిస్తున్నాయి. ఈ నెట్‌వర్క్ దేశంలోని 25 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాలలో 115 నగరాలు, పట్టణాలు కవర్ చేసే 308 ఆపరేటింగ్ స్టేషన్‌లను కలిగి ఉంది. ఇవి నిజ-సమయ ప్రాతిపదికన (రియల్ టైమ్) డేటాను అందించే నిరంతర పర్యవేక్షణ వ్యవస్థలు కూడా కలిగి ఉన్నాయి. 2017 సం.ని బేస్ ఇయర్‌గా తీసుకొని 2024 సం. నాటికి పి.యం 2.5 పి.యం10 సాంద్రతలలో 20%-30% తగ్గించే తాత్కాలిక జాతీయ లక్ష్యంతో ‘ది నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్’ను కేంద్రం ప్రారంభించింది.

నేషనల్ యాంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండరడ్స్ కంటే అధ్వానంగా గాలి నాణ్యతను కలిగి ఉన్న 102 నగరాల్లో ఇది అమలు చేయబడింది. డిసెంబర్ 2019 సం.లో ఐ.ఐ.టి బాంబే, సెయింట్లూయిస్‌లోని వాషింగ్టన్ యూనివర్శిటీకి చెందిన మెక్‌కెల్వీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ భాగస్వామ్యంతో భారత దేశంలో వాయు కాలుష్యాన్ని అధ్యయనం చేయడానికి ఏరోసోల్, ఎయిర్ క్వాలిటీ రీసెర్చ్ ఫెసిలిటీని ప్రారంభించింది. గాలి నాణ్యత మానిటర్లు నిర్దిష్ట కాలుష్య కారకాలను గుర్తించేందుకు రూపొందించబడిన సెన్సార్‌లతో అమర్చబడి ఉంటాయి. లేజర్‌లను లేదా శాటిలైట్ ఇమేజింగ్‌లను ఉపయోగిస్తూ క్యూబిక్ మీటర్ గాలిలో నలుసు పదార్థాల సాంద్రతను గణిస్తారు. వాయు నాణ్యత డేటా బ్యాంకులు సమగ్ర ఎ.క్యు.ఐ రీడింగ్‌ను నమోదు చేయడానికి ప్రభుత్వ క్రౌడ్-సోరస్డ్, శాటిలైట్-డెరైవ్డ్ ఎయిర్ క్వాలిటీ మానిటర్‌ల నుండి రీడింగ్‌లను ప్రాసెస్ చేస్తాయి. ఈ డేటాబేస్‌లు విశ్వసనీయత, కొలిచిన కాలుష్య రకం ఆధారంగా డేటాను విభిన్నంగా అంచనా వేస్తాయి. ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం ఐ.క్యు ఎయిర్ సహకారంతో 2021లో మొట్టమొదటి నిజ- సమయ వాయు కాలుష్య ఎక్స్‌పోజర్కా లిక్యులేటర్‌ను అభివృద్ధి చేసింది.

ఇది 117 దేశాల భూభాగాలు, 6,475 స్థానాల్లో ధ్రువీకరించబడిన గాలి నాణ్యత మానిటర్‌ల నుండి గ్లోబల్ రీడింగ్‌లను మిళితం చేసింది. ఈ డేటా బేస్ పి.యం 2.5 రీడింగ్‌లకు ప్రాధాన్యత ఇస్తూ ప్రతి దేశ జనాభా వాయు కాలుష్యానికి గురికావడాన్ని గంట ప్రాతిపదికన లెక్కించడానికి కృత్రిమ మేధస్సును వర్తింపజేస్తుంది. వాయు కాలుష్య కారకాల ఉద్గారాల పెరుగుదల, భారీ ట్రాఫిక్ లేదా అటవీ అగ్ని సమయంలో కారణంగా ఎ.క్యూ.ఐ పెరుగుతుంది.యాంటీసైక్లోన్ లేదా ఉష్ణోగ్రత విలోమం కారణంగా గాలి స్తబ్దత, గాలిలో కాలుష్య కారకాల అధిక సాంద్రతలకు దారితీస్తుంది. ఇది వాయు కాలుష్య కారకాలు, మబ్బుగా ఉన్న పరిస్థితుల మధ్య రసాయన ప్రతి చర్యలకు కలుగజేస్తుంది. తద్వారా ఎ.క్యూ.ఐ పెరుగుతుంది. ఇంధన చెక్క ముక్కలు, ఎండుగడ్డి, ఆకులు, పశువుల పేడ తడి మిశ్రమం నుండి తయా రు చేయబడే వంట ఇంధనాలు, గోధుమలను నాటడానికి భూమిని త్వరగా సిద్ధం చేయడానికి పంట కోత తర్వాత అవశేషాలను కాల్చడం, బయో మాస్ బర్నింగ్, చుల్హాస్ వాడకం, టైర్ పైరోలిసిస్ ప్లాంట్లు, ఇంధన కల్తీ, ట్రాఫిక్ రద్దీ వంటి వాటి వలన వెలువడే కాలుష్య కారకాలు గాలి నాణ్యతను దెబ్బ తీస్తున్నాయి.

వ్యక్తిగత వాహనాల వినియోగం తగ్గించుకోవాలి. ప్లాస్టిక్, సింథటిక్ వస్తువులను నిషేధించాలి. విరివిగా చెట్లు నాటా లి. కాగితాల నుండి డిజిటల్కి మారాలి. పర్టిక్యులేట్ మాటర్ ఎక్కువగా ఉండే ఎయిర్ ఫ్రేషనరులు, డియూడరెంట్లు వాడకం తగ్గించాలి. గ్యాసోలిన్ యంత్రం వాడకాన్ని పరిమితం చేయాలి. క్రమం తప్పకుండా ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థలను తనిఖీ చేయించుకోవాలి. ఎనర్జీ స్టార్ సర్టిఫికేట్ పొందిన ఎలక్ట్రానిక్ ఉపకరణాలను ఎంచుకోవాలి. కాలుష్య కారకాల ఉత్పత్తులను తగ్గించుకోవాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News