Sunday, December 22, 2024

కాటేస్తున్న వాయు కాలుష్యం

- Advertisement -
- Advertisement -

పీల్చే గాలి, తాగే నీరు, ఆధారాన్నిచ్చే నేల కాలుష్య కాసారాలుగా మారి మనిషి ఉసురు తీస్తున్నాయి.కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా స్వార్థప్రయోజనాల సాధనే పరమావధిగా తమ చుట్టూ ఉన్న వాతావరణాన్ని మనుషులు కలుషితమయం చేసుకుంటున్నారు. అత్యంత జనాభాతో కిటకిటలాడే చైనా, ఇండియా వంటి దేశాలు కాలుష్యం కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నాయి. వాయు కాలుష్యం పెరిగిపోయిన కారణంగా ఉక్కిరిబిక్కిరవుతున్న దేశ రాజధాని ఢిల్లీవాసుల అవస్థల గురించి అడపాదడపా వార్తాప్రచార, ప్రసార సాధనాలు చెబుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాయు కాలుష్యం ఏ విధంగా ప్రాణాలు కబళిస్తోందో కళ్లకుకడుతూ వెలువడిన ఓ నివేదిక వెన్నులో వణుకు పుట్టించేదిగా ఉంది.దేశంలో వాయు కాలుష్యం తీవ్రతపై ప్రముఖ అధ్యయన సంస్థ లాన్సెట్ తాజాగా జరిపిన ఓ పరిశోధనలో దేశంలోని పది నగరాల్లో సంభవిస్తున్న రోజువారీ మరణాల్లో ఏడు శాతం వాయు కాలుష్యం వల్లేనని కుండబద్దలు కొట్టింది.

ఈ జాబితాలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కూడా ఉండటం గమనార్హం. ఈ నగరాల్లో పిఎం 2.5 కాలుష్య రేణువుల స్థాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రామాణిక పరిమితులను మించిపోయాయట. దేశ రాజధాని ఢిల్లీలో ఏటా సగటున 11.5 మరణాలకు, హైదరాబాద్‌లో 5.6 శాతం మరణాలకు కారణం వాయు కాలుష్యమేనంటే మనం పీల్చే గాలి ఎంతగా కలుషితమైపోయిందో విశదమవుతుంది. భారత దేశంలో ఏటా 33 వేలమంది మరణానికి వాయు కాలుష్యమే కారణమంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఆలోచించవచ్చు. శిలాజ ఇంధనాల దహనం, పరిశ్రమలు, వాహనాల ఉద్గారాలు.. గాలి కలుషితమవడానికి ప్రధాన కారణాలు. తక్కువ వేగంతో వీచే గాలుల కారణంగా కాలుష్య కణాలు దిగువ వాతావరణ పొరల్లో నిలిచి, మనిషి శ్వాసించినప్పుడు ఊపిరితిత్తులలోకిచేరి, అస్వస్థతకు దారితీస్తాయి. ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఒక ఘనపు మీటరుకు 15 మైక్రో గ్రాముల పిఎం 2.5లోపు ఉంటే అక్కడి గాలి సురక్షితంగా ఉన్నట్లు లెక్క. కానీ మన దేశంలోని అనేక నగరాల్లో కాలుష్యం స్థాయులు ఈ పరిమితికి మించి ఉన్నట్లు తేలింది. ఊపిరితిత్తుల వ్యాధులతో పాటు వాయు కాలుష్యం టైప్ 2 డయాబెటిస్‌కు కారణమవుతోందని ఓ అధ్యయనంలో తేలితే, డిప్రెషన్ కు దారితీసి, ఆత్మహత్యలను ప్రేరేపించే ఆలోచనలు పెరగడానికి కూడా ఈ వాయు కాలుష్యమే కారణమని మరో సర్వే తేల్చి చెప్పింది. ఏతావాతా కాలుష్యం మనిషిపై ముప్పేట దాడి చేసి, ప్రాణాలు కబళిస్తున్నట్లు అర్థమవుతూనే ఉంది. దీనిని ఎదుర్కోవడమెలా అనే విషయమే ఇప్పుడు ఆలోచించవలసిన విషయం. వాయు కాలుష్యాన్ని అరికట్టడంలో బీజింగ్‌ను ఆదర్శంగా తీసుకోవచ్చు.

ఢిల్లీకి మించిన వాయు కాలుష్యంతో చైనా రాజధాని వాసులు సతమతమయ్యేవారు. బొగ్గు ఆధారిత ప్రాజెక్టులను నిషేధించడం ద్వారా, మెరుగైన ఇంధన వాడకాన్ని ప్రోత్సహించడం ద్వారా, వాహన కాలుష్యాన్ని అదుపు చేయడం ద్వారా అక్కడ చాలా వరకూ వాయు కాలుష్యానికి కళ్లెం వేయగలిగారు. పైగా ఒక్క బీజింగ్ నగరానికే పరిమితం కాకుండా, చుట్టు పక్కల ప్రాంతాల్లోనూ ఇలాంటి చర్యలు చేపట్టడం ద్వారానే బీజింగ్ ఇప్పుడు కాస్తయినా ఊపిరి పీల్చుకోగలుగుతోంది. ఢిల్లీలో వాయు కాలుష్యానికి కేవలం ఆ నగరంలో వెలువడే ఉద్గారాలే కారణం కాదు. పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా, రాజస్థాన్ వంటి రాష్ట్రాలలో పంట వ్యర్థాలను తగులపెట్టడం ఢిల్లీ అనర్థాలకు ప్రధాన కారణం. తెలుగు రాష్ట్రాలలో పంట కోశాక పొలంలో మిగిలిన వ్యర్థాలను పశుగ్రాసంగా వినియోగిస్తారు. కానీ ఉత్తరాది రాష్ట్రాలలో పంట వ్యర్థాలను తగులబెడతారు.

దీనివల్ల కార్బన్ డైయాక్సైడ్ గాలిలో కలిసి, వాయు కాలుష్యానికి దోహదం చేస్తోంది. ఈ సమస్యకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికీ ఓ ఉమ్మడి పరిష్కారాన్ని కనుగొనడంలో విఫలమైన కారణంగానే చీటికీ మాటికీ ఢిల్లీ వాయు కాలుష్యం కోరలకు చిక్కి విలవిల్లాడుతోంది. ప్రస్తుతం ఢిల్లీ ఎదుర్కొంటున్న సమస్య ఇతర భారతీయ నగరాలకు విస్తరించే ప్రమాదం ఎంతో దూరంలో లేదు. ఈ బెడద చినికి చినికి గాలివానగా మారకముందే పాలకులు మేల్కొని, కాలుష్యంపై విధానపరమైన నిర్ణయం తీసుకోవడం అత్యంత ఆవశ్యకం. చేతులు కాలాక ఆకులు పట్టుకునే ధోరణికి మన పాలకులు ఇకనైనా స్వస్తి పలికి, కార్యాచరణకు ఉపక్రమించాలి. లేదంటే అంగట్లో ఆక్సిజన్ కొనుక్కుని, మాస్కులు పెట్టుకుని తిరగవలసిన దుస్థితి ఎంతో దూరంలో లేదంటే అతిశయోక్తి లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News