Tuesday, January 28, 2025

కాలుష్యం కాటు

- Advertisement -
- Advertisement -

ఒక్కసారిగా పడిపోయిన గాలి
నాణ్యత కూకట్‌పల్లి,
మూసాపేట, బాలానగర్,
నాంపల్లి, మెహిదీపట్నంలో
ప్రమాదకరస్థాయి ఢిల్లీకి
చేరువగా గాలి కాలుష్యం
నమోదు అధిక తీవ్రత ఉన్న
నగరాల్లో హైదరాబాద్‌కు 6వ
స్థానం కాలుష్యం తీవ్రతను
తగ్గించేలా ప్రభుత్వం అడుగులు
ఈవీలకు ప్రోత్సాహం

మన తెలంగాణ / హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోవడంతో తె లుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యా యి. కాలుష్య కోర్లలో చిక్కుకోకుండా కసరత్తు ప్రారంభించాయి. వాతావరణంలో అనూహ్య మార్పులతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వా లు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఆ యువు పోస్తున్న వాయువు స్వచ్ఛత కోసం ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నాయి. ఢిల్లీలో రోజురోజు కి వాయు నాణ్యత క్షీణిస్తుండటంతో ప్రజలు తీ వ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి పరిస్థితులు ఇక్కడ రాకముందే మేలుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. హైదరాబాద్ లోనూ వా యు కాలుష్యం పెరుగుతోంది. గాలి నాణ్యత ప్ర మాదకర స్థాయిలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

గత వారంతో పోలిస్తే
వాహనాల సంఖ్య పెరగడం, జనవాసాల్లోకి పారిశ్రామిక కేంద్రాలు రావడంతో పొల్యూషన్ ఒక్కసారిగా పెరిగింది. హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత ఇండెక్స్ ప్రమాదకర స్థాయికి చేరింది. అత్యధికంగా సనత్ నగర్ లో 225 ఏక్యూ గా నమోదైంది. బొల్లారంలో 121, పటాన్ చెరులో 168, జూపార్క్ ఏరియాలో 166గా నమోదైంది. ఇక ఉదయం 7 గంటల సమయంలో సనత్ నగర్ లో 185, సికింద్రాబాద్ యూఎస్ కాన్సులేట్‌లో 183, బహదూర్ పుర 163, పాశమైలారం 166, పటాన్ చెరులో 165గా ఏక్యూఐ నమోదైంది. హైదరాబాద్‌లో రోజురోజుకూ వాయు నాణ్యత క్షీణిస్తోంది. ఢిల్లీకి సరి సమానంగా గాలి కాలుష్యం నమోదవుతోంది. చిన్నారులకు, వయో వృద్ధులు, శ్వాస కోశ వ్యాధులు ఉన్న వారికి ఇబ్బందికరంగా హైదారాబాద్ వాతావరణం మారింది. పరిస్థితి చేజారక ముందే సమస్య పై జీహెచ్‌ఎంసీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కూకట్ పల్లి, మూసాపేట్, బాలా నగర్ నాంపల్లి, మెహదీపట్నంలో ప్రమాదకర స్థాయిలో గాలి కాలుష్యం పెరిగింది. ఆదివారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 300 దాటింది. హైదరాబాద్ నగరంలో కాలుష్యం కారణంగా గత దశాబ్దకాలంలో 6 వేల మందికి పైగా మరణించినట్టు నివేదికలు చెబుతున్నాయి. లాన్సెట్ ప్లానెట్ హెల్త్ సంస్థ రిపోర్ట్ ప్రకారం హైదరాబాద్‌లో ఒక్క 2023 లోనే వాయు కాలుష్యం వల్ల 1,597 మంది మరణించారు. వాయు కాలుష్యం అధికంగా ఉన్న టాప్-10 నగరాల్లో హైదరాబాద్ ఆరో స్థానంలో ఉంది. ఢిల్లీ మొదటి స్థానంలో ఉండగా 2వ స్థానంలో ముంబై, మూడో స్థానంలో బెంగళూరు, 4వ స్థానంలో పూణె, ఐదో స్థానం చెన్నై నగరాలు ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో డీజిల్ ఆటోలు నిబంధనలకు విరుద్ధంగా శివార్లలో తిప్పుతుండటంతో విపరీతంగా కాలుష్యం నమోదవుతుంది. గాలిలో సూక్ష్మధూళి కణాలు పెరిగి, వాయు నాణ్యత క్షీణిస్తోంది. డీజిల్ ఆటోలకు బదులు ఎల్పీజీ, సీఎన్జీలు వాడాలని 15 ఏళ్ల కిందటే తెలిపారు. నగరంలో 95 శాతం సీఎన్జీ లేదా ఎల్పీజీ ఆటోలు నడుస్తుండగా శివార్లలో మాత్రం భిన్నమైన పరిస్థితి నెలకొంది.

డీజిల్ ఆటోలకు బదులుగా సీఎన్జీ, పీఎన్జీ ఉపయోగించడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. ఆర్టీసీ సైతం డీజిల్ బస్సులను పక్కనపెడుతూ ఎలక్ట్రిక్ వాహనాల వైపు అడుగులేస్తోంది. వాహన దారులు సైతం ఇదే మార్గం అనుసరిస్తే ఢిల్లీ తరహా ఇబ్బందులు ఉండవని నిపుణులు సూచిస్తున్నారు. హైదరాబాద్‌లో ఒక్కసారిగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పడిపోయింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ డేటా ప్రకారం కొంపల్లిలో పర్టిక్యులేట్ మ్యాటర్ 2.5 స్థాయి దాటింది. ఈ స్థాయికి వస్తే అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. సూక్ష్మ కణాలు ఊపిరితిత్తులలోకి చొచ్చుకుపోయి తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు వస్తాయని అంటున్నారు. అటు సోమాజిగూడలోను ఇదే పరిస్థితి ఉందని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు స్పష్టం చేసింది. గచ్చిబౌలి, కోకాపేట్, సనత్‌నగర్‌లోనూ ప్రమాదకర స్థాయిలో పొల్యూషన్ అయినట్టు వెల్లడించింది. వాయు కాలుష్య పెరుగుదలకు బాణసంచా ప్రధాన కారణం అయినప్పటికీ.. కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్‌తో సహా ఇతర కాలుష్య కారకాలు వాతావరణాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఇవి గాలి నాణ్యతపై ప్రభావం చూపుతున్నాయి. ప్రజారోగ్యానికి ముప్పు కలిగిస్తూనే ఉన్నాయి. నవంబర్ 1న హైదరాబాద్‌లో గాలి నాణ్యత 171గా నమోదైంది. ఇది తీవ్రస్థాయి కాలుష్యమని నిపుణులు చెబుతున్నారు. మలక్‌పేట్‌లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌లో 335గా నమోదైంది.

దీపావళి టపాసుల వల్ల ఏమేర వాయు కాలుష్యం జరిగిందో దీన్నిబట్టి అర్థం అవుతోంది. వాయు కాలుష్యం కారణంగా దీర్ఘకాలిక రోగులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా గుండె, శ్వాసకోశ, మూత్రపిండాలు, కాలేయం, ఇతర దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్న వారిపై వాయు కాలుష్యం తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు. హైదరాబాద్ లో రానున్న రోజుల్లో వాయు కాలుష్యం మరింత పెరిగే ప్రమాదం ఉన్నట్లుగా నిపుణులు హెచ్చరిస్తున్నారు. నగరంలోని 10 ప్రాంతాలకు సంబంధించి చూసుకుంటే.. సనత్ నగర్ లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రతిరోజు 225గా నమోదవుతోంది. ఇప్పటికే దేశ రాజధానిలో వాయు నాణ్యత రోజురోజుకి క్షీణిస్తున్న పరిస్థితుల్లో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు భయపడే పరిస్థితి ఉంది.

నగరంలో పడిపోతున్న వాయునాణ్యత : హైదరాబాద్ నగరంలో వాయునాణ్యత క్రమంగా పడిపోతోంది. దీపావళి పండుగ నాటి టపాసుల కాలుష్యానికి, పొగ మంచు తోడవడంతో 10 రోజులుగా అనేకచోట్ల వాయు నాణ్యత సూచీ 100కి పైగా నమోదు కాగా కాప్రాలో అత్యధికంగా 214గా నమోదైంది. సీపీసీబీ నిర్దేశిత పరిమితుల ప్రకారం వాయునాణ్యత సూచీ సున్నా నుంచి 100 మధ్య నమోదైతే అంతా బాగా ఉన్నట్లు. 101 నుంచి 200 మధ్య నమోదయ్యే చోట దీర్ఘకాలంలో ఆస్తమా, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల సమస్యలు ఉండే వారికి ఇబ్బందులు వస్తాయి. 201 నుంచి 300 మధ్య నమోదైతే ఆరోగ్యవంతులకు దీర్ఘకాలంలో శ్వాసపరమైన ఇబ్బందులు వస్తాయి. సీపీసీబీ సమీర్‌యాప్‌లో వెల్లడించిన వివరాల ప్రకారం నవంబరు 2న ఈసీఐఎల్ కాప్రాలో వాయునాణ్యత సూచీ 214గా నమోదు అయింది. పది రోజుల్లోనే 151 నుంచి 214 నమోదవడం గమనార్హం. ఇక్కడ పీఎం 10 స్థాయిలు అధికంగా ఉన్నాయని వెల్లడించింది.

కోకాపేటలో నిర్మాణ కార్యకలాపాలు అధికంగా ఉండడంతో ఎక్కువగా కాలుష్యం నమోదవుతోంది. పీఎం 10 సూక్ష్మ ధూళి కణాల స్థాయి పెరుగుతోంది. నవంబరు మొదటి వారం నుంచి వాయు నాణ్యత 100కి పైగా నమోదవుతుంది. ఈ నెల 1 నుంచి 10 వరకు ఇక్కడ 102 నుంచి 153 మధ్య వాయునాణ్యత సూచీ నమోదవుతుంది. జూపార్కు ప్రాంతంలోనూ పీఎం 10 సూక్ష్మధూళి కణాలస్థాయి పెరిగిపోతుంది. నవంబరు 1న ఇక్కడ వాయునాణ్యత సూచీ 150గా నమోదైంది. అనంతరం వరసగా 131-142గా నమోదైంది. న్యూమలక్‌పేట్, కొంపల్లి, నాచారంలో నవంబరు 1న సూచీ 120 -186 మధ్య నమోదవగా మిగిలిన రోజుల్లో సంతృప్తికర స్థాయిలో ఉన్నట్లు సీపీసీబీ వెల్లడించింది. సనత్‌నగర్‌లో వాయునాణ్యత పడిపోతోంది. మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

కాలుష్య తీవ్రతను తగ్గించేలా అడుగులు : హైదరాబాద్ లో వాహనాల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. దీంతో నగరంలోనూ వాయు నాణ్యత క్షీణిస్తోంది. గత పదేళ్లతో పోల్చుకుంటే గడిచిన రెండేళ్లుగా హైదరాబాద్ నగరం కూడా ప్రమాద ఘంటికలు మోగించే అవకాశం ఉన్నట్లుగా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లోనూ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. రానున్న రోజుల్లో కాలుష్య తీవ్రతను తగ్గించేలా అడుగులు వేస్తోంది. కర్బన ఉద్గారాల సంఖ్య తగ్గించేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఈవీలను (ఎలక్ట్రిక్ వెహికల్స్) ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.

ఘాటు వాసనలపై నిఘా : పరిశ్రమల నుంచి వెలువడే ఘాటు వాసనలతో హైదరాబాద్‌వాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ నేపథ్యంలో వీటి కట్టడికి పీసీబీ కసరత్తు ప్రారంభించింది. హైదరాబాద్‌లోని పరిశ్రమలపై నిఘా పెట్టేందుకు ఎన్విరాన్‌మెంట్ ఇంజినీర్, అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంట్ ఇంజినీర్, అనలిస్ట్‌తో కూడిన ఐదు బృందాలను ఏర్పాటు చేసింది. ఈ బృందాలు నిత్యం పారిశ్రామిక వాడల్లో కార్యకలాపాలను పరిశీలిస్తాయి. కాలుష్యం, వ్యర్థాల డంపింగ్, ఘాటు వాసనలకు చెందిన ఫిర్యాదులకు 10741 నంబరుకు కాల్ చేయాలి. ttps://tspcb.cgg.gov.in వెబ్‌సైట్‌లోనూ ఫిర్యాదు చేయొచ్చు. అధికారిక వెబ్ సైట్‌లోని ‘జనవాణి-కాలుష్య నివారిణి’లో సైతం ఆధారాలతో ఫిర్యాదు చేయవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News