Wednesday, January 22, 2025

టపాసుల మోత.. ఢిల్లీలో మళ్లీ పెరిగిన వాయు కాలుష్యం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో దీపావళి తర్వాత మళ్లీ కాలుష్యం పెరిగింది. సుప్రీం కోర్టు నిషేధాన్ని కూడా పక్కన పెట్టి ఢిల్లీ వాసులు టపాసుల మోత మోగించారు. దీంతో సోమవారం ఉదయం రాజధాని, దాని పరిసర ప్రాంతాలను కాలుష్య పొగ కమ్మేసింది. గత వారాంతంలో ఢిల్లీలో మోస్తరు వర్షాలు కురవడంతో వాయు నాణ్యత (ఎక్యు) సూచీ కాస్త మెరుగుపడింది. ఆదివారం సాయంత్రం వరకు ఎక్యూఐ 218 గానే నమోదైంది.

కానీ ఆ తర్వాత దీపావళి పండగ సందర్భంగా ఢిల్లీ వాసులు బాణాసంచా పేల్చారు. కాలుష్య పరిస్థితుల దృష్టా ఢిల్లీలో టపాసుల వినియోగంపై సుప్రీం కోర్టు పూర్తి నిషేధం విధించినప్పటికీ, చాలా చోట్ల అర్ధరాత్రి వరకు బాణాసంచా మోత మోగింది. దీంతో సోమవారం ఉదయానికి ఢిల్లీలో గాలి నాణ్యత మళ్లీ క్షీణించింది. పలు ప్రాంతాల్లో విషపూరిత పొగ మంచు కమ్మేయడంతో వాహనదారులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. సోమవారం ఉదయం చాలా చోట్ల ఏక్యూఐ సూచీ 500 దాటగా, లజ్‌పత్‌నగర్‌లో వాయునాణ్యత సూచీ ఏకంగా 959 కి పడిపోయింది.

జవహర్‌లాల్ నెహ్రూ నగర్‌లో 910, కరోల్ బాఘ్‌లో 779గా ఉంది. ఊపిరితిత్తులను పాడుచేసే అతిసూక్ష్మధూళికణాలుగా పేర్కొనే పీఎం 2.5 కణాల సాంద్రత 24 గంటల్లోనే 140 శాతం పెరిగింది. ఆదివారం ఉదయానికి ఈ సాంద్రత సగటున క్యూబిక్ మీటర్‌కు 83.5 గా ఉండగా, సోమవారం ఉదయానికి అది 200.8కి చేరిందని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు గణాంకాలు వెల్లడించాయి. ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్ తదితర ప్రాంతాల్లో ప్రజలు నిన్న రాత్రి విపరీతంగా బాణాసంచా పేల్చడమే ఈ పరిస్థితికి కారణమైందని పలువురు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిషేధాన్ని అమలు చేయడంలో ఢిల్లీ అధికారులు విఫలమయ్యారని దుయ్యబడుతున్నారు.

పార్టీల పరస్పర విమర్శలు
ఢిల్లీ కాలుష్యం రాజకీయ విమర్శలకు దారి తీసింది. ఆప్, బీజేపీ ఒకదానిపై మరొకటి ఆరోపణలు చేసుకున్నాయి. గాలి కాలుష్యం తీవ్రంగా ఉన్నవేళ ప్రజలు టపాసులు కాల్చేలా బీజేపీ నేతలు రెచ్చగొట్టారని ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ ఆరోపించారు. కొన్ని ప్రాంతాల్లో ఉద్దేశ పూర్వకంగా టపాసులు కాల్చడం కనిపించింది. గాలి నాణ్యత దిగజారిపోకూడదని ఢిల్లీ ప్రజలు కోరుకున్నారు. కానీ ప్రజలు టపాసులు కాల్చేలా బీజేపీ రెచ్చగొట్టింది. ఇప్పుడు ఆ పార్టీ నేతల ప్రవర్తనకు ఢిల్లీ మూల్యం చెల్లిస్తోంది.

టపాసులు కాల్చక పోయుంటు ఢిల్లీ వాతావరణం శుభ్రంగా ఉండేది” అని ఆప్ నేత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆప్ విమర్శలను బీజేపీ ఖండించింది. ‘ప్రజలు తక్కువ మోతాదు ధ్వని ఉన్న టపాసులు మాత్రమే పేల్చారు. ప్రజలు దీపావళి జరుపుకోవడం పట్ల కాంగ్రెస్‌తో సహా కొన్ని పార్టీలకు ఇబ్బందిగా ఉంది. రెండు రోజుల క్రితం నగరంలో వర్షం కురిసింది. వర్షానికి ముందు వరకు వాయునాణ్యత సూచీ ఎంతుంది? ఇప్పుడు ఎంతకు చేరింది? అని విమర్శలను తోసి పుచ్చింది. కొద్ది రోజుల క్రితంతో పోల్చుకుంటే ఏక్యూఐ మెరుగ్గానే ఉన్నట్టు చెప్పింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News