గ్లోబల్ లాన్సెట్ కౌంట్‌డౌన్ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ : వాయు కాలుష్యంతో దేశంలో 2019లో 9,07,000 మంది మృతి చెందినట్టు గ్లోబల్ లాన్సెట్ కౌంట్‌డౌన్ రిపోర్ట్ 2021 వెల్లడించింది. ‘వాతావరణ మార్పుప్రపంచ ఆరోగ్యభద్రతకు ముప్పు ’ పేరుతో లాన్సెట్, ఐసిఎంఆర్, ఎన్‌ఐఐఆర్‌ఎన్‌సిడి (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇంప్లిమెంటేషన్ రీసెర్చి ఆన్ నాన్‌కమ్యూకబుల్ డిసీజెస్ ) శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఈ నివేదికను రూపొందించారు. 2015 తో పోలిస్తే దేశంలో కాలుష్య కారక మరణాలు 2019 నాటికి 8 శాతం పెరిగినట్టు నివేదిక వెల్లడించింది. బొగ్గు కాలుష్యం వల్లే దాదాపు 1.57 లక్షల మంది చనిపోయారు.
ఇందులో థర్మల్ విద్యుత్ ప్లాంట్లతోపాటు పరిశ్రమలు, ఇళ్లలో వినియోగించే బొగ్గు ద్వారా వెలువడే కాలుష్యం కూడా ఉంది. వాయు కాలుష్యానికి ప్రధాన కారణమైన సూక్ష్మధూళి రేణువులు పీఎం 2.5 , అంతకంటే తక్కువ స్థాయిలో ఉండే రేణువులు ఊపిరితిత్తులను దాటుకుని రక్తంలోకి ప్రవేశిస్తున్నాయి. నిర్మాణ పనులు, కూల్చివేతలు, మైనింగ్ కార్యకలాపాలు, వ్యవసాయం, పరిశ్రమలు, విద్యుత్ కేంద్రాల్లో శిలాజ ఇంథనం మండించడం, డీజిల్, పెట్రోల్ వాహనాలు కాలుష్యానికి ప్రధాన కారణమౌతున్నాయి.
దీర్ఘకాలం ఈ కాలుష్యంలో ఉండే పిల్లల్లో ఆస్తమా, పెద్దల్లో ఊపిరితిత్తుల పనితీరుపై ప్రభావం చూపుతుంది. పెద్దల్లో క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజెస్ (సిఓపీడీ) ముప్పు పెరిగి, గుండె సంబంధ వ్యాధులు, గుండెపోటు ,ఊపిరితిత్తుల కేన్సర్లలతో మరణం సంభవించే ప్రమాదం ఉంది. పుట్టబోయే పిల్లల పైనా ప్రభావం పడుతుందని నివేదిక వెల్లడించింది. థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి వెలువడే ధూళి రేణువులను నియంత్రించే సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని, విద్యుత్ ఉత్పత్తికి బొగ్గు వినియోగాన్ని సాధ్యమైనంత త్వరగా తగ్గించి, సౌర, పవన, హైడ్రో ఇంథనం వినియోగం లోకి తీసుకురావాలని నివేదిక సూచనలు చేసింది.