Saturday, November 23, 2024

వాహనాల కాలుష్యంతో ఓజోన్ అధికం

- Advertisement -
- Advertisement -

రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్న శ్వాసకోశ, ఆస్తమా సమస్యలు
అప్రమత్తంగా ఉండాలని పిసిబి, వైద్య నిపుణుల హెచ్చరిక

Air Pollution with vehicles

మనతెలంగాణ/హైదరాబాద్:  గత సంవత్సరం కోవిడ్ కలకలంతో వ్యక్తిగత వాహనాల వినియోగం అనూహ్యంగా పెరిగింది. దీంతో పలు పట్టణాల్లోని ప్రధాన రహదారులపై గంటల తరబడి ట్రాఫిక్ రద్దీ పెరుగుతోంది. వాహనాలు వదులుతున్న కాలుష్యంతో రాష్ట్రవ్యాప్తంగా భూస్థాయి ఓజోన్ మోతాదు క్రమంగా అధికమవుతోందని కాలుష్య నియంత్రణ మండలి (పిసిబి) పరిశీలనలో తేలింది. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా శ్వాసకోశ సమస్యలు, ఆస్తమా, క్రానిక్ బ్రాంకైటిస్, సైనస్ సమస్యలు పెరగడానికి ప్రధాన కారణం వాతావరణ మార్పులు, వాయు కాలుష్యమేనని పర్యావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ఓజోన్ మోతాదు పెరగడంతో ముఖ్యంగా జిహెచ్‌ఎంసి పరిధిలో నగరవాసులు ఆస్తమా, బ్రాంకైటిస్ తదితర శ్వాసకోశ వ్యాధులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారని, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాహనాల నుంచి వెలువడుతోన్న కాలుష్య ఉద్గారాలతో పాటు ఓజోన్ వాయువు పెరగడంతో రాష్ట్రవ్యాప్తంగా పలు పట్టణాలతో పాటు నగర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పిసిబి తన అధ్యయనంలో తేల్చింది.

భూ ఉపరితల వాతావరణాన్ని ఆవహిస్తోన్న ఓజోన్
ట్రాఫిక్ అత్యధికంగా ఉండే ఉదయం, సాయంత్రం సమయంలో పలు ప్రధాన రహదారులపై వాహనాలు వెదజల్లే పొగతో పాటు నైట్రోజన్ ఆక్సైడ్స్, ఓలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్‌లు ఒకేచోట కలవడంతో పాటు సూర్యరశ్మి ప్రభావంతో భూ ఉపరితల వాతావరణాన్ని ఓజోన్ దట్టంగా ఆవహిస్తోంది. దీంతో తరచూ ట్రాఫిక్ రద్దీలో చిక్కుకుంటున్న ప్రయాణికులు, వాహనదారులు, చిన్నారులు, వృద్ధులు కాలుష్యం బారిన పడుతున్నారని ఈ అధ్యయనంలో పిసిబి అధికారులు తేల్చారు.

వంద మైక్రోగ్రాములకు మించరాదు

ప్రమాణాల మేరకు ఘనపు మీటరుగాలిలో భూస్థాయి ఓజోన్ మోతాదు వంద మైక్రోగ్రాములకు మించరాదు. కానీ, నగరంలోని ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండే సుమారు వంద కూడళ్లలో ఘనపు మీటరు గాలిలో 80 నుంచి -100 మైక్రోగ్రాములుగా నమోదవుతుండడంతో పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఓజోన్ వల్ల కలిగే అవస్థలు…

అస్తమా, బ్రాంకైటిస్‌తో బాధపడేవారి సంఖ్య పెరుగుతుంది. ట్రాఫిక్ రద్దీలో పాల్గొనే వేలాది మంది తరచూ దీనిబారిన పడుతున్నారు. గొంతునొప్పి, ముక్కుపుటాలు దెబ్బతినడం, కళ్లు మండడం వంటి సమస్యలు పెరుగుతాయి. ఊపిరితిత్తుల పనితీరు దెబ్బతినడం, ఛాతీలో అసౌకర్యంగా ఉండడం. మోటారు వాహనాల పొగలో ఉన్న సూక్ష్మ, స్థూల ధూళికణాలైన పిఎం10, పిఎం 2.5, ఆర్‌ఎస్‌పిఎంలు పీల్చేగాలిలో చేరి నేరుగా ఊపిరితిత్తుల్లో చేరి తీవ్రమైన శ్వాసకోశవ్యాధులు, పొడిదగ్గు, బ్రాంకైటిస్‌కు కారణమవుతున్నాయి. దుమ్ము, ధూళి కళ్లలోకి చేరడంతో కంటి రెటీనా దెబ్బతింటోంది. చికాకు, అసహనం, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది తలెత్తుతోంది. తలనొప్పి, పార్శ్వపు నొప్పి కలుగుతాయి. ధూళి కాలుష్య మోతాదు క్రమంగా పెరుగుతుంటే ఊపిరితిత్తుల క్యాన్సర్లు పెరిగే ప్రమాదం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News