Friday, November 22, 2024

రాష్ట్రవ్యాప్తంగా గాలి నాణ్యత ఆందోళనకరం

- Advertisement -
- Advertisement -

పూర్తిస్థాయిలో కంట్రోల్ చేయడానికి పలు శాఖలతో ప్రణాళికలు
మిగతా రాష్ట్రాల్లో ఎయిర్ క్వాలిటీపై
అధ్యయనం చేయనున్న పలు శాఖల అధికారులు
పలు జిల్లాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అధికంగా నమోదు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా గాలి నాణ్యత ఆందోళనకరంగా మారడంతో ప్రభుత్వం దానిని పూర్తిస్థాయిలో కంట్రోల్ చేయడానికి పలు శాఖలతో ప్రణాళికలు రూపొందిస్తోంది. అందులో భాగంగా పురపాలక శాఖ, హెచ్‌ఎండిఏ, పిసిబి, అటవీశాఖ, రవాణా శాఖ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా గాలి కాలుష్యాన్ని తగ్గించడానికి చేపట్టాల్సిన అంశాలపై విధి, విధానాలను రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇతర రాష్ట్రాల్లో గాలి కాలుష్యాన్ని తగ్గించడానికి చేపడుతున్న విధానాలపై అధ్యయనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఆ దిశగా ఆయా శాఖల అధికారులు కొన్ని రాష్ట్రాల్లో పర్యటించి రాష్ట్రంలో గాలి నాణ్యతను పెంచడానికి చేపట్టాల్సిన విధానాలపై అధ్యయనం చేయనున్నారు.

వాయు నాణ్యత సూచిక అధిక స్థాయిలకు

ఇప్పటికే రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పిసిబి) గాలి నాణ్యత ఆందోళనలను తగ్గించడంతో పాటు దానిని నియంత్రించాలన్న లక్ష్యంతో పలు కార్యక్రమాలను ప్రారంభించింది. ఇటీవల పిసిబి మెంబర్ సెక్రటరీ రవి గుగులోతు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అధ్వాన్నంగా ఉన్న గాలి నాణ్యతను ఎదుర్కొవడానికి అధికారులు వ్యూహాలపై చర్చించారు. ఈ వ్యూహాలను రాష్ట్ర- నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికలో చేర్చే విషయమై ఈ సమావేశంలో చర్చించారు. అటవీ, పర్యావరణ మంత్రి కొండా సురేఖ ఆదేశాల మేరకు పలు శాఖల అధికారులు సమావేశమై నాణ్యతను పెంచేలా కృషి చేస్తున్నారు. ఈ సమావేశంలో భాగంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన నివేదికలను సైతం అధికారులు అధ్యయనం చేశారు. అందులో వాయు కాలుష్యాన్ని పరిష్కరించడానికి ఒక సమగ్ర ప్రణాళికను అభివృద్ధి చేయాలని పలు శాఖల అధికారులు నిర్ణయించారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వాయు నాణ్యత సూచిక (ఏక్యూఐ) సంబంధిత స్థాయిలకు చేరుకోవడంతో చేపట్టాల్సిన అంశాలపై అధ్యయనం చేయాలని అధికారులు నిర్ణయించారు. అయితే గాలి నాణ్యతకు సంబంధించి వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టాల్సిన అంశాలపై పలు శాఖల అధికారులు కూలకూషంగా చర్చించారు.

23 రోజుల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వందకు పైగా నమోదు

రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన పట్టణాల్లో ఎయిర్ క్వాలిటీ పడిపోతోంది. పట్టణాల పరిధిని విస్తరించడం, నిర్మాణాలు, వాహనాలు, పరిశ్రమలు పెరిగిపోతుండటం లాంటి కారణాల వల్ల వాయు కాలుష్యం పెరిగిపోతోంది. దీనివల్ల గాలిలో కాలుష్య కారకాలైన పార్టిక్యులేట్ మ్యాటర్ (పిఎం) 2.5, పిఎం 10 స్థాయిలు పెరుగుతున్నాయి. రాష్ట్రంలోని 23 రోజుల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) వందకు పైగా నమోదవుతున్నాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. హన్మకొండ, వరంగల్‌లో హైదరాబాద్‌కు మించి ఏక్యూఐ నమోదం కావడం ఇబ్బందికర అంశమని అధికారులు గుర్తించారు. వరంగల్‌లో ఏక్యూఐ 143 ఉండగా, పిఎం 2.5 స్థాయిలు క్యూబిక్ మీటర్ గాలిలో 59 మైక్రోగ్రాముల మేర ఉన్నట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాదిలో ఏక్యూఐ సగటు 120 ఉండగా దాదాపు 180 రోజుల పాటు అదే స్థాయిలో ఏక్యూఐ రికార్డు అవుతోందని అధికారులు గుర్తించారు. హన్మకొండలో ఏక్యూఐ 130 ఉండగా పిఎం 2.5 స్థాయిలు క్యూబిక్ మీటర్ గాలిలో 48 మైక్రోగాముల వరకు ఉన్నాయి. ఈ ఏడాదిలో ఏక్యూఐ సగటు 116 ఉండగా 179 రోజుల్లో అంతేస్థాయిలో ఏక్యూఐ రికార్డు అయ్యింది.

పది జిల్లాల్లో ఏక్యూఐ స్థాయి 75 నుంచి 99ల మధ్య

మరోవైపు కరీంనగర్, నిజామాబాద్, జగిత్యాల, హైదరాబాద్, మిర్యాలగూడ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ తదితర జిల్లాల్లో కూడా ఏక్యూఐ 110 కన్నా ఎక్కువగానే ఉంటోందని అధికారుల అధ్యయనంలో తేలింది. హైదరాబాద్‌లో ఏక్యూఐ 128 ఉండగా పిఎం 2.5 స్థాయిలు 46 గ్రాముల మేర నమోదు కావడం విశేషం. ఈ ఏడాదిలో చూసుకుంటే మొత్తం 166 రోజుల పాటు గాలి నాణ్యత అత్యంత తక్కువగా నమోదవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇక ఏక్యూఐ స్థాయి 50 దాటిందంటే అది చెడు గాలిగా పిసిబి శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. పది జిల్లాల్లో ఏక్యూఐ స్థాయి 75 నుంచి 99ల మధ్య ఉండగా ఇక మిగతా జిల్లాల్లో 100 నుంచి 149 మధ్య నమోదవుతోంది. 50 నుంచి 100 మధ్య ఏక్యూఐ ఉంటే గాలి నాణ్యతను స్వచ్ఛమైన క్వాలిటీగా పరిగణిస్తారు. 100 నుంచి 150 వరకు ఉంటే అన్‌హెల్త్‌గా, 150 నుంచి 200 మధ్య ఉంటే అత్యంత అనారోగ్యకరంగా, 200ల నుంచి -300ల మధ్య ఉంటే ప్రమాదకరంగా భావిస్తారు. ఇక 300 దాటితే అత్యంత ప్రమాదకరంగా చెబుతారు. అయితే ఇప్పుడు తెలంగాణ ఏక్యూఐ అన్‌హెల్త్ స్థానంలో ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

పటాన్‌చెరు, తాండూరు, పరిగి, నల్గొండ

అయితే గాలి నాణ్యత పెంచాలంటే ముఖ్యంగా పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యాన్ని, మైనింగ్ పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యాన్ని అరికట్టడంతో పాటు వాహనాల నుంచి వెలువడే కాలుష్యంపై దృష్టి సారించాలని ఆయా శాఖల అధికారులు ఒక అంచనాకు వచ్చారు. భారీ మైనింగ్ కార్యకలాపాలు ఉన్న ప్రాంతాల వద్ద గాలి నాణ్యత కోసం ఎలాంటి చర్యలు చేపట్టాలన్న దానిపై అధికారులు ప్రణాళికలు రూపొందిస్తు న్నారు. పటాన్‌చెరు, తాండూరు, పరిగి, నల్గొండ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో గాలి నాణ్యత తక్కువగా ఉందని అధికారులు ఇటీవల గుర్తించారు. ఇటీవల పటాన్‌చెరు, నల్గొండలు వరుసగా గాలినాణ్యత 105, 100 ఏక్యూఐగా నమోదయ్యిందని దీనివల్ల ఆయా ప్రాంతాలను అనారోగ్యకరమైన ప్రాంతంగా పరిగణించాలని అధికారులు గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News