Sunday, January 19, 2025

ప్రయాణికుడి వీరంగం… విమానం గాల్లో ఉండగా ఎమర్జెన్సీ డోర్ తీయబోయి..

- Advertisement -
- Advertisement -

బోస్టన్ : విమానంలో ప్రయాణికులు అభ్యంతరకరంగా ప్రవర్తించడం, అడ్డుకున్న సిబ్బందిపై దాడికి పాల్పడుతున్న సంఘటనలు ఇటీవల తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అమెరికాకు చెందిన విమానంలో ఓ ప్రయాణికుడు వీరంగం సృష్టించాడు. విమానం గాల్లో ఉండగా, అత్యవసర ద్వారాన్ని తెరిచేందుకు ప్రయత్నించాడు.

వద్దని చెప్పినందుకు సిబ్బందిపై ఏకంగా దాడికి పాల్పడ్డాడు. లాస్ ఏంజెల్స్ నుంచి బోస్టన్ వెళ్తున్న యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అధికారుల కథనం ప్రకారం… గత ఆదివారం యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం లాస్‌ఏంజెల్స్ నుంచి బోస్టన్ బయల్దేరింది. విమానం మరో 45 నిమిషాల్లో ల్యాండ్ అవుతుందనగా, ఒక ఎమర్జెన్సీ డోర్ అన్‌లాక్ అయినట్టు కాక్‌పిట్‌లో అలారమ్ మోగింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది ఆ ద్వారాన్ని తనిఖీ చేయగా… డోర్ లాకింగ్ హ్యాండిల్‌ను ఎవరో లాగినట్టు కనిపించింది.

దీంతో వెంటనే సిబ్బంది ఆ లాకింగ్‌ను సరిచేయడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ వద్ద కొంతసేపు ఉన్నాడని, అతడే దాన్ని తీసి ఉంటాడని ఓ సిబ్బంది, కెప్టెన్‌కు సమాచారమిచ్చారు. అదే విషయం గురించి ఆ ప్రయాణికుడిని అడగ్గా, అతడు సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. సిబ్బందిలో ఒకరి మెడపై తీవ్రంగా కొట్టడమే గాక, పదునైన వస్తువుతో పొడిచేందుకు ప్రయత్నించాడు. తోటి ప్రయాణికులు గమనించి అతడిని అడ్డుకున్నారు. విమానం బోస్టన్‌లో దిగగానే విమాన సిబ్బంది ఎయిర్‌పోర్టు అధికారులకు సమాచారమిచ్చారు.

దీంతో వారు ఆ ప్రయాణికుడిని అదుపు లోకి తీసుకున్నారు. నిందితుడిని మసాచుసెట్స్‌కు చెందిన ఫ్రాన్సిస్కో సెవెరో టోరెస్‌గా గుర్తించారు. ఈ సంఘటనపై యునైటెడ్ ఎయిర్‌లైన్స్ స్పందించింది. తమ సిబ్బంది అప్రమత్తతతో విమాన ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పిందని, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు జరగలేదని తెలిపింది. హింసాత్మక ప్రవర్తనను తాము ఎన్నటికీ సహించబోమని పేర్కొన్న ఎయిర్‌లైన్స్ … నిందితుడు టోరెస్ భవిష్యత్తులో తమ విమానాల్లో ప్రయాణించకుండా నిషేధం విధించినట్టు వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News