భారతీ ఎయిర్‌టెల్ సిఇఒ గోపాల్ విఠల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సమీప భవిష్యత్తులో మొబైల్ చార్జీలను గణనీయంగా పెంచవలసిన అవసరం ఉందని సిఇఒ సూచించారు. ప్రస్తుతం ప్రతి వినియోగదారుడిపై సంస్థ సగటు ఆదాయం (ఎఆర్‌పియు) సుమారు రూ. 200గా ఉందని, నిజానికి ఇది దాదాపు రూ. 300 ఉండాలని గోపాల్ విఠల్ తెలిపారు. రూ. 300కు పెంచినప్పటికీ ప్రపంచంలోనే ఇదే అత్యల్ప ఎఆర్‌పియుగా ఉంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆర్థిక సంవత్సరం 2024 నాలుగవ త్రైమాసికానికి ఎయిర్‌టెల్ ఎఆర్‌పియు రూ. 209కి చేరుకుందని, 2023 నాలుగవ త్రైమాసికంలో ఇది రూ. 193గా ఉందని ఆయన తెలియజేశారు.
టెలికమ్ రంగంలో టారిఫ్ రేట్లలో ప్రధాన సవరణ చేయవలసిన అవసరం ఉందని విఠల్ సూచించారు. గత రెండు త్రైమాసికాల్లో ఎఆర్‌పియులో పెరుగుదల ఉందని, అయితతే, మరిన్ని హెచ్చింపులు అవసరమని ఆయన అన్నారు. ఎయిర్‌టెల్ నాలుగవ త్రైమాసిక ఫలితాల ప్రకటన సందర్భంగా సిఇఒ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలను బట్టి చూస్తే త్వరలోనే ఎయిర్‌టెల్ రీచార్జ్ ప్లాన్స్ రేట్లు గణనీయంగా పెరగవచ్చుననే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ధరల హెచ్చింపుపై సిఇఒ సంకేతాలు ఇచ్చారని విశ్లేషిస్తున్నారు. భవిష్యత్తులో ఎయిర్‌టెల్ ప్లాన్‌లు మరింత ఖరీదైనవిగా మారడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.