జూన్ త్రైమాసికంలో 63 శాతం నష్టం
న్యూఢిల్లీ : టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్ ఇంకా ఒత్తిడిని ఎదుర్కొంటోంది. జూన్ ముగింపు నాటి త్రైమాసిక ఫలితాల్లో తంపెనీ నికర లాభం రూ.283 కోట్లతో 63 శాతం పడిపోయింది. గతేడాది ఇదే సమయంలో సంస్థ లాభం రూ.759 కోట్లుగా ఉంది. కంపెనీ మార్కెట్ విశ్లేషకుల అంచనాలను అందుకోలేకపోయింది. కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా ఈసారి కంపెనీ ఆశించిన మేరకు రాణించలేదు. గతేడాది ఎజిఆర్ బకాయిలకు కేటాయింపుల వల్ల భారతీ ఎయిర్‌టెల్ 2020 జూన్ త్రైమాసికంలో రూ.15,933 కోట్ల భారీ నష్టాలను నమోదు చేసింది. ఆ తర్వాత త్రైమాసికాల్లో క్రమంగా కంపెనీ కోలుకుంటూ వస్తోంది. అయితే ఈసారి కరోనా వల్ల మళ్లీ లాభాలు తగ్గాయి. అయితే కంపెనీ ఆదాయం రూ.26,853 కోట్లతో 4.2 శాతం పెరిగింది.
అదానీ లాభం 77 శాతం జంప్
అదానీ పోర్ట్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ లిమిటెడ్ క్యూ1(ఏప్రిల్‌జూన్) ఫలితాల్లో అద్భుతంగా రాణించింది. కంపెనీ నికర లాభం రూ.1,342 కోట్లతో 77 శాతం వృద్ధిని సాధించింది. గతేడాది ఇదే సమయంలో సంస్థ లాభం రూ.758 కోట్లుగా ఉంది. కంపెనీ రెవెన్యూ గతేడాది రూ.2,293 కోట్లతో పోలిస్తే రూ.4,557 కోట్లకు పెరిగింది.
డాబర్ లాభం రూ.438 కోట్లు
జూన్ త్రైమాసిక ఫలితాల్లో ఎఫ్‌ఎంసిజి కంపెనీ డాబర్ లాభం 28.4 శాతం పెరిగి రూ.438.3 కోట్లకు పెరిగింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో లాభం రూ.341.3 కోట్లుగా ఉంది. అదే సమయంలో కంపెనీ ఆదాయం 32 శాతం పెరిగింది. ఆదాయం గతేడాదిలో రూ.1980 కోట్ల నుంచి రూ.2611.5 కోట్లకు పెరిగింది.
15% తగ్గిన బిఒఐ లాభం
జూన్ త్రైమాసికంలో బ్యాంక్ ఆఫ్ ఇండియా(బిఒఐ) నికర లాభం రూ.720 కోట్లతో 14.7 శాతం తగ్గింది. గతేడాది ఇదే సమయంలో సంస్థ లాభం రూ.844 కోట్లుగా ఉంది. నికర వడ్డీ ఆదాయం రూ.3,481 కోట్ల నుంచి రూ.3,145 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ మార్జిన్ 2.48 శాతం నుంచి 2.16 శాతానికి తగ్గింది.