వాషింగ్టన్: ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా భారతీయ సంతతికి చెందిన అజయ్ బంగా శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా ఒక భారతీయ వ్యక్తి నియమితులు కావడం ఇదే ప్రథమం.
ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లలో ఒకరైన 63 సంవత్సరాల అజయ్ బంగా ప్రపంచ బ్యాంకు 14వ అధ్యక్షుడిగా ఐదేళ్ల పదవీకాలానికి మే 3న ఎంపికయ్యారు. అజయ్ బంగాను ప్రపంచ బ్యాంకు అధ్యక్ష పదవికి అమెరికా నామినేట్ చేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గత ఫిబ్రవరిలో ప్రకటించారు.
వరల్డ్ బ్యాంక్ గ్రూపునకు నూతన అధ్యక్షుడిగా అజయ్ బంగాను స్వాగతిస్తున్నట్లు వరల్డ్ బ్యాంకు ఒక ట్వీట్‌లో పేర్కొంది. ప్రపంచం నుంచి పేదరికాన్ని నిర్మూలించడానికి తాము అంకితమైనట్లు ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జీవా ఒక ట్వీట్‌లో అజయ్ బంగాకు శుభాకాంక్షలు తెలిపారు.