ఎమ్మెస్కే ప్రసాద్
ముంబై: సౌతాఫ్రికాతో జరిగే టెస్టు సిరీస్‌లో సీనియర్ ఆటగాడు అజింక్య రహానె మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచడం ఖాయమని మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ జోస్యం చెప్పాడు. విదేశీ పిచ్‌లపై రాణించే సత్తా రహానెకు ఉందన్నాడు. అందుకే సెలెక్టర్లు సౌతాఫ్రికా సిరీస్‌లో చోటు కల్పించారని అభిప్రాయపడ్డాడు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా తట్టుకుని ముందుకు సాగే బ్యాటర్లలో రహానె ఒకడన్నాడు. అతనిపై చిన్నచూపు చూడడం సరికాదన్నాడు. భారత క్రికెట్‌కు లభించిన అత్యుత్తమ బ్యాటర్లలో రహానెది ప్రత్యేక స్థానమన్నాడు. ఎంతటి పెద్ద బౌలర్‌కైనా చుక్కలు చూపించే సత్తా అతని సొంతమన్నాడు. ఇక దక్షిణాఫ్రికా సిరీస్ అతనికి సవాల్ వంటిదేనన్నాడు. టీమిండియాలో చోటు కాపాడుకోవాలంటే రానున్న సిరీస్‌లో మెరుగైన బ్యాటింగ్ కనబరచడం తప్పించి మరో మార్గం అతనికి లేకుండా పోయిందన్నాడు. యువ ఆటగాళ్ల రాకతో రహానెకు విపరీత పోటీ నెలకొందన్నాడు. ఈసారి విఫలమైతే మాత్రం జాతీయ జట్టులో చోటు కాపాడుకోవడం దాదాపు అసాధ్యమేనని ప్రసాద్ స్పష్టం చేశాడు. ఇక సౌతాఫ్రికా సిరీస్‌లో టీమిండియాకే గెలుపు అవకాశాలు అధికంగా ఉన్నాయన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత జట్టు సమతూకంగా కనిపిస్తుందన్నాడు. దీంతో ఈ సిరీస్‌లో విరాట్ సేన ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుందని పేర్కొన్నాడు.